IPL 2023 DC vs SRH: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ఓడితే అస్సామే...

By Chinthakindhi RamuFirst Published Apr 29, 2023, 7:04 PM IST
Highlights

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్... వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్... 

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.  హైదరాబాద్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ, లో టార్గెట్‌ని కాపాడుకుంటూ విజయం అందుకుంది.. 

ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌ వేదికగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 145 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంటూ 7 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. బౌలర్లు అద్భుతంగా రాణించి, ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టినా, బ్యాటింగ్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది సన్‌ రైజర్స్ హైదరాబాద్...

Latest Videos

గత మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీసిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, హార్మ్‌స్టింగ్ గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. రూ.13.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన హారీ బ్రూక్, కేకేఆర్‌తో జరిగిన ఒకే ఒక్క మ్యాచ్‌లో సెంచరీతో ప్రతాపం చూపించాడు. అంతకుముందు, ఆ తర్వాత అతని బ్యాటు నుంచి మెరుపులు రాలేదు. 

హారీ బ్రూక్‌తో పాటు భారీ ఆశలు పెట్టుకున్న అయిడిన్ మార్క్‌రమ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసిన్ ఒక్కడే బ్యాటింగ్‌లో కాస్తో కూస్తో రాణిస్తున్నాడు. క్లాసిన్ కొద్ది సేపు మెరుపులు మెరిపిస్తున్నా, భారీ స్కోరు చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి విజయాన్ని అందించలేకపోతున్నాడు..

ఢిల్లీ క్యాపిటల్స్‌ది కూడా ఇదే కథ. డేవిడ్ వార్నర్ ఒక్కడిపైనే బ్యాటింగ్ భారాన్ని వేస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్. గత మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ ఒక్క ఓవర్‌లో మెరుపులు మెరిపించి అవుట్ అయ్యాడు. మనీశ్ పాండే, సర్ఫరాజ్ ఖాన్ పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోతున్నారు...

వరుసగా విఫలమవుతున్న పృథ్వీ షాని గత మ్యాచ్‌లో పక్కనబెట్టేసిన ఢిల్లీ క్యాపిటల్స్, నేటి మ్యాచ్‌లో కూడా అతన్ని ఆడించడం లేదు. 

ఫస్టాఫ్‌లో చెరో రెండు విజయాలు మాత్రమే అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానాల్లో ఉన్నాయి. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలవాలంటే ఈ రెండు జట్లకు విజయం అత్యవసరం...

గత మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చి మంచి బౌలింగ్ పర్ఫామెన్స్ ఇచ్చిన టి నటరాజన్‌ని తుది జట్టు నుంచి తప్పించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, అకీల్ హుస్సేన్‌కి అవకాశం ఇచ్చింది. అలాగే ఆల్‌రౌండర్ అబ్దుల్ సమద్‌కి తుది జట్టులో చోటు దక్కింది. 

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, మిచెల్ మార్ష్, మనీశ్ పాండే, ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్, రిపల్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఆన్రీచ్ నోకియా, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్

 సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది: హారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, అయిడిన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసిన్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, అకీల్ హుస్సేన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మర్కండే, ఉమ్రాన్ అక్మల్

 

click me!