IPL 2022: పంజాబ్ ఖేల్ ఖతం.. దుకాణం బంద్.. ఢిల్లీ బౌలర్లకు మయాంక్ సేన దాసోహం..

Published : May 16, 2022, 11:23 PM IST
IPL 2022: పంజాబ్ ఖేల్ ఖతం.. దుకాణం బంద్..  ఢిల్లీ బౌలర్లకు మయాంక్ సేన దాసోహం..

సారాంశం

TATA IPL 2022 PBKS vs DC: కీలక మ్యాచ్ లో  ఢిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేశామన్న ఆనందం పంజాబ్ కు ఎక్కువ సేపు నిలువలేదు.  ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకునేందుకు తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్లు చేతులెత్తేశారు.

ఐపీఎల్-15 లో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది. ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలు ఇక సుడిగాలిలో దీపం వంటివే. ఢిల్లీని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన పంజాబ్.. బ్యాటింగ్ లో విఫలమై ఓటమిని కోరి తెచ్చుకుంది. తప్పక నెగ్గాలసిన మ్యాచ్ లో వీర విధ్వంసక ఆటగాళ్లు ఉన్న పంజాబ్ కింగ్స్.. 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 142 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా 17 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. ఢిల్లీ బౌలర్లు సమిష్టిగా రాణించి ఆ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఈ ఓటమితో ఐపీఎల్-15 ప్లేఆఫ్ రేసు నుంచి పంజాబ్ నిష్క్రమించినట్టే. తర్వాత ఆడబోయే మ్యాచ్ లో ఆ జట్టు గెలిచినా పెద్దగా ప్రయోజనం లేదు.  

తాజా విజయంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో స్థానానికి ఎగబాకింది.  ప్లేఆఫ్  అవకాశాన్ని ఆ జట్టు దాదాపు ఖాయం చేసుకున్నట్టే. ఢిల్లీకి ఇది 13 మ్యాచుల్లో ఏడో విజయం. ఈ విజయం ద్వారా  దాని నెట్ రన్ రేట్ కూడా పెరిగింది. ప్రస్తుతం ఆర్సీబీ కూడా ఏడు విజయాలతో ఉన్నా దాని నెట్ రన్ రేట్ (-0.323) మైనస్ లో ఉంది. తర్వాత మ్యాచ్ లో ఆర్సీబీ  మాములుగా నెగ్గినా ప్లేఆఫ్స్ కు వెళ్లడం కష్టమే. భారీ తేడాతో గెలిస్తేనే అవకాశాలుంటాయి. 

ఇక ఈజీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో పంజాబ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో (15 బంతుల్లో 28.. 4 ఫోర్లు, 1 సిక్సర్) దూకుడుగానే ఆడాడు. ధావన్ (19) కాస్త నెమ్మదిగానే ఆడినా బెయిర్ స్టో.. ఖలీల్ వేసిన మూడో ఓవర్లో 6, 4  కొట్టాడు. నోర్త్జ్ వేసిన 4వ ఓవర్ లో నాలుగో బంతిని బౌండరీ లైన్ దాటించి తర్వాత బంతికి తాను కూడా డగౌట్ చేరాడు. 

శార్దూల్  ఠాకూర్ వేసిన ఆరో ఓవర్లో ఢిల్లీకి డబుల్ స్ట్రోక్ తగిలింది. ఆ ఓవర్లో నాలుగో బంతికి రాజపక్స (4).. నోర్త్జ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆరో బంతికి  ధావన్.. వికెట్ కీపర్ రిషభ్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆరు ఓవర్లో ముగిసేసరికి పంజాబ్.. 54 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. 

తిప్పేసిన స్పిన్నర్లు.. 

54 పరుగులకే 3 వికెట్లు పడ్డా లివింగ్ స్టోన్, మయాంక్ అగర్వాల్, జితేశ్ శర్మ వంటి ఆటగాళ్లు ఉండటంతో పంజాబ్ విజయంపై ధీమాగానే ఉంది. కానీ ఢిల్లీ స్పిన్నర్లు ఆ ఆశలను అడియాసలు చేశారు. ఏడో ఓవర్ వేసిన అక్షర్.. మూడో బంతికి  మయాంక్ (0) ను బౌల్డ్ చేశాడు. 

ఐపీఎల్ లో ఇది అతడికి వందో వికెట్. ఈ క్రమంలో ఐపీఎల్ లో వెయ్యి ప్లస్ పరుగులు, వంద ప్లస్ వికెట్లు తీసుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో డ్వేన్ బ్రావో, జడేజా, సునీల్  నరైన్  తర్వాత స్థానంలో నిలిచాడు.  

ఇదిలాఉండగా.. 8వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడబోయిన లివింగ్ ప్టోన్ (3) స్టంపౌట్ అయ్యాడు. కుల్దీప్ అతడి తర్వాతి ఓవర్లో.. హర్ఫ్రీత్ బ్రర్ (1) ను బౌల్డ్ చేశాడు. పది ఓవర్లు ముగిసేసరికి పంజాబ్.. 6 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. నాలుగు ఓవర్ల వ్యవధిలో  ఐదు కీలక వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ కోలుకోలేకపోయింది. 13వ ఓవర్లో అక్షర్.. రిషి ధావన్ (4) ను బౌల్డ్ చేశాడు. 

ఆఖరి పోరాటం..

ఆ తర్వాత జితేశ్ శర్మ (34 బంతుల్లో 44.. 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రాహుల్ చాహర్ (24 బంతుల్లో 25 నాటౌట్.. 2 ఫోర్్లు, 1 సిక్సర్) లు పోరాడినా ఆ పోరాటం పంజాబ్ ఓటమి అంతరాన్ని తగ్గించిందే తప్ప విజయాన్ని అందించలేదు.  చాహర్ తో కలిసి 8వ వికెట్ కు జితేశ్.. 41 పరుగులు జోడించాడు. కానీ శార్దూల్ వేసిన 18వ ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయిన అతడు.. డేవిడ్ వార్నర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.అదే ఓవర్లో ఆఖరి బంతికి రబాడా (6)  కూడా పెవిలియన్ చేరాడు. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లు తలా 2 వికెట్లు తీశారు. నోర్త్జ్ కు ఒక వికెట్ దక్కింది. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (63), సర్ఫరాజ్ ఖాన్ (32) లు రాణించారు. 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?