
బీసీసీఐ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఐపీఎల్ పై కరోనా కాటు పడింది. ఎన్నో జాగ్రత్తలతో క్రికెటర్లందరినీ ముందుగా క్వారంటైన్ లో ఉంచి.. తర్వాత బయో బబుల్ లో ఐపీఎల్ నిర్వహించినప్పటికీ.. పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. వరసగా రెండు రోజుల్లో నలుగురైదుగురు కరోనా బారిన పడటంతో.. ముందుస్తు చర్యల్లో భాగంగా ఐపీఎల్ వాయిదా వేశారు. తొలుత కొద్ది రోజుల తర్వాత నిర్వహిస్తారని అందరూ అనుకున్నారు. కానీ .. పరిస్థితులు దారుణంగా ఉండటంతో.. ఐపీఎల్ నిరవధిక వాయిదా వేశారు.
కాగా.. ఐపీఎల్ వాయిదా పడిందనే వార్తలు విని కొందరు చాలా బాధపడగా.. మరికొందరు మాత్రం చాలా సంతోషించారు. మొదటి నుంచి బయట ప్రజలు కరోనాతో బాధపడుతుంటే.. ఈ సమయంలో ఐపీఎల్ ఎంటి అంటూ చాలా మంది విమర్శించారు. వారిలో పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా ఉన్నాడు.
తాజాగా ఐపీఎల్ వాయిదాపై షోయబ్ అక్తర్ స్పందించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను వాయిదా వేయాలని రెండు వారాల క్రితమే తాను చెప్పానని, ప్రజల ప్రాణాల కంటే మరేదీ ముఖ్యం కాదని పాకిస్థాన్ మాజీ స్టార్ బౌలర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. పలు ఫ్రాంఛైజీలకు చెందిన ఆటగాళ్లు కూడా కరోనా వైరస్ బారిన పడడంతో ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంపై అక్తర్ స్పందించాడు. `ఐపీఎల్‌ను వాయిదా వేయాలనే నిర్ణయం సరైనది. ఇలా అవుతుందని నాకు ముందే తెలుసు. ఐపీఎల్‌ను వాయిదా వేయాలని రెండు వారాల క్రితమే సూచించాను. ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉన్న భారత్‌లో మనుషుల ప్రాణాలు కాపాడడం కంటే మరేది ముఖ్యం కాద`ని అక్తర్ అన్నాడు.