
హమ్మయ్యా.. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కాస్త కుదుట పడింది. టాపార్డర్ బ్యాటర్ల వైఫల్యంతో దారుణ పరాజయాలు మూటగట్టుకుంటున్న ఆ జట్టు.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మాత్రం పోరాడే స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (36 బంతుల్లో 67, 12 ఫోర్లు, 1 సిక్స్) కు తోడు హెన్రిచ్ క్లాసెన్ (27 బంతుల్లో 53, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 197 పరగులు చేసింది. మరి బౌలర్లు ఈ లక్ష్యాన్ని కాపాడుకుంటారా..?
వరుసగా విఫలమవుతుండటంతో ఓపెనింగ్ జోడీని మార్చింది సన్ రైజర్స్. హ్యారీ బ్రూక్ ను మళ్లీ బ్యాటింగ్ ఆర్డర్లో కిందకు పంపింది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్ (5) లను పంపింది. ఓపెనర్లు మారినా సన్ రైజర్స్ రాత మారలేదు. ఇషాంత్ శర్మ వేసిన 3 ఓవర్లో రెండో బంతికే మయాంక్ అవుట్ అయ్యాడు.
రాహుల్ త్రిపాఠి తన వైఫల్యాల పరంపరను కొనసాగిస్తూ.. ఆరు బంతుల్లో పది పరుగులే చేసి మిచెల్ మార్ష్ బౌలింగ్ వేసిన ఐదో ఓవర్లో నాలుగో బంతికి మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్ మార్క్‌రమ్ (8) దీ అదే పరిస్థితి. ప్లేస్ మారినా హ్యారీ బ్రూక్ ఆట మారలేదు. ఆడిన రెండో బంతికే డకౌట్ అవుట్ అయ్యాడు.
ఒకవైపు ప్రధాన బ్యాటర్లు అంతా వెనుదిరుగుతున్నా అభిషేక్ మాత్రం రాణించాడు. 25 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్.. క్లాసెన్ తో కలిసి సన్ రైజర్స్ కు భారీ స్కోరు చేయడంలో సాయపడ్డాడు. ముఖేశ్ కుమార్ వేసిన 11 వ ఓవర్లో అభిషేక్ శర్మ 2 ఫోర్లు కొట్టగా క్లాసెన్ 4,6 బాదాడు. అభిషేక్ ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. అతడి స్థానంలో వచ్చిన అబ్దుల్ సమద్.. 21 బంతులలో 1 ఫోర్, 2 సిక్సర్లతో 28 పరుగులు చేశాడు. అతడిని మిచెల్ మార్ష్ ఔట్ చేశాడు.
చివర్లో క్లాసెన్ ధాటిగా ఆడటంతో సన్ రైజర్స్ స్కోరు 190 మార్క్ దాటింది. అకీల్ హోసెన్ (16 నాటౌట్) కూడా ఓ చేయి వేశాడు. నోర్జే వేసిన 20 ఓవర్లో క్లాసెన్.. రెండో బాల్ కు డబుల్ తీసి ఐపీఎల్ లో ఫస్ట్ ఫిఫ్టీ నమోదుచేసుకున్నాడు. 25 బంతుల్లోనే అతడి ఫిఫ్టీ పూర్తయింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ నాలుగు వికెట్లు తీశాడు. అక్షర్, ఇషాంత్ లకు తలా ఓ వికెట్ దక్కింది.