TATA IPL: పదింతలు పెరిగిన ఐపీఎల్ స్పాన్సర్షిప్ రేటు.. తొలి సీజన్ స్పాన్సర్ ఎవరు..? వాల్యూ ఎంతో తెలుసా..?

Published : Mar 25, 2022, 07:37 PM IST
TATA IPL: పదింతలు పెరిగిన ఐపీఎల్ స్పాన్సర్షిప్ రేటు.. తొలి సీజన్ స్పాన్సర్ ఎవరు..? వాల్యూ ఎంతో తెలుసా..?

సారాంశం

TATA IPL 2022: ఈ సీజన్ తో పాటు వచ్చే సీజన్ లో కూడా ఐపీఎల్ కు టాటా టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నది. మరి ఐపీఎల్ ప్రారంభ సీజన్ లో టైటిల్ స్పాన్సర్షిప్ గా వ్యవహరించింది ఎవరు...? దాని విలువ ఎంత..? ఇటువంటి ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం. 

భారత క్రికెట్ కు కామధేనువులా మారిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఖ్యాతి ఖండాంతరాలు దాటింది.  ఇప్పుడు ఈ లీగ్ ను బట్టే దిగ్గజ జట్లు  తమ మ్యాచులను షెడ్యూల్ చేసుకుంటున్నాయి.  రెండునెలల్లో కాసుల వర్షం కురిపించే ఈ సీజన్ కు దేశంలోని ప్రముఖ దిగ్గజ సంస్థ ‘టాటా’ స్పాన్సర్షిప్ చేయబోతున్నది.  అంతకుముందు ఈ స్థానంలో ఉన్న వివో..  పలు కారణాల రీత్యా ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకోవడంతో  ఈసారి టాటా.. ఈ క్రేజీ డీల్ ను దక్కించుకుంది.  2022-23 సీజన్ కు గాను ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించనున్న టాటా ఇందుకోసం రూ. 439.8 కోట్లు ఖర్చు చేస్తున్నది. మరి 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు  ఈ లీగ్ కు స్పాన్సర్షిప్ చేసిందెవరు..? దాని విలువ ఎంత..? 

2007లో లలిత్ మోడీ బుర్రలో మెదిలిన ఆలోచనకు రూపం ఐపీఎల్. వింబుల్డన్ మ్యాచ్ జరుగుతుండగా ఇద్దరు ఇంగ్లీష్  వ్యక్తుల (అందులో ఒకరు 12 సీజన్ల పాటు ఐపీఎల్ వేలం నిర్వహించిన రిచర్డ్ మ్యాడ్లీ)తో కూర్చుని టీ తాగుతూ.. భారత క్రికెట్ రూపు మారుస్తానని చెప్పిన మోడీ అనుకున్నది సాధించాడు. అతడిపై వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగా ప్రస్తుతం  లలిత్ మోడీ ఇండియాలో లేకపోయినా  అతడు ఆలోచన మాత్రం ఇప్పుడు క్రికెటర్లకు, ఫ్రాంచైజీలకు కాసులు కురిపిస్తున్నది. 

ఐపీఎల్ కు స్పాన్సర్ల ద్వారా వచ్చే ఆదాయమే ముఖ్యం. ఐపీఎల్ లో తొలి సీజన్ కు స్పాన్సర్ గా వ్యవహరించింది డీఎల్ఎఫ్. 2008 నుంచి 2012 దాకా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించినందుకు గాను ఆ సంస్థ బీసీసీఐతో చేసుకున్న ఒప్పందం విలువ ప్రతియేటా రూ. 40 కోట్లు.. 

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ల చరిత్ర :

- డీఎల్ఎఫ్ - 2008-12 : రూ. 40 కోట్లు 
- పెప్సీ - 2013-15 : రూ. 79.4 కోట్లు 
- వివో - 2016-17 : రూ. 100 కోట్లు
- వివో - 2018 - 19 : రూ. 439.8 కోట్లు 
- డ్రీమ్ 11 - 2020 : రూ. 222 కోట్లు 
- వివో - 2021 : రూ. 439.8 కోట్లు 
- టాటా - 2022-23 : రూ. 335 కోట్లు (రెండేండ్లకు రూ. 670 కోట్లు) 

 

ఐపీఎల్ 2022  సెంట్రల్ స్పాన్సర్స్ : 

- టాటా : టైటిల్ స్పాన్సర్
- డ్రీమ్ 11 : అఫిషియల్ పార్ట్నర్ 
- అన్ అకాడెమీ : అఫిషియల్ పార్ట్నర్
- క్రెడ్ : అఫిషియల్ పార్ట్నర్
- అప్స్టాక్స్ : అఫిషియల్ పార్ట్నర్
- స్విగ్గీ ఇన్స్టాంట్ : అఫిషియల్ పార్ట్నర్
- పేటీఎం : అఫిషియల్ అంపైర్ పార్ట్నర్ 
- సీయట్ : అఫిషియల్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్ట్నర్  

ఈ లెక్కన చూస్తే ఐపీఎల్  టైటిల్ స్పాన్సర్షిప్ విలువ పదింతలు పెరిగింది. ఇక ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ కూడా  ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నది. 2019 లో ఓ అంచనా ప్రకారం  ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ రూ. 47,500 కోట్లుగా ఉంది. ఈ మూడేండ్లలో ఐపీఎల్ విలువ పెరిగిందే తప్ప తగ్గింది లేదు. అదీగాక ఈసారి రెండు కొత్త జట్లు కూడా లీగ్ లో చేరాయి.  

 

ఐపీఎల్ తో పాటు వివిధ జట్లకు కూడా స్పాన్సర్లు ఉన్నాయి. ఆటగాళ్లు ధరించే జెర్సీలు, హెల్మెట్లు, ఇతర సామాగ్రి మీద వారి బ్రాండ్లకు సంబంధించిన లోగోలు ఉంటాయి. వీటి ద్వారా కూడా ఫ్రాంచైజీలకు ఆదాయం వస్తున్నది.  ఇలా స్పాన్సర్ల ద్వారా ఆదాయం పొందుతున్న జట్లలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ముందున్నాయి. ఈ రెండు జట్లు తమ స్పాన్సర్ల ద్వారా రూ. 100 కోట్లకు పైగా ఆదాయాన్ని పొందుతున్నాయి.  ఈ ఏడాది చెన్నైకి టీవీఎస్  యూరో గ్రిప్  ప్రధాన స్పాన్సర్ కాగా.. ముంబైకి స్లైస్  సంస్థ స్పాన్సర్షిప్ చేస్తున్నది. 

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?