ఐపిఎల్ 2021: పంత్ జట్టుపై ఓటమి, ధోనీ స్పందన ఇదీ...

By telugu teamFirst Published Apr 11, 2021, 9:55 AM IST
Highlights

రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఒటమిపై సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్పందించాడు. ఢిల్లీ బౌలర్లను ప్రశంసిస్తూ తమ జట్టు బౌలర్లను తీవ్రంగా తప్పు పట్టాడు.

చెన్నై: రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ మీద తమ జట్టు ఓటమి పాలు కావడంపై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పందించాడు. ఐపిఎల్ 2021లో భాగంగా జరిగిన మ్యాచులో  సీఎస్ కు తమ ముందు ఉంచిన 189 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అలవోకగా ఛేదించింది. మ్యాచ్ తర్వాత జరిగిన కార్యక్రమంలో ధోనీ మాట్లాడాడు. 

ఓటమిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలర్ల ప్రదర్శనను ఆయన తప్పు పట్టాడు. పిచ్ చాలా పేలవంగా ఉండడంతో తొలుత బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారిందని, తమకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలిందని, పిచ్ మీద తేమ ఉందని, అది మొదట బ్యాటింగ్ చేసిన జట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎంఎస్ ధోనీ అన్నాడు. పిచ్ మీద మంచు ఉంటే అది ఛేజింగ్ జట్టుకు అనుకూలంగా ఉంటుందని ఆయన అన్నాడు. 

టాస్ ఓడిపోయిన తర్వాత ఈ పిచ్ మీద సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని తాము అనుకున్నామని, అది మనసులో ఉంచుకుని మ్యాచ్ ప్రరంభంలో జాగ్రత్తగా ఆడాలని అనుకున్నామని, అయితే అది కుదరలేదని అన్నాడు. తొలి అరగంట చాలా జాగ్రత్తగా ఆడాలని అనుకున్నామని, అదే లక్ష్యంతో బ్యాటింగ్ చేశామని, మరో 15-20 పరుగులు చేసి ఉంటే బాగుండేదని, తమకు అరంభంలోనే ఎదురు దెబ్బ తగిలిందని, పిచ్ మీద తేమ ఉండడం వల్ల ప్రారంభంలో బంతి గమనంపై అంచనా లభించదని ఆయన అన్నాడు. 

బంతి ఆగుతూ వచ్చిందని, దాంతో ఆరంభంలో కీలకమైన వికెట్లు కోల్పోయామని, అయినా తమ బ్యాట్స్ మెన్ బాగా ఆడారని, తమ బౌలింగ్ ఇంకా మెరుగుపడాలని, బౌలర్ల ప్రదర్శన పేలవంగా ఉందని ధోనీ అన్నాడు. ప్రత్యర్థి జట్టుకు పరుగులు ఇవ్వడమే లక్ష్యంగా బంతులు వేసినట్లు కనిపిస్తోందని అన్నాడు. 

తదుపరి మ్యాచుకు ఇది తమకు ఓ గుణపాఠమని, ఈ విధమైన పిచ్ మీద 200 పరుగులు ఉంటేనే గెలుస్తామని, ఢిల్లీ బౌలర్లు మంచి లైన్ అండ్ లెన్త్ తో బంతులు వేశారని, ఈ విధమైన పిచ్ మీద ఎటువంటి బంతులు వేయాలో అటువంటి బంతులే విశారని, తమ ఓపెనర్లకు ఢిల్లీ బౌలర్లు వేసిన బంతులు అద్భుతమని ధోనీ అన్నాడు. 

click me!