Sanjay Bangar: ఆర్సీబీ హెడ్ కోచ్ గా టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్.. ఈసారి కప్ మాదేనని బెంగళూరు ఫ్యాన్స్

Published : Nov 09, 2021, 02:36 PM ISTUpdated : Nov 09, 2021, 02:42 PM IST
Sanjay Bangar: ఆర్సీబీ  హెడ్ కోచ్ గా టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్.. ఈసారి కప్ మాదేనని బెంగళూరు ఫ్యాన్స్

సారాంశం

IPL 2022: జట్టు నిండా స్టార్లు.. ఆఖర్లో వీర బాదుడు బాదే  హిట్టర్లు..  మైదానంలో పాదరసంలా కదిలే ఫీల్డర్లు..  గ్లామర్, గ్రామర్ ఉన్నా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షే. మరి వచ్చే సీజన్లో అయినా...!

‘ఈ సాలా కప్ నమదే..’ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి సీజన్ నుంచి మొన్నీమధ్యే ముగిసిన ఐపీఎల్-14 సీజన్ దాకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సపోర్ట్ చేసే సగటు అభిమాని జపించే మంత్రమిదే. జట్టు నిండా స్టార్లు.. ప్రతిభావంతమైన ఆటగాళ్లు.. హిట్టర్లకు కొదవలేదు.. గ్లామర్, గ్రామర్ ఉన్నా ఆ జట్టుకు మాత్రం ఐపీఎల్ కప్పు అందని ద్రాక్షే.  ఆటగాళ్లు మారినా.. కెప్టెన్లు మారినా.. ఆర్సీబీ తలరాత మాత్రం మారడం లేదు. ప్రపంచంలో ఏ బౌలర్ నైనా ధీటుగా ఎదుర్కునే బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆ జట్టుది  ప్రతి సీజన్ లోనూ వెనుకడుగే. దీంతో ఆ జట్టు అభిమానులంతా.. ‘ఈ సారి కప్పు కొడదాం’ను త్యజించి ‘వచ్చే ఏడాది చూసుకుందాం’ అనుకుంటూ నిరాశ పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఎలాగైనా కప్పు కొట్టాలని ఆ జట్టు భావిస్తున్నది. 

ఇందుకు గాను ఆర్సీబీ యాజమాన్యం గట్టిగానే ప్లాన్ చేసింది. ఆ జట్టుకు ఇన్నాళ్లు హెడ్ కోచ్ గా ఉన్న సైమన్ కటిచ్ స్థానంలో కొత్త కోచ్ ను నియమించింది. భారత మాజీ ఆటగాడు, టీమిండియాకు కొన్నాళ్లపాటు బ్యాటింగ్ కోచ్ గా ఉన్న సంజయ్ బంగర్.. ఆర్సీబీ హెడ్ కోచ్ గా ఎంపికయ్యాడు.  రెండేండ్ల పాటు బంగర్ ఈ బాధ్యతల్లో  కొనసాగుతాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ తాత్కాలిక కోచ్ మైక్ హెస్సెన్ ట్విట్టర్ లో తెలిపాడు. ఆర్సీబీ కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.

ఐపీఎల్ 2021 సీజన్ (తొలి దశకు) లో ఆ జట్టుకు కోచ్ గా ఉన్న సైమన్ కటిచ్..  రెండో దశకు దూరమయ్యాడు. దీంతో యాజమాన్యం ఆ స్థానాన్ని తాత్కాలికంగా మైక్ హెస్సెన్ తో  భర్తీ చేసింది. ఇక ఇప్పుడు ఆ స్థానాన్ని సంజయ్ బంగర్ భర్తీ చేయనున్నాడు. అంతకుముందు  బెంగళూరుకు బ్యాటింగ్ కోచ్ గా పనిచేసిన బంగర్.. ఇప్పుడు పూర్తి స్థాయిలో  కోచ్ గా మారనుండటం గమనార్హం. మైక్ హెస్సెన్ ఆ జట్టుకు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ గా కొనసాగనున్నాడు.

 

తనను కోచ్ గా నియమించడంపై బంగర్ మాట్లాడుతూ.. ‘గతంలో ఇదే టీమ్ కు నేను బ్యాటింగ్ కోచ్ గా చేశాను. పలువురు ప్రతిభావంతులైన ఆటగాళ్లతో పని చేశాను. ఈసారి టీమ్ ను మరో స్థాయికి తీసుకెళ్లడానికి నావంతు కృషి చేస్తా..’అని తెలిపాడు. ఇక ఇదే విషయమై ఆర్సీబీ చైర్మెన్ ప్రథమేశ్ మిశ్రా హర్షం వ్యక్తం చేశారు. బంగర్ అనుభవం జట్టుకు లాభిస్తుందని  అన్నారు. 

 

ఇదిలాఉండగా.. విరాట్ కోహ్లి ఆర్సీబీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా..? అని ఆసక్తికరంగా మారింది. జట్టులో ఉన్న వ్యక్తినే సారథిగా నియమిస్తారా..? లేదా ఇతర జట్లనుంచి ప్లేయర్లను  తీసుకొచ్చి కెప్టెన్ గా నియమిస్తారా..? అన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Abhigyan Kundu : వామ్మో ఏంటి కొట్టుడు.. IPL వేలానికి ముందు ఆసియా కప్‌లో డబుల్ సెంచరీ బాదిన తొలి భారత క్రికెటర్ !
IPL Mini Auction 2026: మినీ వేలంలో జాక్‌పాట్ కొట్టే ప్లేయ‌ర్స్ వీళ్లే... ఏకంగా రూ. 30 కోట్ల పైమాటే..