IPL 2023: సాయి సుదర్శన్ సెన్సేషనల్ ఇన్నింగ్స్... చెన్నై సూపర్ కింగ్స్ ముందు భారీ టార్గెట్...

By Chinthakindhi RamuFirst Published May 29, 2023, 9:16 PM IST
Highlights

IPL 2023 ఫైనల్‌ మ్యాచ్‌లో 214 పరుగుల భారీ స్కోరు చేసిన గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఫైనల్ స్కోరు నమోదు... 

ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ని త్వరగా అవుట్ చేసినా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా హాఫ్ సెంచరీ, యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ సంచలన సెంచరీతో చెలరేగి గుజరాత్ టైటాన్స్‌కి భారీ స్కోరు అందించారు...

ఓపెనర్లు ఇద్దరూ ఆరంభంలో ఆచితూచి ఆడడంతో మొదటి 2 ఓవర్లలో 8 పరుగులు మాత్రమే వచ్చాయి. 2 పరుగుల వద్ద శుబ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌ని దీపక్ చాహార్ జారవిడిచాడు. ఆ తర్వాత దీపక్ చాహార్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో 6, 4, 4 బాది 16 పరుగులు రాబట్టాడు వృద్ధిమాన్ సాహా. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు శుబ్‌మన్ గిల్..

ఆ తర్వాత 21 పరుగుల వద్ద వృద్ధిమాన్ సాహా ఇచ్చిన క్యాచ్‌ని కూడా జారవిడిచాడు దీపక్ చాహార్. 20 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, జడేజా బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు...

36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వృద్ధిమాన్ సాహా, ఐపీఎల్ ఫైనల్స్‌లో రెండోసారి 50+ స్కోరు నమోదు చేసిన మొట్టమొదటి వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 39 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, దీపక్ చాహార్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

తుషార్ దేశ్‌పాండే వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో 6, 4, 4, 4 బాది 20 పరుగులు రాబట్టిన సాయి సుదర్శన్, పథిరాణా వేసిన ఆఖరి ఓవర్‌లో వరుసగా 2 సిక్సర్లు బాదాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 96 పరుగులు చేసిన సాయి సుదర్శన్, పథిరాణా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు..

ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించిన రషీద్ ఖాన్ డకౌట్ కాగా హార్ధిక్ పాండ్యా 12 బంతుల్లో 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఐపీఎల్ ఫైనల్స్‌లో ఇదే అత్యధిక స్కోరు. ఇంతకుముందు 2016లో ఆర్‌సీబీపై సన్‌రైజర్స్ హైదరాబాద్ 208 పరుగులు చేసింది.  ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు బాదిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు సాయి సుదర్శన్. ఇంతకుముందు 2018లో షేన్ వాట్సన్ 117 పరుగులు చేయగా, 2014లో కేకేఆర్‌పై వృద్ధిమాన్ సాహా (పంజాబ్ కింగ్స్ తరుపున) 115 పరుగులు చేశాడు. 

click me!