మిస్టర్ కూల్ వర్సెస్ మిస్టర్ కూల్.. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై

By Srinivas MFirst Published Apr 12, 2023, 7:03 PM IST
Highlights

IPL 2023: ఐపీఎల్ లో  వికెట్ల వెనుక ప్రశాంతంగా ఉంటూనే పనికానిచ్చే ఇద్దరు సారథులు  నేడు ముఖాముఖి తలపడబోతున్నారు.  చెన్నైలోని చెపాక్ స్టేడియంలో  చెన్నై 
సూపర్ కింగ్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య   ఆసక్తికర పోరు జరుగనున్నది. 

చెన్నై  సూపర్ కింగ్స్ సారథి  మహేంద్రసింగ్ ధోనిని అందరూ   ‘మిస్టర్ కూల్’ అని  పిలుస్తారు.  వికెట్ల వెనుక  ప్రశాంతంగా ఉంటూ   వ్యవహారాలు చక్కదిద్దడంలో ధోని దిట్ట. ధోని స్థాయిలో కాకపోయినా   రాజస్తాన్ రాయల్స్   కెప్టెన్ సంజూ శాంసన్ కూడా ఇంచుమించు ఈ లక్షణాలు కలిగిఉన్నవాడే.  నేడు ఈ ఇద్దరు ‘మిస్టర్ కూల్’ కెప్టెన్స్ సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య  నేడు ఆసక్తికర పోరు జరుగుతున్నది.   చెన్నైలోని చెపాక్ స్డేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై   ఫస్ట్ ఫీల్డింగ్ చేయనుంది. రాజస్తాన్ బ్యాటింగ్ కు రానుంది. 

ధోనికి ఈ మ్యాచ్ చాలా స్పెషల్.  2008 నుంచి  ఐపీఎల్ లో సీఎస్కేకు సారథిగా వ్యవహరిస్తున్న ధోని.. ఈ మ్యాచ్ ద్వారా చెన్నైకి  కెప్టెన్ గా 200  మ్యాచ్ ఆడబోతున్నాడు. గత సీజన్ లో కొన్ని మ్యాచ్ లు మినహా  ధోని  ఐపీఎల్ కెరీర్ అంతా  సీఎస్కేతోనే..

Latest Videos

టోర్నీ ఆరంభ  మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ తో ఓడిపోయిన  చెన్నై ఆ తర్వాత పుంజుకుంది.  చెన్నై వేదికగానే లక్నోతో  జరిగిన మ్యాచ్ తో  పాటు  ఈ సీజన్ ఫస్ట్ ‘ఎల్ క్లాసికో’ ముంబైతో   గెలిచి  జోరు మీదుంది.  ఈ మ్యాచ్  కూడా స్వంత గ్రౌండ్ లోనే జరుగుతుండటంతో  హ్యాట్రిక్ కొట్టాలని సీఎస్కే భావిస్తున్నది. 

చెన్నై  బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ తో పాటు ముంబై తో మ్యాచ్ లో వీరబాదుడు బాదిన అజింక్యా రహానే, డెవాన్ కాన్వే, శివమ్ దూబే, రవీంద్ర  జడేజా, ఎంఎస్  ధోనిలతో  చెన్నై బ్యాటింగ్ పటిష్టంగా ఉంది.  బౌలింగ్ లో తుషార్  దేశ్‌పాండే భారీగా పరుగులిస్తున్నా సీఎస్కే అతడిమీదే అతిగా  ఆధారపడుతోంది. న్యూజిలాండ్  నుంచి సిరీస్ ముగిసిన వెంటనే నేరుగా జట్టుతో కలిసిన లంక స్పిన్నర్  మహీశ్ తీక్షణ కు నేటి మ్యాచ్ లో  అవకాశం కల్పించింది.  స్పిన్ కు అనుకూలించే  చెపాక్ పిచ్ పై జడ్డూకు తోడు  తీక్షణ కూడా కలిస్తే అది  అగ్నికి ఆయువు తోడైనట్టే.  మోయిన్ అలీ కూడా ఈ మ్యాచ్ లో ఆడుతుండటం చెన్నైకి కలిసొచ్చేది. 

రాజస్తాన్ కూడా పంజాబ్ తో  మ్యాచ్ లో ఓటమి తర్వాత ఢిల్లీ క్యాపిటల్ష్ తో మ్యాచ్ లో  పుంజుకుంది. బట్లర్, జైస్వాల్, శాంసన్ లు అత్యద్భుత ఫామ్ లో ఉన్నారు.  షిమ్రన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్ లతో  పాటు హోల్డర్, అశ్కవిన్ లతో  ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ కూడా బలంగానే ఉంది.  బౌలింగ్ లో టాప్ స్పిన్నర్లు అశ్విన్, చాహల్ లు ఆ జట్టుకు అదనపు బలం. ట్రెంట్  బౌల్ట్ కూడా  జోరుమీదున్నాడు. అయితే నేటి మ్యాచ్  లో అతడు ఆడటం లేదు.  అశ్విన్  ఇక్కడి వాడే కావడంతో   చెపాక్ గురించి అతడికి అణువణువునా అవగాహన ఉంది. 
 

తుది జట్లు : 

చెన్నై సూపర్ కింగ్స్ :   రుతరాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మోయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ధోని (కెప్టెన్), సిసంద మగల, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్ 

రాజస్తాన్ రాయల్స్ : యశస్వి  జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, షిమ్రన్ హెట్మెయర్, ఆర్. అశ్విన్, జేసన్ హోల్డర్, కుల్దీప్  సేన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చహల్ 

click me!