కోల్‌కత పై పోరు: ఆడుతూపాడుతూ నెగ్గిన బెంగళూరు

By team teluguFirst Published Oct 21, 2020, 10:31 PM IST
Highlights

కోల్‌కత తో మ్యాచులో బెంగళూరు ఘన విజయాన్ని సాధించింది. 84 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు బ్యాట్స్ మెన్ 13.3 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి చేధించారు. 

కోల్‌కత తో ఇందాక కొద్దిసేపటికింద ముగిసిన మ్యాచులో బెంగళూరు ఘన విజయాన్ని సాధించింది. తొలుత బెంగళూరు బౌలర్లు 84 పరుగులకే కోల్‌కత ను కట్టడి చేయగా ఆ తరువాత బెంగళూరు బ్యాట్స్ మెన్ ఆ లక్ష్యాన్ని 13.3 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి చేధించారు. 

బెంగళూరు ఓపెనర్లు దేవదత్ పాడిక్కాల్, ఆరోన్ ఫించ్ లు తక్కువ స్కోర్లకే అవుట్ అయినప్పటికీ... ఆ తరువాత విరాట్ కోహ్లీతో జత కలిసిన గురుకీరత్ మాన్ లాంఛనాన్ని పూర్తిచేశారు. ఆడుతూ పాడుతూ మ్యాచును నెగ్గింది బెంగళూరు. 

కోల్‌కత బౌలర్లలో ఫెర్గ్యూసన్ ఒక వికెట్ తీసాడు.  

అంతకుముందు... కోల్‌కతను 84 పరుగులకే కట్టడిచేసి వారిచేత ఒక చెత్త రికార్డును నెలకొల్పించారు బెంగళూరు బౌలర్లు. బెంగళూరు బౌలర్ల ధాటికి  కోల్‌కత బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా కుదేలయింది. సిరాజ్ వరుసగా రెండు వికెట్లను తీసి వెన్ను విరిస్తే.... ఆ వెంటనే నవదీప్ సాయిని, ఆ తరువాత మరోసారి సిరాజ్ విరుచుకు పడడంతో  కోల్‌కత టాప్ ఆర్డర్ అంతా పెవిలియన్ చేరింది. 

ఇక ఫాస్ట్ బౌలర్ల వంతు ముగియగానే స్పిన్నర్లు మరో రౌండ్ కోల్‌కత వెన్ను విరిచారు. అప్పటికే కోల్‌కత కోలుకోలేని స్థితికి చేరుకుంది. చాహల్ రెండు వికెట్లను తీయగా, మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మోర్గాన్ ని వెనక్కి పంపి కోల్‌కత బ్యాటింగ్ ఆర్డర్ ని నామరూపాలు లేకుండా చేసారు. 

ఈ రోజు మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కత.... తమ నిర్ణయాన్ని తలుచుకొని బాధపడే స్థితిని కల్పించారు బెంగళూరు బౌలర్లు. సమిష్టిగా రాణించి కోల్‌కత కథను తక్కువ స్కోరుకే ముగించేశారు. 

ఈరోజు మ్యాచులో టాప్ ఆర్డర్ లో టామ్ బాంటన్, మోర్గాన్ మినహా వేరే ఏ కోల్‌కత బ్యాట్స్ మెన్ కూడా రెండంకెల స్కోరు చేయలేదు. లాకీ ఫెర్గ్యూసన్ సాధించిన 19 పరుగులు టీం లో రెండవ టాప్ స్కోర్ కావడం గమనార్హం. 

బెంగళూరు బౌలింగ్ లో సిరాజ్ 3 వికెట్లను కూల్చగా, చాహల్ రెండు వికెట్లను కూల్చారు. సుందర్, సాయిని చెరో వికెట్ ని పడగొట్టి  కోల్‌కత ను చావుదెబ్బ తీశారు. 

click me!