లాస్ట్ మ్యాచ్‌లో రాయుడుకు లైఫ్ లాంగ్ మెమోరీ ఇచ్చిన ధోని.. ట్రోఫీని స్వీకరించమని పిలుపు..

Published : May 30, 2023, 11:54 AM ISTUpdated : May 30, 2023, 11:55 AM IST
లాస్ట్ మ్యాచ్‌లో రాయుడుకు లైఫ్ లాంగ్ మెమోరీ ఇచ్చిన ధోని.. ట్రోఫీని స్వీకరించమని పిలుపు..

సారాంశం

IPL 2023 Final: ఐపీఎల్ -16 ఫైనల్‌లో తన కెరీర్ లాస్ట్ మ్యాచ్ ఆడిన  ఆంధ్రా ఆటగాడు అంబటి రాయుడుకు  చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. సమున్నతంగా గౌరవమిచ్చాడు.

ఐపీఎల్-16 ఫైనల్ మ్యాచ్ (మే 28న)  కు ముందు ‘ఇదే నా కెరీర్ లో లాస్ట్ మ్యాచ్.. ఇక యూటర్న్ లు ఏమీ లేవు. ఫైనల్ తర్వాత రిటైర్ అవుతా..’ అని  ప్రకటించిన చెన్నై సూపర్ కింగ్స్ మిడిలార్డర్ బ్యాటర్  అంబటి రాయుడుకు ఆ  జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని జీవితాంతం  గుర్తుంచుకునే మెమోరీని అందించాడు.  ఫైనల్ లో గెలిచి  బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ  జై షా నుంచి ట్రోఫీ అందుకునే క్రమంలో తాను కాకుండా   రాయుడు,  జడేజాలను పిలిచి వారికి  కప్ అందించాడు మహి.. 

పోస్ట్ మ్యాచ్  ప్రజెంటేషన్‌లో భాగంగా  హర్షా భోగ్లేతో మాట్లాడిన అనంతరం ధోని కప్ తీసుకోవడానికి పోడియం ఎక్కాడు. ట్రోఫీ అందుకునే క్రమంలో  ధోని..  పోడియం కింద ఉన్న రాయుడు,  జడేజాలను పైకి రమ్మని పిలిచాడు. తాను పక్కకు తప్పుకుని.. రోజర్ బిన్నీ, జై షాలను రాయుడుకు ట్రోఫీ అందించాలని  కోరాడు. 

ధోని కోరిక మేరకు బిన్నీ, షా లు కూడా  రాయుడుకే ట్రోఫీ అందజేశారు.  ఆ తర్వాత  బీసీసీఐ బాసులు  జడేజాను అభినందించారు.  ట్రోఫీ అందుకునే క్రమంలో రాయుడు కళ్లల్లో ఆనందబాష్పాలు  కదిలాయి.  పోడియం దిగి కిందకు వస్తున్న రాయుడు.. ఉబికివస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ తన సహచర చెన్నై ఆటగాళ్లతో  సీఎస్కే విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. 

 

కాగా నిన్నటి మ్యాచ్ లో   రాయుడు.. చెన్నై విజయాలలో కీలక పాత్ర పోషించాడు. 12 ఓవర్లకు  చెన్నై స్కోరు 3 వికెట్ల నష్టానికి 133 పరుగులుగా ఉండగా మోహిత్ శర్మ వేసిన 13వ ఓవర్లో రాయుడు 6, 4, 6తో  సీఎస్కే విజయాన్ని మరింత చేరువ చేశాడు.  ఆడింది 8 బంతులే అయినా  1 బౌండరీ, రెండు భారీ సిక్సర్లతో  19 పరుగులు చేసి తన ఫైనల్ మ్యాచ్ ను మరింత మెమొరెబుల్ గా మలుచుకున్నాడు.

మ్యాచ్ అనంతరం ధోని కూడా రాయుడుపై ప్రశంసలు కురిపించాడు. ధోని మాట్లాడుతూ.. ‘రాయుడు టీమ్ లో ఉంటే నేనెప్పుడూ ఫెయిర్ ప్లే అవార్డు తీసుకోను (నవ్వుతూ).. మేం మ్యాచ్ గెలవకముందే అతడు సెలబ్రేషన్స్ చేసుకుంటాడు.  ఫీల్డ్ లో కూడా దూకుడుగా ఉంటాడు. మేం ఇద్దరం ఇండియా ‘ఎ’కు ఆడాం. భారత జట్టుకూ కలిసే ఆడాం.  స్పిన్, పేస్ ను సమర్థవంతంగా ఆడటంలో రాయుడు దిట్ట.   రాయుడు కూడా నాలాంటోడే. తాను కూడా ఫోన్ ఎక్కువగా వాడడు.  రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అతడి తర్వాతి దశ కూడా ఆనందంతో గడపాలి..’అని  చెప్పుకొచ్చాడు.  

కాగా ఐపీఎల్‌లో రాయుడుకు ఇది ఆరో  టైటిల్ కావడం గమనార్హం. దీంతో  అతడు  అత్యధిక టైటిల్స్ నెగ్గిన రోహిత్ శర్మ (6 టైటిల్స్.. డెక్కన్ ఛార్జర్స్ లో ప్లేయర్ గా, ముంబై తరఫున సారథిగా ఐదు) రికార్డును సమం చేశాడు. రాయుడు  2013, 2015, 2017 లలో ముంబైకి.. 2018,  2021, 2023లో చెన్నైకి ఆడి ట్రోఫీలు నెగ్గాడు. 

 

PREV
click me!

Recommended Stories

Indian Cricket: టెస్టుల్లో 300, వన్డేల్లో 200, ఐపీఎల్‌లో 100.. ఎవరీ మొనగాడు?
IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?