IPL 2021 CSK vs DC: టేబుల్ టాపర్ల మధ్య ఆసక్తికర సమరం.. ఎవరిని వరించేనో విజయం..?

By team teluguFirst Published Oct 4, 2021, 12:54 PM IST
Highlights

IPL 2021 CSK vs DC: ఐపీఎల్ రెండో దశలో ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (chennai super kings), ఢిల్లీ క్యాపిటల్స్ (delhi capitals) నేటి సాయంత్రం దుబాయ్ లో తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి, రెండు స్థానాల్లో ఉన్న ఈ జట్లు.. నేటి మ్యాచ్ లో గెలిచి ఆధిక్యాన్ని ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. 

గత మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ ను ఓడించి ప్లే ఆఫ్స్ చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్..  పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడబోతుంది. ఇప్పటికే ఇరు జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించడంతో ఈ మ్యాచ్ లో నెగ్గి ఆధిక్యాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నాయి. దుబాయ్ వేదికగా సాయంత్రం 7.30 గంటలకు జరిగే ఈ మ్యాచ్ లో సీనియర్లకు విశ్రాంతినిచ్చి జూనియర్లకు అవకాశమివ్వాలని రెండు జట్లు భావిస్తున్నాయి. 

ఆడిన 12 మ్యాచుల్లో 9 గెలిచి 18 పాయింట్లతో సీఎస్కే టేబుల్ టాపర్ గా ఉండగా.. అన్నే మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 9 విజయాలతో 18 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. రెండు జట్ల మధ్య తేడా నెట్ రన్ రేట్ మాత్రమే. కాగా, నేటి మ్యాచ్ లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నిలబెట్టుకుంటుంది. 

Latest Videos

భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉండి ఎన్నో మధురమైన విజయాలు అందించిన ధోని (ms dhoni).. గత సీజన్ లో ప్లే ఆఫ్స్  (Ipl Playoffs) కూడా చేరని సీఎస్కేకు కప్ అందించాలనే పట్టుదలతో ఉన్నాడు. అందులో ధోని సఫలీకృతుడవుతున్నాడు కూడా. మరోవైపు ధోని నీడలో ఎదుగుతున్న పంత్ (rishabh pant) కూడా భావి భారత కెప్టెన్ గా రాణించాలని కోరుకుంటున్నాడు. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అత్యద్భుతమైన ఆటతో అదరగొడుతుంది. అందులో పంత్ పాత్ర కీలకమనడంలో సందేహం లేదు. ఈ ఇద్దరు కెప్టెన్ల మధ్య నేడు రసవత్తరమైన పోటికి తెరలేవనుంది. 

ఐపీఎల్ లో ఇప్పటివరకు రెండు జట్లు 24 మ్యాచులాడగా.. అందులో చెన్నై (csk) 15 సార్లు విజయం సాధించగా.. ఢిల్లీ (dc) తొమ్మిది సార్లు నెగ్గింది. ఈ సీజన్ లో రెండు జట్లు రెండోసారి తలపడనున్నాయి. గత పోరులో  ఢిల్లీ విజయం సాధించడం గమనార్హం. ఈ మ్యాచ్ గెలిస్తే ఐపీఎల్ లో వారికి వందో విజయం కానుంది. 

జట్ల బలాబలాలు: ఇరు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ లోనూ ఇరగదీస్తున్నాయి. గత మ్యాచ్ లో గైక్వాడ్, డుప్లెసిస్, జడేజా రాణించడంతో సీఎస్కే భారీ స్కోరు చేసింది. కానీ రాజస్థాన్ రాయల్స్ విజృంభణతో కొండంత లక్ష్యం  ఆవిరైపోయింది. దీంతో వరుస నాలుగు విజయాల తర్వాత చెన్నైకి తొలి పరాజయం. దీంతో తదుపరి రెండు మ్యాచులలో ఎలాగైనా నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవాని చెన్నై చూస్తున్నది. 

ఇక మరోవైపు గత మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ తో ఉత్కంఠ పోరులో నెగ్గిన పంత్ సేన.. ఈ మ్యాచ్ లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా, పంత్ లతో బ్యాటింగ్ అభేద్యంగా ఉంది. బౌలింగ్ లో అక్షర్, అవేశ్ ఖాన్, రబాడ, నార్త్జ్ ఇరగదీస్తున్నారు. 

పిచ్ ఎలా ఉందంటే... దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలించే ఫిచ్. తొలుత సీమర్లకు అనుకూలించిన తర్వాత బంతి స్పిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ పిచ్ పై ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు స్కోరు 160 పరుగులు. రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టుకు నెగ్గే అవకాశాలు 80 శాతం ఉన్నాయి. 

జట్లు అంచనా: 
చెన్నై సూపర్ కింగ్స్ :
రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, హెజెల్వుడ్, సామ్ కరన్, దీపక్ చాహర్ 

ఢిల్లీ క్యాపిటల్స్ : శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), హెట్మెయర్, అక్షర్ పటేల్, రబాడ, నార్త్జ్, అవేశ్ ఖాన్, అశ్విన్

click me!