టార్గెట్ సన్‌రైజర్స్ హైదరాబాద్... ఢీసీ జెర్సీలో వార్నర్ భాయ్ హాఫ్ సెంచరీ, తన సత్తా చూపేందుకు...

Published : Apr 10, 2022, 05:27 PM ISTUpdated : Apr 10, 2022, 05:42 PM IST
టార్గెట్ సన్‌రైజర్స్ హైదరాబాద్... ఢీసీ జెర్సీలో వార్నర్ భాయ్ హాఫ్ సెంచరీ, తన సత్తా చూపేందుకు...

సారాంశం

20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్... ఐపీఎల్ 2022 సీజన్‌లో అత్యధిక స్కోరు బాదిన ఢిల్లీ, కేకేఆర్ ముందు కొండంత లక్ష్యం... 

ఒకే ఒక్క సీజన్‌... కాదు కాదు! కేవలం ఐదు మ్యాచుల్లో... అదీ కాదు. ఒకే ఒక్క మ్యాచ్‌లో షార్ట్ రన్ తీసి, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి కారణమయ్యాడనే కారణంగా డేవిడ్ వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తొలగించింది టీమ్ మేనేజ్‌మెంట్. కెప్టెన్సీ నుంచి తొలగించి, టీమ్ నుంచి తొలగించి... కనీసం మ్యాచులు చూడడానికి కూడా ఛాన్స్ లేకుండా చేసి ఘోరంగా అవమానించింది....

ఐపీఎల్ 2014 నుంచి 2020 వరకూ ఆరు సీజన్ల (బ్యాన్ కారణంగా 2018 సీజన్ ఆడలేదు) పాటు ప్రతీ సీజన్‌లోనూ 500+ పరుగులు చేస్తూ వచ్చిన డేవిడ్ వార్నర్‌, ఈ అవమానాన్ని భరించలేకపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ని తన సొంత జట్టు కంటే ఎక్కువగా భావించిన డేవిడ్ భాయ్... ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున బరిలో దిగుతున్నాడు.

తన విలువేంటో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్‌కి చూపించడమే లక్ష్యంగా వార్నర్ భాయ్, ఐపీఎల్ 2022 సీజన్ ఆడుతున్నారని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. దానికి తగ్గట్టుగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో రహానేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

డేవిడ్ వార్నర్‌కి ఇది ఈ సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీ కాగా ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 51వ 50+ స్కోరు. ఐపీఎల్‌లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన ప్లేయర్‌గా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు డేవిడ్ వార్నర్. 

ఐపీఎల్ 2022 సీజన్‌లో మొదటి మ్యాచ్ విజయం తర్వాత వరుసగా రెండు పరాజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ స్కోరు చేయగలిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది... ఈ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోరు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 210 పరుగులు చేయగా, దాన్ని అధిగమించింది ఢిల్లీ క్యాపిటల్స్.

ఓపెనర్లు ఇద్దరూ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించడంతో ఢిల్లీ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. తొలి వికెట్‌కి 8.3 ఓవర్లలోనే 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు పృథ్వీషా, డేవిడ్ వార్నర్. గత మ్యాచ్‌లో యాంకర్ రోల్ పోషించిన డేవిడ్ వార్నర్, నేటి మ్యాచ్‌లో పృథ్వీషాకి తగ్గట్టుగా బౌండరీల మోత మోగించాడు...

ఓపెనర్ పృథ్వీ షా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 29 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసిన పృథ్వీ షా, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసిన కెప్టెన్ రిషబ్ పంత్... మెరుపు ఇన్నింగ్స్ తర్వాత ఆండ్రే రస్సెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...టూ డౌన్‌లో వచ్చిన లలిత్ యాదవ్ 1 పరుగు మాత్రమే చేసి సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కాగా రోవ్‌మన్ పావెల్ 8 పరుగులు చేసి నరైన్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు...

గత నాలుగు మ్యాచుల్లో పవర్ ప్లేలో వికెట్లు తీస్తూ వచ్చిన సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్, ఈ మ్యాచ్‌లో మాత్రం ఆ ఫీట్ రిపీట్ చేయలేకపోయాడు. ఉమేశ్ యాదవ్ వేసిన 19వ ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ 2 సిక్సర్లు, అక్షర్ పటేల్ ఓ సిక్స్, ఫోర్ బాదడంతో 23 పరుగులు వచ్చాయి... 

ప్యాట్ కమ్మిన్ వేసిన ఆఖరి ఓవర్‌లో ఓ ఫోర్, సిక్సర్ బాదిన శార్దూల్ ఠాకూర్ 16 పరుగులు రాబట్టాడు. దీంతో ఢిల్లీ స్కోరు 215 పరుగులకి చేరింది. శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ వంటి బౌలింగ్ ఆల్‌రౌండర్లు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొంది, క్రీజులోకి వచ్చినా... బ్యాటర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్ ఖాన్ మాత్రం 5 వికెట్లు పడిన తర్వాత కూడా బ్యాటింగ్‌కి రాకపోవడం విశేషం... 

PREV
click me!

Recommended Stories

IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు