
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు, డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ సీఎస్‌కే బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.
ఓపెనర్ రాబిన్ ఊతప్ప 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 15 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మొదటి మూడు మ్యాచుల్లో ఫెయిల్ అయిన రుతురాజ్ గైక్వాడ్ 13 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
36 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ దశలో అంబటి రాయుడు, మొయిన్ ఆలీ కలిసి మూడో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 27 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసిన అంబటి రాయుడు, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అయిడిన్ మార్క్‌రమ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, అయిడిన్ మార్క్‌రమ్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 5 బంతుల్లో 3 పరుగులు చేసిన శివమ్ దూబే, నట్టూ బౌలింగ్‌లో ఉమ్రాన్ మాలిక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
ఎమ్మెస్ ధోనీ 6 బంతుల్లో 3 పరుగులు చేసి మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ధోనీకి ఇదే అత్యల్ప స్కోరు. 14 ఓవర్లు ముగిసే సమయానికి 100 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్, వరుస ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోయింది.
నటరాజన్ వేసిన 19వ ఓవర్‌లో వరుసగా ఓ ఫోర్, సిక్సర్ బాదిన రవీంద్ర జడేజా ఆ ఓవర్‌లో 14 పరుగులు రాబట్టాడు. భువీ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన జడ్డూ, కేన్ విలియంసన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
అయితే ఆఖరి ఓవర్‌లో ఏకంగా నాలుగు వైడ్లు వేసిన భువనేశ్వర్ కుమార్, 15 పరుగులు సమర్పించాడు. డ్వేన్ బ్రావో 8 పరుగులు, క్రిస్ జోర్డాన్ 6 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, అయిడిన్ మార్క్‌రమ్ తలా ఓ వికెట్ తీశారు..
ముందున్నది స్వల్ప లక్ష్యమే అయినా సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ యూనిట్ గత మ్యాచుల్లో రాణించిన దాన్ని బట్టి చూస్తే... ఈ టార్గెట్ ఛేదించడం నిజంగా కష్టమే. వరుసగా విఫలమవుతున్న కెప్టెన్ కేన్ విలియంసన్, ఓపెనర్ అభిషేక్ శర్మ, నికోలస్ పూరన్ సక్సెస్ అయితేనే ఆరెంజ్ ఆర్మీకి బోణీ విజయం దక్కుతుంది.