IPL2022 Auction: ఖర్చు పెట్టిందెంత..? మిగిలిందెంత..? ఐపీఎల్ ఫ్రాంచైజీల పర్సులలో ఉన్న నగదు ఎంతంటే..

Published : Feb 11, 2022, 10:15 AM IST
IPL2022 Auction: ఖర్చు పెట్టిందెంత..? మిగిలిందెంత..? ఐపీఎల్ ఫ్రాంచైజీల పర్సులలో ఉన్న నగదు ఎంతంటే..

సారాంశం

IPL2022 Auction:  రేపటి  (శనివారం) నుంచి బెంగళూరు వేదికగా రెండ్రోజుల పాటు ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీల దగ్గర ఉన్న మొత్తం నగదు ఎంత..?   

ఐపీఎల్ 2022 సీజన్ కు ముందు జరుగబోయే మెగా వేలానికి సమయం ఆసన్నమైంది.  రేపట్నుంచి రెండ్రోజుల పాటు బెంగళూరు వేదికగా వేలం ప్రక్రియ జరుగనున్నది.  ఫ్రాంచైజీలతో పాటుగా  క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఏ ఆటగాడిని ఏ జట్టు తీసుకోబోతుంది..?  అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఏ జట్టు పర్సులో ఎంత  నగదు మిగిలి ఉంది..?  ఇంకా ఎంత ఖర్చు పెట్టొచ్చు అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.. 

బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఒక ఫ్రాంచైజీ తాను  తీసుకోబోయే ఆటగాళ్లందరి మొత్తం వేతనాలు కలిపి  రూ. 90 కోట్లకు మించరాదు. అంటే ఈ ఐపీఎల్ వేలంలో మొత్తం ఖర్చుపెట్టబోయే  నగదు   రూ. 900 కోట్లు (పది ఫ్రాంచైజీలు.. ఒక్కో ఫ్రాంచైజీ రూ. 90 కోట్లు..). గతేడాది రిటెన్షన్ ప్రక్రియ సందర్భంగా పాత 8 ఫ్రాంచైజీలు.. రిటెన్షన్ ల ద్వారా పలువురు ఆటగాళ్లను దక్కించుకున్నాయి. ఇక ఇటీవలే  ఐపీఎల్ లో చేరిన లక్నోతో పాటుగా గుజరాత్ టైటాన్స్ కూడా  ఈ  ప్రక్రియను పూర్తి చేసింది. ఇందుకోసం ఈ జట్లన్నీ రూ. 384.5 కోట్లను ఖర్చు చేశాయి. 

ఖర్చు చేసిన మొత్తం ఎంతంటే..? 

1. చెన్నై సూపర్ కింగ్స్ : రిటెన్షన్ ప్రక్రియలో నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. రవీంద్ర జడేజా (రూ. 16 కోట్లు),  ఎంఎస్ ధోని (రూ. 12 కోట్లు), మోయిన్ అలీ (రూ. 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ. 6 కోట్లు) లు పోను ఇంకా చెన్నై దగ్గర రూ. 48 కోట్ల నగదు ఉంది. 

2. ఢిల్లీ క్యాపిటల్స్ : రిటెన్షన్ లో  రిషభ్ పంత్ (రూ. 16 కోట్లు), అక్షర్ పటేల్ (రూ. 12 కోట్లు),  పృథ్వీ షా (రూ. 8 కోట్లు), ఆన్రిచ్ నోర్త్జ్ (రూ. 6 కోట్లు) లను దక్కించుకోగా మిగిలిన మొత్తం రూ.  47.5 కోట్లు

3. కోల్కతా నైట్ రైడర్స్ : రిటెన్షన్ లో ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 8కోట్లు),  వెంకటేశ్ అయ్యర్ (రూ. 8 కోట్లు), సునీల్ నరైన్ (రూ. 6 కోట్లు)లను దక్కించుకుంది. మిగిలిన మొత్తం రూ. 48 కోట్లు 

4. ముంబై ఇండియన్స్ :  రోహిత్ శర్మ  (రూ. 16 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 6 కోట్లు),  కీరన్ పొలార్డ్ (రూ. 6 కోట్లు) లకు ఖర్చు పెట్టగా రూ. 48 కోట్లు మిగిలి ఉంది. 

5. పీబీకేఎస్ : ఐపీఎల్ ఫ్రాంచైజీలలో అత్యధిక పర్స్ వాల్యూ ఉన్న జట్టు పంజాబే.. రిటెన్షన్ లో మయాంక్ అగర్వాల్ (రూ. 12 కోట్లు), అర్షదీప్ సింగ్ (రూ. 4 కోట్లు) లను మాత్రమే తీసుకున్న ఆ జట్టుకు ఇంకా రూ. 72 కోట్ల బ్యాలెన్స్ ఉంది.  

6. రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ (రూ. 14 కోట్లు), జోస్ బట్లర్ (రూ. 10 కోట్లు), యశస్వి జైస్వాల్ (రూ. 4 కోట్లు) లను దక్కించుకోగా.. మిగిలిన అమౌంట్ రూ. 62 కోట్లు

7.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి (రూ. 15 కోట్లు), గ్లెన్ మ్యాక్స్వెల్ (రూ.11 కోట్లు), మహ్మద్ సిరాజ్ (రూ. 7 కోట్లు) లను దక్కించుకుంది.  వీళ్లకు ఖర్చు చేయగా  మిగిలిన బ్యాలెన్స్ రూ. 57 కోట్లు 

8. సన్ రైజర్స్ హైదరాబాద్ : కేన్ విలియమ్సన్ (రూ. 14 కోట్లు)  అబ్దుల్ సమద్ (రూ. 4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 4 కోట్లు) లను తీసుకుంది.  బ్యాలెన్స్ రూ. 68 కోట్లు 

9. లక్నో సూపర్ జెయింట్స్ : ఇటీవలే  కెఎల్ రాహుల్  (రూ. 17 కోట్లు), మార్కస్ స్టాయినిస్ (రూ. 9.2 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ. 4 కోట్లు) లను రిటైన్ చేసుకుంది.  వారికి ఖర్చు చేయగా మిగిలిన మొత్తం  రూ. 59 కోట్లు 

10. గుజారాత్ టైటాన్స్ : హార్ధిక్ పాండ్యా (రూ. 15 కోట్లు), రషీద్ ఖాన్ (రూ.  15  కోట్లు), శుభమన్ గిల్ (రూ. 8 కోట్లు)  లను దక్కించుకోగా ఖాతాలో ఉన్న  మొత్తం రూ. 52 కోట్లు 
 
పై వివరాలను బట్టి చూస్తే.. ఈ వేలంలో ఫ్రాంచైజీల దగ్గర ఉన్న బ్యాలెన్స్ లో అత్యధికంగా ఖర్చు పెట్టబోయేది పంజాబ్ కింగ్స్. రూ. 72 కోట్లు ఖాతాలో ఉన్న నేపథ్యంలో ఆ జట్టుకు కెప్టెన్ కూడా లేడు. కెప్టెన్ తో పాటు జట్టు నిర్మాణం కూడా చేసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో  పంజాబ్ భారీగా ఖర్చు పెట్టే అవకాశముంది. ఇక కోల్కతా, చెన్నై, ముంబైల  వద్ద రూ. 48 కోట్లే మిగిలున్నాయి. అన్నింటికంటే తక్కువగా ఢిల్లీ వద్ద రూ. 47.5 కోట్లే ఉన్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !