రాజస్థాన్ కెప్టెన్ స్మిత్ కు వరుస షాకులు: 12 లక్షల జరిమానా

By team teluguFirst Published Oct 7, 2020, 11:44 AM IST
Highlights

ముంబయి ఇండియన్స్‌ను కట్టడి చేసే ప్రయత్నంలో 20 ఓవర్ల కోటా పూర్తి చేసేందుకు స్మిత్‌ ఎక్కువ సమయం తీసుకున్నాడు. దీంతో మ్యాచ్‌ పోవటంతో పాటు మ్యాచ్‌ ఫీజులో కొత పడింది. 

మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా తయారైంది రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ స్టీవెన్‌ స్మిత్‌ పరిస్థితి.  షార్జాలో బ్యాక్‌ టూ బ్యాక్‌ విజయాలతో ఈ ఐపీఎల్‌ టైటిల్‌ ఫేవరేట్‌ ట్యాగ్‌ అందుకున్న రాజస్థాన్‌.. అక్కడి నుంచి బయటకి రాగానే అంచనాలను అందుకోలేదు. 

దుబాయ్‌, అబుదాబిలలో పేలవ ప్రదర్శనతో హ్యట్రిక్‌ ఓటములు మూటగట్టుకుంది. తొలి రెండు మ్యాచుల్లో ఒంటి చేత్తో విజయాలు అందించిన స్టార్‌ బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్‌.. రాజస్థాన్‌ ఓడిన మూడు మ్యాచుల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు.  దీంతో తొలి రెండు విజయాల సంతోషం.. హ్యాట్రిక్‌ ఓటములతో పూర్తిగా ఆవిరైపోయింది.

మంగళవారం అబుదాబిలో ముంబయి ఇండియన్స్‌ చేతిలో రాజస్థాన్‌ 57 పరుగుల తేడాతో భారీ ఓటమి చెందింది. పెద్ద బౌండరీల అబుదాబిలో ముంబయి ఇండియన్స్‌ 193/4 భారీ స్కోరు సాధించింది.  

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ బౌలర్లు ప్రణాళిక బద్దంగా బౌలింగ్‌ చేసినా.. సూర్యకుమార్ యాదవ్‌ తెలివిగా పరుగులు పిండుకున్నాడు. ఆర్చర్‌, రాజ్‌పుత్‌ బౌలింగ్‌లలో వికెట్ల వెనకాల బౌండరీల రూపంలోనే ఏకంగా 51 పరుగులు సాధించాడు. 

ఆరంభంలో రోహిత్‌ శర్మ, ఆఖర్లో హార్దిక్‌ పాండ్య.. మ్యాచ్‌ సాంతం సూర్యకుమార్‌ యాదవ్‌ను కట్టడి చేసేందుకు స్టీవెన్‌ స్మిత్‌ బౌలర్లతో మంతనాలు చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్నాడు.

ముంబయి ఇండియన్స్‌ను కట్టడి చేసే ప్రయత్నంలో 20 ఓవర్ల కోటా పూర్తి చేసేందుకు స్మిత్‌ ఎక్కువ సమయం తీసుకున్నాడు. దీంతో మ్యాచ్‌ పోవటంతో పాటు మ్యాచ్‌ ఫీజులో కొత పడింది. 

ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ప్రకారం స్లో ఓవర్‌ రేట్‌ కింద స్మిత్‌కు రూ. 12 లక్షల జరిమానా విధిస్తూ మ్యాచ్‌ రిఫరీ శక్తి సింగ్‌ నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020లో స్లో ఓవర్‌ రేటు కారణంగా జరిమానాకు గురైన మూడో కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌.  

బెంగళూర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌లు ఇదివరకే రూ. 12 లక్షల చొప్పున జరిమానాకు గురైన సంగతి తెలిసిందే.  స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా జరిమానాకు గురైన ముగ్గురు కెప్టెన్లు ఆ మ్యాచుల్లో పరాజయాలు చవిచూడటం గమనార్హం. 

click me!