
ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన తర్వాత ఆ తర్వాత రెండు వరుస విజయాలతో కమ్‌బ్యాక్ ఇచ్చింది ముంబై ఇండియన్స్. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ చివరి బంతికి గెలిచి ఊపిరి పీల్చుకున్న ముంబై ఇండియన్స్.. కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలిచి ఘన విజయం అందుకుంది...
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ఆడేందుకు భాగ్యనగరానికి చేరుకుంది ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ టీమ్‌లో ఉన్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, ముంబై ఇండియన్స్ టీమ్‌కి తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చాడు. ఈ విందుకు సచిన్ టెండూల్కర్‌తో పాటు గత మ్యాచ్‌లో ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా వచ్చాడు...
అలాగే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాంత్ శర్మ, డేవాల్డ్ బ్రేవిస్, పియూష్ చావ్లా తదితరులు హాజరయ్యారు. తన ఇంట్లో ముంబై ఇండియన్స్ ప్లేయర్లతో దిగిన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన తిలక్ వర్మ.. ‘ముంబై ఇండియన్స్ ఫ్యామిలీకి మా ఇంట్లో విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా, గర్వంగా అనిపించింది. మా కుటుంబానికి ఇదో అద్భుతమైన సమయం. ఎప్పటికీ మరిచిపోలేను. వచ్చినందుకు థ్యాంక్యూ...’ అంటూ కాప్షన్ జోడించాడు..
ఐపీఎల్ 2023 సీజన్‌లో 4 మ్యాచులు ఆడిన తిలక్ వర్మ, 59 సగటుతో 150 స్ట్రైయిక్ రేటుతో 177 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఉన్న తిలక్ వర్మ, అద్భుత ఇన్నింగ్స్‌తో క్రికెట్ విమర్శకుల మన్ననలు అందుకుంటున్నాడు..
మొదటి మూడు మ్యాచుల్లో విఫలమైన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్... కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చారు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 58 పరుగులు చేయగా తాత్కాలిక సారథిగా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు...
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన తర్వాత వరుసగా రెండు విజయాలు అందుకుని జోష్‌లో ఉంది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో హారీ బ్రూక్ సెంచరీతో అదరగొట్టాడు. సన్‌రైజర్స్ కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు.
ముంబై ఇండియన్స్ తరుపున ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన మయాంక్ మర్కండే, ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో కీ బౌలర్‌గా మారాడు. దీంతో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సొంత మైదానంలో తిలక్ వర్మ ఎలా ఆడతాడు? తన మాజీ టీమ్‌పై మయాంక్ మర్కండే ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది..
ఇంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ఆడేందుకు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ టీమ్‌లో ఉన్న మన బౌలర్ మహ్మద్ సిరాజ్, తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తల్లి కూడా తెలుగు మహిళే...