ఆ ఇద్దరూ భయపెట్టినా ఆరెంజ్ ఆర్మీదే గెలుపు.. హ్యాట్రిక్ ఓటముల తర్వాత హైదరాబాద్‌కు తొలి విజయం

By Srinivas MFirst Published Apr 29, 2023, 11:13 PM IST
Highlights

IPL 2023, DC vs SRH: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో  సన్ రైజర్స్ హైదరాబాద్.. 9 పరుగుల తేడాతో విజయం సాధించింది.  

హ్యాట్రిక్ ఓటముల తర్వాత  ఢిల్లీ క్యాపిటల్స్ తో కీలక మ్యాచ్ ఆడిన  సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు మళ్లీ విజయాల బాట పట్టింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో  సన్ రైజర్స్ హైదరాబాద్.. 9 పరుగుల తేడాతో విజయం సాధించింది.  హైదరాబాద్ నిర్దేశించిన  198 పరుగుల లక్ష్య ఛేదనలో  ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు మాత్రమే చేయగలిగింది.  ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (35 బంతుల్లో 59, 9 ఫోర్లు), మిచెల్ మార్ష్ (39 బంతుల్లో 63, 1 ఫోర్, 6 సిక్సర్లు) లు భయపెట్టినా చివరికి ఆరెంజ్ ఆర్మీదే విజయం.  ఐదు ఓటముల తర్వాత వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న  ఢిల్లీకి నిరాశ తప్పలేదు. ఈ విజయంతో  సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో ముంబైని వెనక్కినెట్టి 8వ స్థానానికి ఎగబాకింది. 

198 పరుగుల లక్ష్య ఛేదనను ఢిల్లీ క్యాపిటల్స్ పేలవంగా ప్రారంభించింది.   ఫామ్ లో ఉన్న ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ను భువనేశ్వర్ ఫస్ట్ ఓవర్  లో రెండో బాల్ కే ఔట్ చేశాడు. 

Latest Videos

అయితే ఫస్ట్ డౌన్ లో వచ్చిన మిచెల్ మార్ష్ - మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ తో  కలిపి ఢిల్లీని ఆదుకున్నారు. ఇద్దరూ 11 ఓవర్లలో  112 పరుగులు జోడించారు.   సాల్ట్, మార్ష్ లు  పోటీ  పడి బౌండరీలు బాదారు.  ఈ ఇద్దరి దూకుడుతో  ఢిల్లీ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది.   ఏడో ఓవర్ వేసిన ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో సాల్ట్ రెండు బౌండరీలు కొట్టాడు. మార్ష్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్లో ఏకంగా 22 పరుగులొచ్చాయి. మయాంక్ మార్కండే వేసిన  పదో ఓవర్లో  రెండో బాల్ కు బౌండరీ తీయడం ద్వారా వీళ్ల భాగస్వామ్యంతో పాటు ఢిల్లీ స్కోరు కూడా వంద దాటింది.ఈ క్రమంలో ఈ ఇద్దరూ అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 

బ్రేక్ ఇచ్చిన మార్కండే..

లక్ష్యం దిశగా దూసుకుపోతున్న   ఢిల్లీకి స్పిన్నర్ మయాంక్  మార్కండే షాకిచ్చాడు. తొలుత   అతడు వేసిన  12వ ఓవర్లో ఫిలిప్ సాల్ట్..  అతడికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  ఆ మరుసటి ఓవర్లోనే అభిషేక్ శర్మ.. మనీష్ పాండే  (1) ను పెవిలియన్ కు పంపాడు.   అకీల్ హోసెన్  వేసిన  14వ ఓవర్లో ఢిల్లీకి మరో భారీ షాక్ తాకింది. మిచెల్ మార్ష్ భారీ షాట్ ఆడబోయి  మార్క్‌రమ్ చేతికి చిక్కాడు. మార్కండేనే వేసిన 16వ ఓవర్లో  ప్రియమ్ గార్గ్ (12).. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నటరాజన్ వేసిన  17వ ఓవర్లో  సర్ఫరాజ్ ఖాన్  (9)  క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

చివరి రెండు ఓవర్లలో.. 

వరుసగా  ఐదు వికెట్లు పడటంతో  ఢిల్లీ ఒత్తిడికి లోనైంది.  అయితే అక్షర్ పటేల్ (14 బంతుల్లో 29 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్సర్లు) క్రీజులో ఉండటంతో ఆ జట్టు విజయం పై ధీమాగా ఉంది.  చివరి రెండు ఓవర్లలో 35 పరుగులు చేయాల్సి ఉండగా   19వ ఓవర్ ను మార్క్‌రమ్.. నటరాజన్ కు అందజేశాడు. ఈ ఓవర్లో  9 పరుగులే వచ్చాయి. ఇచ చివరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా.. భువనేశ్వర్ వేసిన ఆ ఓవర్లో 16 పరుగులొచ్చాయి. ఫలితంగా ఢిల్లీ 188 పరుగుల వద్దే ఆగిపోయింది.  హైదరాబాద్ 9 పరుగుల తేడాతో గెలిచింది. 

 

We win. pic.twitter.com/2T0PlHKCOw

— SunRisers Hyderabad (@SunRisers)

అంతకుముందు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ (36 బంతుల్లో 67, 12 ఫోర్లు, 1 సిక్స్)  కు తోడు   హెన్రిచ్ క్లాసెన్  (27 బంతుల్లో 53, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు  6 వికెట్ల నష్టానికి 197 పరగులు చేసింది.

click me!