విడువని వాన! ఐపీఎల్ 2023 ఫైనల్‌ రేపటికి వాయిదా... ఫలితం తేలేనా? చరిత్ర మారేనా...

By Chinthakindhi RamuFirst Published May 28, 2023, 11:07 PM IST
Highlights

రిజర్వు డేకి మారిన ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్‌... సోమవారం అహ్మదాబాద్‌లో వర్షం కురిసే అవకాశాలు తక్కువని వాతావరణ శాఖ అంచనా... 

ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్‌ రిజర్వు డేకి మారింది. ఆదివారం అహ్మదాబాద్‌లో భారీ వర్షం కురవడంతో టాస్ కూడా వేయకుండానే ఫైనల్ మ్యాచ్‌ని సోమవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు...

టాస్ సమయానికి అరగంట ముందు నుంచే అహ్మదాబాద్‌లో వర్షం మొదలైంది. 8:26కి వర్షం ఆగిపోవడంతో కవర్లను తొలగించిన గ్రౌండ్ సిబ్బంది, మ్యాచ్‌కి సిద్ధం చేసే పనిలో పడ్డారు. అయితే 8:32కి మళ్లీ భారీ వర్షం కురిసింది.

దీంతో తిరిగి కవర్లు గ్రౌండ్‌లోకి వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ 8:46కి వర్షం తగ్గడం, మళ్లీ టాస్ వేద్దామని అంపైర్లు నిర్ణయం తీసుకునేలోపు వర్షం కురవడం... ఇలా జరుగుతూ వచ్చింది.

పడుతూ, ఆగుతూ, పడుతూ, ఆగుతూ దోబూచులాటలు ఆగిన వర్షం కారణంగా పిచ్ తడవకుండా ఏర్పాట్లు చేసిన కవర్ల మీద వర్షపు నీటితో ఓ మినీ పౌండే తయారైంది. ఎట్టకేలకు 11 గంటల వరకూ వర్షం ఆగుతుందని చూసిన అంపైర్లు, వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో మ్యాచ్‌ని రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు..

16 ఏళ్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో రిజర్వు డేన ఐపీఎల్ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి. సోమవారం అహ్మదాబాద్‌లో వర్షం కురిసే అవకాశాలు చాలా తక్కువని వాతావరణ శాఖ తెలియచేసింది. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో రిజల్ట్ తేలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..

ఫైనల్ మ్యాచ్‌ని లైవ్‌లో చూసేందుకు టిక్కెట్లు  కొనుక్కున్నవాళ్లు, రేపు వాటిని స్టేడియానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.   


రేపు కూడా జోరు వానతో మ్యాచ్ నిర్వహించడం వీలు కాకపోతే గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకూ ఎప్పుడూ సంయుక్త విజేతలుగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. 

ఐపీఎల్ ఫైనల్ చరిత్రలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 9 సార్లు టైటిల్ గెలవగా, ఛేదించిన జట్లకు 6 సార్లు టైటిల్ దక్కింది. టాస్ గెలిచిన జట్లకు 9 సార్లు విజయం దక్కగా, 6 సీజన్లలో టాస్ ఓడిన జట్లకు టైటిల్ దక్కింది. 

ఇది చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ అంబటి రాయుడికి ఆఖరి ఐపీఎల్ మ్యాచ్. అనధికారికంగా సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ ఫైనల్ తర్వాత రిటైర్మెంట్ ఇస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే ధోనీ రిటైర్మెంట్ గురించి ఇంకా స్పష్టమైన క్లారిటీ కానీ ప్రకటన కానీ రాలేదు. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇంతకుముందు మూడు మ్యాచులకు వర్షం అంతరాయం కలిగించింది. పంజాబ్ కింగ్స్, కేకేఆర్ మధ్య మొహాలీలో జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా అంతరాయం కలగగా డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పంజాబ్ గెలిచింది. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య లక్నోలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది..

ఈ మ్యాచ్ రద్దు కావడంతో వచ్చిన పాయింట్‌తో లక్నో సూపర్ జెయింట్స్ లక్కీగా ప్లేఆఫ్స్‌కి వచ్చింది. ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ఆరంభానికి ముందు కూడా జోరువాన కురిసింది. అయితే మ్యాచ్ సమయానికి వాన ఆగిపోవడంతో పూర్తి ఓవర్ల పాటు మ్యాచ్ సాగింది.. 

click me!