కుల్దీప్‌ని మెడ పట్టుకుని తోసేసిన యజ్వేంద్ర చాహాల్... రిషబ్ పంత్ రమ్మన్నాడని...

Published : Apr 23, 2022, 12:07 PM IST
కుల్దీప్‌ని మెడ పట్టుకుని తోసేసిన యజ్వేంద్ర చాహాల్... రిషబ్ పంత్ రమ్మన్నాడని...

సారాంశం

రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో దుమారం రేపిన నో బాల్ కాంట్రవర్సీ... బ్యాట్స్‌మెన్‌ను వెనక్కి రావాల్సిందిగా పిలుపునిచ్చిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర వివాదాస్పదమైంది. విజయానికి ఆఖరి 2 ఓవర్లలో 36 పరుగులు కావాల్సిన దశలో 19వ ఓవర్‌లో ఒక్క పరుగు చేయలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్, 20వ ఓవర్‌లో నో బాల్ ఇవ్వలేదని నానా రాద్ధాంతం చేసింది...

ఆఖరి ఓవర్‌కి ముందే మ్యాచ్‌పై ఆశలు వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ డగౌట్, వాలిపోయిన ముఖాలతో నిరాశగా కనిపించింది. అయితే ఓబెడ్ మెక్‌కాయ్ వేసిన 20వ ఓవర్‌లో మొదటి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాది, ఢిల్లీ ముఖాల్లో మళ్లీ వెలుగులు నింపాడు రోవ్‌మెన్ పావెల్...

అయితే నాలుగో బంతి విషయంలో పెద్ద హై డ్రామానే నడిచింది. ఓబెడ్ మెక్‌కాయ్ వేసిన ఫుల్ టాస్ బంతిని నేరుగా నడుముపైకి షాట్ ఆడాడు రోవ్‌మెన్ పావెల్. ఆ షాట్‌కి పరుగులేమీ రాలేదు. ఫీల్డ్ అంపైర్లు ఆ బంతిని కరెక్ట్ బాల్‌గా పరిగణించడం... ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అనుమానాలు వ్యక్తం చేసినా, థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేయకపోవడంతో ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్... ఆవేశంతో ఊగిపోయాడు...

దాన్ని నో బాల్‌గా ఎందుకు ఇవ్వరో కనుక్కోవాలంటూ అసిస్టెంట్ కోచ్‌ని ఫీల్డ్ లోకి పంపిన రిషబ్ పంత్... అంపైర్లు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందకపోవడంతో మ్యాచ్ ఆపేసి రావాలంటూ బ్యాటింగ్  చేస్తున్న రో‌వ్‌మెన్ పావెల్, కుల్దీప్ యాదవ్‌లకు సిగ్నల్ ఇచ్చాడు...

కెప్టెన్ రిషబ్ పంత్ వచ్చేయమనడంతో క్రీజు వదిలి వెళ్లిపోవడానికి రెఢీ అయిపోయాడు కుల్దీప్ యాదవ్. దీంతో అక్కడే ఉన్న రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, అతన్ని అడ్డుకుని నాన్‌స్ట్రైయికింగ్ ఎండ్‌కి వెళ్లాల్సిందిగా సూచించాడు. అయినా చాహాల్ మాటలను కుల్దీప్ యాదవ్‌ పట్టించుకోకపోవడంతో ‘ఎక్కడికి రా పోయేది... నడువు, బ్యాటింగ్ చేయ్ పో...’ అన్నట్టుగా మెడ పట్టి, క్రీజులోకి వెళ్లాలంటూ స్నేహపూర్వకంగా నెట్టాడు...

ఈ సంఘటన మొత్తం కెమెరాల్లో రికార్డైంది. ఓ పక్క సీరియస్‌గా నో బాల్‌ గురించి గొడవ జరుగుతుంటే, ఈ ‘కుల్‌చా’ (Kul-Cha) ఫ్రెండ్స్ మాత్రం సరదాగా ఆడుకుంటున్నారంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న యజ్వేంద్ర చాహాల్.. 7 మ్యాచుల్లో 18 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ కూడా సాధించాడు యజ్వేంద్ర చాహాల్... 

2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడుతున్న కుల్దీప్ యాదవ్, 7 మ్యాచుల్లో 13 వికెట్లు తీసి... పర్పుల్ క్యాప్ రేసులో యజ్వేంద్ర చాహాల్ తర్వాతి ప్లేస్‌లో ఉండడం విశేషం.. ఒక్క నో బాల్ కోసం ఇంత దుమారం రేపిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. అయితే మరికొందరు మాత్రం ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా నో బాల్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేయకపోవడంపై ఫీల్డ్ అంపైర్లను తప్పుబడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !