
అందరికీ అన్ని రూల్స్ తెలియాల్సినే రూల్ లేదు... ఐపీఎల్ ఆడబట్టి ఆరేళ్లు అయినా, 2022 సీజన్ ద్వారానే కాస్త వెలుగులోకి వచ్చాడు కేకేఆర్ ఆల్‌రౌండర్ రింకూ సింగ్... రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసి, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు రింకూ సింగ్. కడు పేదరికం నుంచి వచ్చిన రింకూ సింగ్, తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 బంతుల్లో 5 పరుగులు చేసి టి నటరాజన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...
అయితే రింకూ సింగ్ అవుట్ విషయంలో కాసేపు హై డ్రామా నడిచింది. ఫీల్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించిన తర్వాత నాన్ స్ట్రైయికింగ్ ఎండ్‌లో ఉన్న సామ్ బిల్లింగ్స్ దగ్గరికి వచ్చి రివ్యూ తీసుకోవాలా? వద్దా? అని కాసేపు చర్చించాడు రింకూ సింగ్. ఈ లోపు పుణ్యకాలం కాస్త గడిచిపోయింది.
డీఆర్‌ఎస్ తీసుకునేందుకు ప్లేయర్లకు ఇచ్చే 15 సెకన్ల గడువు ముగిసిన తర్వాత రింకూ సింగ్‌కి బదులు, నాన్ స్ట్రైయికింగ్ ప్లేయర్ సామ్ బిల్లింగ్స్ రివ్యూ తీసుకుంటున్నట్టు సిగ్నల్ ఇచ్చాడు. అయితే అంపైర్లు రివ్యూకి అంగీకరించలేదు. అంపైర్ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే ఫీల్డింగ్ టీమ్ అయితే కెప్టెన్, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అయితే బ్యాట్స్‌మెన్ మాత్రమే డీఆర్‌ఎస్ కోరుతున్నట్టు సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది...
రింకూ సింగ్‌కి బదులుగా సామ్ బిల్లింగ్స్ రివ్యూ కోరడంతో డీఆర్‌ఎస్ అనుమతించేది లేదంటూ క్లారిటీ ఇచ్చారు అంపైర్లు. అప్పటికే సమయం కూడా మించి పోవడంతో ఇక సైలెంట్‌గా పెవిలియన్‌కి వెళ్లిపోవాలంటూ సూచించాడు అంపైర్. దీంతో కాసేపు అంపైర్లతో వాగ్వాదానికి దిగిన రింకూ సింగ్, చేసేదేమీ లేక నెమ్మదిగా నడుచుకుంటూ డగౌట్‌కి వచ్చాడు... టీవీ రిప్లైలో రింకూ సింగ్ అవుట్ అయ్యినట్టు స్పష్టంగా కనిపించింది, దీంతో మనోడు రివ్యూ తీసుకుని ఉన్నా పెద్దగా ఫలితం దక్కి ఉండేది కాదు..
ఆరేళ్లుగా ఐపీఎల్ ఆడుతున్న రింకూ సింగ్, కనీసం డీఆర్‌ఎస్ ఎలా తీసుకోవాలనే విషయం కూడా తెలుసుకోకపోవడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు... రింకూ సింగ్ విఫలమైనా సామ్ బిల్లింగ్స్, ఆండ్రే రస్సెల్ ఇన్నింగ్స్‌ల కారణంగా 177 పరుగుల స్కోరు చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, 54 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది...
28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసిన అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం చేసినా మిగిలిన ప్లేయర్లు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
ఈ విజయంలో సీజన్‌లో ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. మరోవైపు సీజన్‌లో వరుసగా ఐదు విజయాల తర్వాత ఐదు మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. నెట్ రన్ రేట్ కూడా తక్కువగా ఉండడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే...