IPL 2022 RCB vs PBKS: 200 కొట్టినా సరిపోలేదు... భారీ లక్ష్యాన్ని ఊదేసిన పంజాబ్ కింగ్స్...

Published : Mar 27, 2022, 11:25 PM IST
IPL 2022 RCB vs PBKS: 200 కొట్టినా సరిపోలేదు... భారీ లక్ష్యాన్ని ఊదేసిన పంజాబ్ కింగ్స్...

సారాంశం

మరో ఓవర్ మిగిలి ఉండగానే 206 పరుగుల టార్గెట్‌ను ఛేదించిన పంజాబ్ కింగ్స్... 5 వికెట్ల తేడాతో ఆర్‌సీబీపై ఘన విజయం... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్, క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 205 పరుగుల భారీ స్కోరు చేస్తే, ఆ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించేసి... అద్భుత విజయాన్ని అందుకుంది పంజాబ్ కింగ్స్... కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్‌కి ఇది తొలి విజయం కాగా, ఫాఫ్ డుప్లిసిస్ పరాజయంతో ఆర్‌సీబీ కెప్టెన్‌గా కెరీర్ మొదలెట్టాడు...

భారీ లక్ష్యఛేదనలో మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ కలిసి తొలి వికెట్‌కి 71 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్‌ను వానిందు హసరంగ పెవిలియన్ చేర్చాడు...

29 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేసిన శిఖర్ ధావన్, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. భనుక రాజపక్ష 22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

అండర్19 ఆల్‌రౌండర్ రాజ్ భవ‌ను గోల్డెన్ డకౌట్‌ చేశాడు మహ్మద్ సిరాజ్.. ఐపీఎల్ 2022 సీజన్‌లో భారీ ధర దక్కించుకున్న లియామ్ లివింగ్‌స్టోన్ 10 బంతుల్లో 2 సిక్సర్లతో 19 పరుగులు చేసి నిరాశపరిచినా... షారుక్ ఖాన్, ఓడియన్ స్మిత్ కలిసి పంజాబ్ కింగ్స్‌ను విజయ తీరాలకు చేర్చారు...

సిరాజ్ వేసిన 18వ ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 25 పరుగులు రాబట్టాడు ఓడియన్ స్మిత్. దీంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. హర్షల్ పటేల్ వేసిన 19వ ఓవర్‌లో సిక్సర్ బాదిన షారుక్ ఖాన్, లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఓడియన్ స్మిత్ 8 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 25 పరుగులు చేయగా, షారుక్ ఖాన్ 20 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

మరో ఓవర్ మిగిలి ఉండగానే 206 పరుగుల టార్గెట్‌ను ఊదేసింది పంజాబ్ కింగ్స్. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటిదాకా జరిగిన మూడు మ్యాచుల్లో ఇదే అత్యధిక స్కోరు... 

యంగ్ ఓపెనర్ అనుజ్ రావత్, ఫాఫ్ డుప్లిసిస్ కలిసి నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. తొలి వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత 20 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన అనుజ్ రావత్‌ను రాహుల్ చాహార్ బౌల్డ్ చేశాడు...

ఆ తర్వాత విరాట్ కోహ్లీతో కలిసి స్లోగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు డుప్లిసిస్. ఒకానొక దశలో 11 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 78 పరుగులు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 15 ఓవర్లు ముగిసే సమయానికి 142 పరుగులకి చేరింది. తాను ఎదుర్కొన్న మొదటి 34 బంతుల తర్వాత 23 పరుగులు మాత్రమే చేసిన డుప్లిసిస్, ఆ తర్వాత 10 బంతుల్లో 41 పరుగులు రాబట్టాడు...

లివింగ్‌స్టోన్ వేసిన 12వ ఓవర్‌లో 14 పరుగులు, ఓడియన్ స్మిత్ వేసిన 13వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 23 పరుగులు రాబట్టారు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్... హర్‌ప్రీత్ బ్రార్ వేసిన 14వ ఓవర్‌లో మూడు సిక్సర్లతో 21 పరుగులు వచ్చాయి...

ఆర్‌సీబీ తరుపున 200వ ఇన్నింగ్స్ ఆడుతున్న విరాట్ కోహ్లీ, ఒకే జట్టుకి అత్యధిక మ్యాచులు ఆడిన ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 171 ఇన్నింగ్స్‌లు ఆడిన సురేష్ రైనా, విరాట్ తర్వాతి స్థానంలో నిలిచాడు...

ఫాఫ్ డుప్లిసిస్, ఐపీఎల్‌లో 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్‌లో 3 వేలకు పైగా పరుగులు చేసిన ఆరో విదేశీ బ్యాటర్ డుప్లిసిస్. ఇంతకుముందు డేవిడ్ వార్నర్, ఏబీ డివిల్లియర్స్, క్రిస్ గేల్, షేన్ వాట్సన్, కిరన్ పోలార్డ్ మాత్రమే ఐపీఎల్‌లో 3 వేలకు పైగా పరుగులు చేశారు...

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 3 వేల పరుగుల మైలురాయి అందుకున్న మూడో బ్యాటర్‌గా నిలిచాడు ఫాఫ్ డుప్లిసిస్. క్రిస్ గేల్ 75 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా కెఎల్ రాహుల్ 80 ఇన్నింగ్స్‌ల్లో, డేవిడ్ వార్నర్ 94 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించారు. ఫాఫ్ డుప్లిసిస్ 94 ఇన్నింగ్స్‌ల్లో 3 వేల పరుగుల మైలురాయిని అందుకుని, వార్నర్‌తో కలిసి టాప్ 3లో నిలిచాడు...

57 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 88 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో షారుక్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఫాఫ్ డుప్లిసిస్, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్‌కి 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

దినేశ్ కార్తీక్ కూడా వస్తూనే బౌండరీలతో విరుచుకుపడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. స్మిత్ వేసిన 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 18 పరుగులు రాబట్టిన దినేశ్ కార్తీక్, సందీప్ శర్మ వేసిన ఆఖరి ఓవర్‌లో ఓ సిక్స్, ఫోర్ బాది ఆర్‌సీబీ స్కోరు 200 దాటించాడు...

విరాట్ కోహ్లీ 29 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 41 పరుగులు చేయగా దినేశ్ కార్తీక్ 14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ ఇద్దరూ 17 బంతుల్లో 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు