
ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్త కెప్టెన్లు మయాంక్ అగర్వాల్, హార్ధిక్ పాండ్యా మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది... గుజరాత్ టైటాన్స్‌కి ఇది వరుసగా మూడో విజయం.
గత మ్యాచ్‌లో 46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి ఐపీఎల్‌లో బెస్ట్ స్కోరు నమోదు చేసుకున్న శుబ్‌మన్ గిల్, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో దాన్ని అధిగమించేశాడు. 96 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, 4 పరుగుల తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు.
190 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన గుజరాత్ టైటాన్స్, మాథ్యూ వేడ్ వికెట్ త్వరగా కోల్పోయింది. 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన వేడ్, రబాడా బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత తొలి మ్యాచ్ ఆడుతున్న సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ కలిసి రెండో వికెట్‌కి 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...
30 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేిన సాయి సుదర్శన్, రాహుల్ చాహార్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హార్ధిక్ పాండ్యా, శుబ్‌మన్ గిల్ కలిసి మూడో వికెట్‌కి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే 80+ స్కోరు దాటిన తర్వాత శుబ్‌మన్ గిల్ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం మొదలెట్టాడు...
43 బంతుల్లో 78 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, ఆ తర్వాత 16 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ నెట్ రన్ రేట్ పెరుగుతూ పోయింది.. 59 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 96 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, రబాడా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ సమయానికి గుజరాత్ విజయానికి 7 బంతుల్లో 20 పరుగులు కావాలి...
20వ ఓవర్ మొదటి బంతికి వైడ్ వేసిన ఓడియన్ స్మిత్, తర్వాతి బంతికి హార్ధిక్ పాండ్యాని అవుట్ చేశాడు. 18 బంతుల్లో 5 ఫోర్లతో 27 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, రనౌట్ అయ్యాడు.. క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా సింగిల్ తీయగా మూడో బంతికి డేవిడ్ మిల్లర్ ఫోర్ బాదాడు. దీంతో ఆఖరి 3 బంతుల్లో గుజరాత్ విజయానికి 13 పరుగులు కావాల్సి వచ్చింది.
నాలుగో బంతికి సింగిల్ తీశాడు మిల్లర్. ఐదో బంతికి భారీ సిక్సర్ కొట్టిన రాహుల్ తెవాటియా, ఆఖరి బంతికి సిక్స్ బాది మ్యాచ్‌ను ముగించేశాడు...
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేయగలిగింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది పంజాబ్ కింగ్స్. భనుక రాజపక్ష స్థానంలో తుదిజట్టులోకి వచ్చిన జానీ బెయిర్ స్టో 8 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్ కలిసి మూడో వికెట్‌కి 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 30 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసిన శిఖర్ ధావన్, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. యంగ్ బ్యాటర్ జితేశ శర్మ 11 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 23 పరుగులు చేసి దర్శన్ నాల్కండే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే ఓడియన్ స్మిత్‌ని అవుట్ చేశాడు నాల్కండే...
నాల్కండే బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు స్మిత్. 27 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్, వరుసగా రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు...
లివింగ్‌స్టోన్‌ని అవుట్ చేసిన రషీద్ ఖాన్, అదే ఓవర్‌లో 8 బంతుల్లో 2 సిక్సర్లతో 15 పరుగులు చేసిన షారుక్ ఖాన్‌ని కూడా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కగిసో రబాడా కూడా రనౌట్ కావడంతో 153/5 పరుగుల వద్ద ఉన్న పంజాబ్ కింగ్స్, 1 పరుగు తేడాతో మూడు వికెట్లు కోల్పోయి 156/8 పరుగులకు చేరింది...
6 బంతుల్లో 2 పరుగులు చేసిన వైభవ్ అరోరాని మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఖర్లో రాహుల్ చాహార్ 14 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 22 పరుగులు, అర్ష్‌దీప్ సింగ్ 10 పరుగులు చేసి కొన్ని మెరుపులు మెరిపించడంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది పంజాబ్ కింగ్స్. మొదటి రెండు మ్యాచుల్లో పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయిన రషీద్ ఖాన్ నేటి మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి అదరగొట్టాడు.