
ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంగే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు రాజస్తాన్ బ్యాటర్లను తక్కువ స్కోరుకే నిలువరించారు. ప్రమాదకర జోస్ బట్లర్ ను ఆదిలోనే ఔట్ చేసిన ఢిల్లీ బౌలర్లు.. ఆ తర్వాత కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి రాజస్తాన్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. రాజస్తాన్ బ్యాటింగ్ లో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు ప్రమోషన్ ఇచ్చి వన్ డౌన్ లో పంపించిన ప్రయోగం సక్సెస్ అయింది. దేవదత్ పడిక్కల్ తో కలిసి అతడు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వాళ్లిద్దరు నిలబడటంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్.. 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగలిగింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన రాజస్తాన్ రాయల్స్ కు మూడో ఓవర్లోనే తొలి దెబ్బ తగిలింది. ఈ సీజన్ లో రెచ్చిపోయి ఆడుతున్న ఆ జట్టు ఓపెనర్ జోస్ బట్లర్ (7) చేతన్ సకారియా బౌలింగ్ లో శార్దూల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
గత మ్యాచ్ లో రాజస్తాన్ హీరో యశస్వి జైస్వాల్ (19) కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. వన్ డౌన్ లో వచ్చిన అశ్విన్ (38 బంతుల్లో 50.. 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తో కలిసిన జైస్వాల్.. క్రీజులో నిలదొక్కుకోవడానికే ఇబ్బంది పడ్డాడు. నోర్త్జ్ వేసిన నాలుగో ఓవర్లో ఫోర్, సిక్సర్ కొట్టిన అతడు.. మిచెల్ మార్ష్ వేసిన 9వ ఓవర్లో లలిత్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఇక వన్ డౌన్ లో వచ్చిన అశ్విన్.. దూకుడుగా ఆడాడు. అక్షర్ పటేల్ వేసిన ఆరో ఓవర్లో 4, 6 కొట్టిన అతడు.. తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. దేవదత్ పడిక్కల్ (30 బంతుల్లో 48.. 6 ఫోర్లు, 2 సిక్సర్లు) తో కలిసి రాజస్తాన్ ఇన్నింగ్స్ ను నడిపించిన అశ్విన్.. చేతన్ సకారియా వేసిన 14వ ఓవర్లో ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ లో అశ్విన్ కు ఇది తొలి అర్థ శతకం. అదే క్రమంలో ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే మిచెల్ మార్ష్ వేసిన 15 వ ఓవర్ తొలి బంతికి అశ్విన్.. మిడాఫ్ వద్ద ఉన్న డేవిడ్ వార్నర్ కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికీ స్కోరు 107-3.
అశ్విన్ స్థానంలో వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ (6) కూడా నోర్త్జ్ వేసిన 17వ ఓవర్ తొలి బంతికి మిడ్ వికెట్ వద్ద శార్దూల్ కు చిక్కాడు. ఇక వస్తూనే సిక్సర్ బాదిన రియాన్ పరాగ్ (9)..సకారియా వేసిన 18వ ఓవర్లో భారీ షాట్ కు యత్నించి బౌండరీ లైన్ వద్ద ఉన్న పావెల్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆఖర్లో డసెన్ ( 12 నాటౌట్), ట్రెంట్ బౌల్ట్ (3 నాటౌట్) లకు కూడా భారీ షాట్లు ఆడే ఆస్కారం ఇవ్వలేదు ఢిల్లీ బౌలర్లు. టీ20లలో కీలకంగా ఉండే చివరి ఐదు ఓవర్లలో రాజస్తాన్.. 44 పరుగులే చేయగలిగింది.
ఢిల్లీ బౌలర్లలో సకారియా పొదుపుగా బౌలింగ్ చేయడమే గాక రెండు వికెట్లు కూడా తీసుకున్నాడు. మిచెల్ మార్ష్, నోర్త్జ్ కూడా తలా రెండు వికెట్లు పడగొట్టారు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.