ముంబై ఇండియన్స్‌కి ఊహించని షాక్ ఇచ్చిన అజింకా రహానే... సీఎస్‌కే చేతుల్లో చిత్తుగా ఓడిన రోహిత్ సేన..

By Chinthakindhi RamuFirst Published Apr 8, 2023, 10:52 PM IST
Highlights

IPL 2023 సీజన్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన అజింకా రహానే..  వరుసగా రెండో పరాజయాన్ని అందుకున్న ముంబై ఇండియన్స్... చెన్నై సూపర్ కింగ్స్‌కి వరుసగా రెండో విజయం.. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటకట్టుకుంది. డివాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, ధోనీ, జడేజా వంటి హిట్టర్లను అవుట్ చేయడం కోసం మాస్టర్ ప్లాన్స్ రచించుకుని వచ్చిన ముంబై ఇండియన్స్‌కి ‘లోకల్ భాయ్’ అజింకా రహానే ఊహించని షాక్ ఇచ్చాడు... సొంత గ్రౌండ్‌లో ముంబై బౌలర్లపై విరుచుకుపడి, చెన్నై సూపర్ కింగ్స్‌కి వరుసగా రెండో విజయాన్ని అందించాడు... 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్.

158 పరుగుల లక్ష్యఛేదనలో సున్నాకే తొలి వికెట్ కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్. 4 బంతులాడిన డివాన్ కాన్వేని బెహ్రెన్‌డార్ఫ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన అజింకా రహానే, బెహ్రాన్‌డార్ఫ్ బౌలింగ్‌లోనే సిక్సర్ బాది, తన ఉద్దేశాన్ని తెలియచేశాడు..

Latest Videos

అర్షద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో 6, 4, 4, 4, 4 బాది 23 పరుగులు రాబట్టిన అజింకా రహానే, కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో సిక్సర్ రాబట్టాడు. పియూష్ చావ్లా బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన అజింకా రహానే, 19 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2023 సీజన్‌లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ..

సీఎస్‌కే తరుపున 2014లో సురేశ్ రైనా 16 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదితే, ఆ తర్వాత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అజింకా రహానేదే. ముంబై ఇండియన్స్‌పై మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇది.  27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసిన అజింకా రహానే, పియూష్ చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి బౌండరీ లైన్ దగ్గర సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే అప్పటికే 8 ఓవర్లలోనే సగానికి పైగా టార్గెట్‌ని ఊదేసింది సీఎస్‌కే..

26 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసిన శివమ్ దూబే, కుమార్ కార్తికేయ బౌలింగ్‌లో వికెట్లపైకి ఆడుకుని అవుట్ అయ్యాడు. 16వ ఓవర్ వేసిన అమిత్ మిశ్రా కేవలం ఒక్క పరుగే ఇవ్వడం, ఆ తర్వాతి ఓవర్‌లో కేవలం 5 పరుగులు రావడంతో కాస్త ఉత్కంఠ రేగింది. అయితే బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో వరుసగా 2 ఫోర్లు బాదిన అంబటి రాయుడు హైడ్రామాకి తెరదించేశాడు. 

ఆ ఓవర్లలో 13 పరుగులు రావడంతో చివరి రెండు ఓవర్లలో చెన్నై విజయానికి 5 పరుగులే అవసరమయ్యాయి. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. శుభారంభం దక్కినా దాన్ని సరిగ్గా వాడుకోవడంలో విఫలమైన ముంబై, చెన్నై ముందు స్వల్ప టార్గెట్‌ని పెట్టింది.  మొదటి 4 ఓవర్లలో 38 పరుగులు రాబట్టింది ముంబై ఇండియన్స్. 13 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన రోహిత్ శర్మను తుషార్ దేశ్‌పాండే క్లీన్ బౌల్డ్ చేశాడు. 21 బంతుల్లో 5 ఫోర్లతో 32 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో డ్వేన్ ప్రిటోరియస్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 2 బంతుల్లో 1 పరుగు చేసిన సూర్యకుమార్ యాదవ్, మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

అంపైర్ వైడ్ బాల్‌గా ప్రకటించినా వెంటనే డీఆర్‌ఎస్ తీసుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. మిచెల్ సాంట్నర్ వేసిన వైడ్ బంతిని ఆడేందుకు వెంటాడిన సూర్యకుమార్ యాదవ్ బ్యాటు ఎడ్జ్‌ని, గ్లవ్స్‌ని తాకుతూ వెళ్లిన బంతి, ధోనీ చేతుల్లో పడినట్టు బాల్ ట్రాకింగ్‌లో స్పష్టంగా కనిపించింది.. 

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా మూడు డకౌట్లు నమోదు చేసిన సూర్యకుమార్ యాదవ్, ఇంకా ఆ మూడ్ ఆఫ్ నుంచి బయటికి వచ్చినట్టు కనిపించడం లేదు. 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

సూర్యకుమార్ యాదవ్ అవుటైన తర్వాతి ఓవర్‌లో స్ట్రైయిక్ డ్రైవ్ కొట్టేందుకు ప్రయత్నించిన కామెరూన్ గ్రీన్, బౌలర్ రవీంద్ర జడేజా పట్టిన బ్లైండ్ క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 4 బంతుల్లో 2 పరుగులు చేసిన అర్షద్ ఖాన్, మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు..

64 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్, 76 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది..

గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరుపున అదరగొట్టిన తిలక్ వర్మ, 18 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 10 బంతుల్లో 5 పరుగులు చేసిన ట్రిస్టన్ స్టబ్స్, మగల బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో వరుసగా 6,4,6 బాదిన టిమ్ డేవిడ్, ఆ తర్వాతి బంతికి అవుట్ అయ్యాడు. 22 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 31 పుగులు చేసిన టిమ్ డేవిడ్, బౌండరీ లైన్ దగ్గర అజింకా రహానేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. రాయుడు బౌండరీ బాది మ్యాచ్‌ని ముగించాడు. 

కీలక బ్యాటర్లు అందరూ పెవిలియన్ చేరడంతో 18వ ఓవర్‌లో 4 పరుగులే వచ్చాయి. మగల వేసిన 19వ ఓవర్‌లోనూ 6 పరుగులే వచ్చాయి. అయితే డ్వేన్ ప్రిటోరియస్ వేసిన ఆఖరి ఓవర్‌లో 3 ఫోర్లు బాదిన హృతిక్ షోకీన్, ముంబై స్కోరుని 150 మార్కు దాటించాడు. 12 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన హృతిక్ షోకీన్‌తో పాటు పియూష్ చావ్లా 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 

click me!