
ఐపీఎల్-15 ఘనంగా ముగిసింది. టైటిల్ విజేత ఎవరనే విషయం పక్కనబెడితే ఈ మ్యాచ్ ద్వారా రెండున్నరేండ్లుగా టీమిండియాతో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులు ఏది మిస్ అయ్యారో అది తిరిగి కనిపించింది. ఏ ఆటగాడు ఎన్ని రికార్డులు కొట్టినా.. రోజుల తరబడి బ్యాటింగ్ చేసినా.. ప్రత్యర్థి జట్టులోని 11 మందిని ఔట్ చేసినా.. దానిని అభినందించేవాళ్లు, ఆనందించేవాళ్లు, ఆదరించేవాళ్లు లేకుంటే అది బూడిదలో పోసిన పన్నీరు కిందే లెక్క. ఖాళీ స్టేడియాల్లో ఆడి క్రికెటర్లకు కూడా బోర్ కొట్టింది. క్రికెట్ అంటేనే క్రౌడ్ మధ్యలో ఆడే ఆట. చుట్టూ ప్రేక్షకుల మధ్య ఆడి హాఫ్ సెంచరీ చేసినా చాలు. చివరి ఓవర్లలో వచ్చి రెండు సిక్సర్లు కొట్టిపోయినా చాలు. ఆ కిక్కే వేరు. కరోనా పుణ్యమా అని రెండున్నరేండ్లుగా క్రికెట్ అభిమానులు ఆ జన హోరును ఎంతో మిస్ అయ్యారు.
కానీ ఐపీఎల్-15 ఫైనల్ ఆ గ్లోరీని మళ్లీ తెప్పించిందనడంలో ఇసుమంతైనా సందేహం లేదు. ఆదివారం రాత్రి గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గల నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్-రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ కు స్టేడియానికి వచ్చి వీక్షించినవాళ్లు లక్షపైనే కావడం గమనార్హం.
అధికారిక లెక్కల ప్రకారం.. గుజరాత్ - రాజస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ను స్టేడియానికి వచ్చి చూసిన వారి సంఖ్య అక్షరాలా 1,04,859 మంది. ప్రపంచ క్రికెట్ లో మరే టెస్టు, వన్డే, టీ20 మ్యాచ్ కు కూడా ఇంత మంది హాజరుకాలేదు. క్రికెట్ చరిత్రలో అత్యధిక ప్రేక్షకులు హాజరైన మ్యాచ్ గా ఇది రికార్డులకెక్కింది. సరికొత్త చరిత్ర సృష్టించింది.
నరేంద్ర మోడీ స్టేడియం మొత్తం సీటింగ్ కెపాసిటీ 1,32,000. 2020 లో అప్పటి యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత పర్యటనకు వచ్చినప్పుడు ఇందులో ఓ కార్యక్రమం నిర్వహించగా అప్పుడు కూడా జనం మోడీ, ట్రంప్ ను చూడటానికి వారి మాటలు వినడానికి ఎగబడ్డారు. అయితే అది రాజకీయ కార్యక్రమం.
కాగా.. క్రికెట్ చరిత్రలో అత్యధిక మంది ప్రేక్షకులు వచ్చిన మ్యాచ్ ఇది. భారత్ లో అత్యధిక సీటింగ్ కెపాజిటీ కలిగిన స్టేడియం (ఈడెన్ గార్డెన్.. లక్ష మంది) లో గతంలో 1990లలో నిర్వహించిన పలు వన్డేలకు లక్ష మంది హాజరైనట్టు చెబుతున్నా అధికారికంగా లెక్కలు లేవు. కానీ 1992 లో వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్-పాకిస్తాన్ మధ్య ముగిసిన మ్యాచ్ ను వీక్షించడానికి 87,812 మంది హజరయ్యారు. ఇప్పటివరకు ఇదే రికార్డు.
అత్యధికంగా జనం వచ్చిన మ్యాచులు..
- ఐపీఎల్-15 ఫైనల్ : 1,04,859 (గుజరాత్ టైటాన్స్ -రాజస్తాన్ రాయల్స్)
- 2015 వరల్డ్ కప్ ఫైనల్ : 93,013 (ఆసీస్ - న్యూజిలాండ్)
- 2013 బాక్సింగ్ డే టెస్టు : 91,112 (ఆసీస్ - ఇంగ్లాండ్)
- 2006 బాక్సింగ్ డే టెస్టు : 89,115 (ఆసీస్ - ఇంగ్లాండ్)
- 92 వన్డే ప్రపంచకప్ : 87,812 (ఇంగ్లాండ్- పాక్)