
రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ బుధవారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో పోరాడి ఓడింది. పంజాబ్ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్య ఛేదనలో 12 పరుగులు వెనకబడి ఈ సీజన్ లో వరుసగా ఐదో ఓటమి మూటగట్టుకుంది. ముంబై బౌలర్లు విఫలమైన చోట బ్యాటర్లు ఫర్వాలేదనిపించినా.. కీలక సమయంలో రెండు రనౌట్లు ఆ జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాయి. మరి ఐదు మ్యాచులు ఓడిన ముంబై.. ఈ సీజన్ నుంచి నిష్క్రమించినట్టేనా..? ఆ జట్టుకు ప్లేఆఫ్ అవకాశాలు ఉన్నాయా..? ఒకవేళ ఉంటే ఇంకా ముంబై ఎన్ని మ్యాచులు ఆడాలి..? ఎన్ని గెలవాలి..? వంటి ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం.
ఐపీఎల్ లో పాల్గొంటున్న పది జట్లను రెండు గ్రూపులుగా విభజించిన విషయం తెలిసిందే. గ్రూప్-ఏలో ఉన్న ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఐదు మ్యాచులు ఆడింది. ఇందులో ఒక్క మ్యాచ్ గెలవలేదు. అయితే లీగ్ దశలో ఒక్కో జట్టు 14 మ్యాచులు ఆడుతుంది.
ఈ లెక్కన ముంబై ఇప్పటికే ఆడిన ఐదు మ్యాచుల్లో ఐదింటిలో ఓడింది. రోహిత్ సేన ఇంకా 9 మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ తొమ్మిదింటిలో 8 మ్యాచులు మాత్రం తప్పకుండా నెగ్గాల్సిందే. ముంబైకి వేరే ఆప్షన్ కూడా లేదు. ఓడినా ఆ జట్టు నెట్ రన్ రేట్ ఏమైనా మెరుగ్గా ఉందా..? అంటే అదీ లేదు. పాయింట్ల పట్టికలో చిట్ట చివరన (పదో స్థానం) ఉన్న ముంబై.. -1.072 నెట్ రన్ రేట్ తో మైనస్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఇక రాబోయే ప్రతి మ్యాచ్ ఆ జట్టుకు కీలకమే. 8 మ్యాచులు గెలిస్తేనే ముంబై ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి.
ఐపీఎల్ - 2022 లో ముంబై ఓటముల పరంపర :
- ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 4 వికెట్లతేడాతో ఓటమి
- రాజస్తాన్ రాయల్స్ చేతిలో 23 పరుగుల తేడాతో ఓటమి
- కేకేఆర్ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం
- ఆర్సీబీ చేతిలో 7 వికెట్లతో ఘోర పరాజయం
- పంజాబ్ చేతిలో 12 పరుగుల తేడాతో ఓటమి
తర్వాత ఆడబోయే మ్యాచులు :
ఏప్రిల్ 16న లక్నోతో.. ఏప్రిల్ 21 న చెన్నై తో.. ఏప్రిల్ 24న లక్నో తో.. ఏప్రిల్ 30న రాజస్తాన్ తో.. మే 6న గుజరాత్ తో, మే 9న కేకేఆర్ తో.. మే 12న చెన్నైతో.. మే 17 సన్ రైజర్స్ తో.. మే 21న ఢిల్లీ తో ముంబై మ్యాచులు ఆడాల్సి ఉంది.
రోహిత్ కు జరిమానా..
ఇప్పటికే వరుస ఓటములతో కొట్టుమిట్టాడుతున్న రోహిత్ శర్మకు మరో షాక్ తగిలింది. పంజాబ్ తో మ్యాచ్ లో నిర్ణీత సమయంలో 20 ఓవర్లను పూర్తి చేయనందుకు గాను అతడిపై రూ. 24 లక్షల జరిమానా విధించారు ఐపీఎల్ నిర్వాహకులు. హిట్ మ్యాన్ తో పాటు జట్టు సభ్యులకు కూడా రూ. 6 లక్షల జరిమానా లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో కూడా రోహిత్.. స్లో ఓవర్ రేట్ కారకణంగా జరిమానా ఎదుర్కున్న విషయం తెలిసిందే. ఇక మూడో సారి గనుక రోహిత్ ఇదే తప్పు రిపీట్ చేస్తే ఏకంగా రూ. 30 లక్షల జరిమానా తో పాటు ఒక మ్యాచ్ నిషేధాన్ని కూడా ఎదుర్కుంటాడు.