
ఐపీఎల్ - 16లో వరుసగా రెండో మ్యాచ్ లో ఓడింది సన్ రైజర్స్ హైదరాబాద్. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్.. ఎస్ఆర్‌హెచ్ ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులే చేసింది. లక్ష్యాన్ని లక్నో.. 16 ఓవర్లలోనే ఛేదించింది. కాగా ఓటమి అనంతరం ఎస్ఆర్‌హెచ్ సారథి ఎయిడెన్ మార్క్‌రమ్ మాట్లాడుతూ బ్యాటింగ్ వైఫల్యమే తమ కొంపముంచిందని చెప్పాడు.
ఐపీఎల్ లో కెప్టెన్ గా ఎంట్రీ ఇచ్చిన మార్క్‌రమ్.. సారథిగా ఆడిన తొలి మ్యాచ్ లోనే డకౌట్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్ లో మేం దారుణంగా విఫలమయ్యాం. ఈ మ్యాచ్ లో మేం 150-160 రన్స్ చేసేందుకు యత్నించాం...
కానీ లక్నో వికెట్ బ్యాటింగ్ కు పెద్దగా సహకరించలేదు. తక్కువ లక్ష్యమే అయినా ఈ మ్యాచ్ లో ఆఖరి వరకూ పోరాడాం. అందుకు మాకు సంతోషంగా ఉంది. మా బ్యాటర్లు స్కోరు బోర్డుపై మరిన్ని పరుగులు చేసుంటే మా బౌలర్లు దానిని కాపాడేందుకు యత్నించేవారు. కానీ అలా జరుగలేదు. అయితే తర్వాత మ్యాచ్ మేం మా హోం గ్రౌండ్ (ఉప్పల్) లో ఆడాల్సి ఉంది. పంజాబ్ తో జరుగబోయే ఈ మ్యాచ్ లో కచ్చితంగా పుంజుకుంటాం..’అని చెప్పాడు.
అయితే మార్క్‌రమ్ చెప్పినట్టుగా లక్నో పిచ్ మరీ బ్యాటర్లు ఆడరానంతగా అయితే ఏం లేదు. స్పిన్ కు అనుకూలించే ఈ పిచ్ పై కాస్త నిలబడితే పరుగులు రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదని రాహుల్, కృనాల్ పాండ్యా నిరూపించారు. ఢిల్లీతో తొలి మ్యాచ్ లో లక్నో బ్యాటర్లు ఈ పిచ్ పై వీరవిహారం చేశారు. మయాంక్ అగర్వాలీ, త్రిపాఠి, హ్యరీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు ఉన్నా క్రీజులో నిలిచేందుకు తంటాలు పడుతున్న సన్ రైజర్స్ బ్యాటర్ల వైఫల్యమే ఇదని ఆరెంజ్ ఆర్మీ సోషల్ మీడియా వేదికగా ఎస్ఆర్‌హెచ్ టీమ్ పై దుమ్మెత్తి పోస్తున్నది.
హైదరాబాద్ తమ తర్వాతి మ్యాచ్ ను పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది. ఆదివారం (ఏప్రిల్ 9న) ఈ మ్యాచ్ ఉప్పల్ వేదికగా జరుగుతుంది. ఈ మేరకు పంజాబ్ జట్టు ఇదివరకే హైదరాబాద్ కు చేరుకుంది.