IPL 2022 RR vs MI: జోస్ బట్లర్ సెంచరీ... రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు...

Published : Apr 02, 2022, 05:11 PM ISTUpdated : Apr 02, 2022, 05:22 PM IST
IPL 2022 RR vs MI:  జోస్ బట్లర్ సెంచరీ... రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు...

సారాంశం

Jos Buttler:  వరుసగా రెండో సీజన్‌లో సెంచరీ బాదిన జోస్ బట్లర్... భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతున్న రాజస్థాన్ రాయల్స్...

ఐపీఎల్‌లో ఇంగ్లాండ్ వికెట్ కీపర్, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జోస్ బట్లర్ సూపర్ ఫామ్ కొనసాగుతూనే ఉంది. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సెంచరీ కొట్టిన జోస్ బట్లర్, ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై సెంచరీ కొట్టాడు. ఓవరాల్‌గా బట్లర్‌కి ఇది ఐపీఎల్‌లో రెండో సెంచరీ.

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగుల భారీ స్కోరు చేసింది. 66 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ మార్కు అందుకున్నాడు జోస్ బట్లర్. ఓవరాల్‌గా బట్లర్‌కి ఇది 300వ టీ20 గేమ్ కావడం విశేషం...

కేవిన్ పీటర్సర్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో తర్వాత ఐపీఎల్‌లో సెంచరీ చేసిన నాలుగో ఇంగ్లాండ్ క్రికెటర్ జోస్ బట్లర్. ఇంతకుముందు బెన్ స్టోక్స్ ఐపీఎల్‌లో రెండు సెంచరీలు నమోదు చేయగా, జోస్ బట్లర్‌ ఆ రికార్డును సమం చేశాడు... 

యశస్వి జైస్వాల్ 2 బంతుల్లో 1 పరుగు చేసి జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్ 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసి తైమల్ మిల్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. పడిక్కల్ వికెట్ తీసిన మిల్స్, ఆ ఓవర్‌లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు...

48 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో సంజూ శాంసన్, జోస్ బట్లర్ కలిసి మూడో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 21 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 30 పరుగులు చేసిన సంజూ శాంసన్, కిరన్ పోలార్డ్ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

సిమ్రాన్ హెట్మయర్ 14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేసి మెరుపులు మెరిపించి పెవిలియన్ చేరాడు. పోలార్డ్ వేసిన 17వ ఓవర్‌లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో 26 పరుగులు రాబట్టాడు హెట్మయర్. బాసిల్ తంపి వేసిన 4వ ఓవర్‌లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 26 పరుగులు రాబట్టిన జోస్ బట్లర్, అదే జోరుని కొనసాగిస్తూ వరుస విరామాల్లో బౌండరీల మోత మోగించాడు.  68 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు చేసిన బట్లర్, బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే రవిచంద్రన్ అశ్విన్ రనౌట్ అయ్యాడు...

19వ ఓవర్‌లో కేవలం 3 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్... మూడు వికెట్లు కోల్పోయింది. తైమల్ మిల్స్ వేసిన ఆఖరి ఓవర్‌లో 8 పరుగులు రాగా 2 వికెట్లు పడ్డాయి. నవ్‌దీప్ సైనీ 2 పరుగులు చేయగా రియాన్ పరాగ్ 5 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో తైమల్ మిల్స్, జస్ప్రిత్ బుమ్రా మూడేసి వికెట్లు తీయగా కిరన్ పోలార్డ్‌కి ఓ వికెట్ దక్కింది. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026: ఐసీసీకి అంబానీ జియో హాట్‌స్టార్ షాక్
SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం