పంజాబ్‌తో ముంబయి పోరు: అగ్రస్థానంపై రోహిత్ సేన కన్ను

By team teluguFirst Published Oct 18, 2020, 12:35 PM IST
Highlights

చెన్నైపై విజయంతో ఢిల్లీ టాప్‌ ప్లేస్‌లోకి వెళ్లగా.. నేడు పంజాబ్‌ను ఓడించి అగ్రస్థానం తిరిగి చేజిక్కించుకునేందుకు ముంబయి ఇండియన్స్‌ ఎదురుచూస్తోంది.

ఐపీఎల్‌ 2020 పాయింట్ల పట్టికలో అగ్రస్థానం రేసులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబయి ఇండియన్స్‌ మ్యూజికల్‌ చైర్‌ ఆడుతోంది. అగ్రస్థానం మ్యాచ్‌కోసారి మారుతోంది. చెన్నైపై విజయంతో ఢిల్లీ టాప్‌ ప్లేస్‌లోకి వెళ్లగా.. నేడు పంజాబ్‌ను ఓడించి అగ్రస్థానం తిరిగి చేజిక్కించుకునేందుకు ముంబయి ఇండియన్స్‌ ఎదురుచూస్తోంది.

మరోవైపు అదే పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి బయటపడేందుకు కింగ్స్‌ ఎలెవన్‌ ఫంజాబ్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.  

ఎదురులేని ముంబయి

ముంబయి ఇండియన్స్‌ పటిష్టంగా కనిపిస్తోంది.  మూడు విభాగాల్లోనూ ముంబయికి ఎదురులేదు. బ్యాటింగ్‌ లైనప్‌లో క్వింటన్‌ డికాక్‌ మొదలుకొని, కృనాల్‌ పాండ్య వరకు అందరూ భీకర ఫామ్‌లో ఉన్నారు.

ఇక టోర్నీలో ముంబయి ఇండియన్స్‌ ఇప్పటివరకూ కేవలం 13 మంది క్రికెటర్లనే బరిలోకి దింపింది.  మరే జట్టు ఇలా 13 మందితో ఆడుతూ అగ్రస్థానంలో నిలువలేదు. బంతితో జశ్‌ప్రీత్‌ బుమ్రాకు జేమ్స్‌ పాటిన్సన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌ తోడవటంతో.. బౌలింగ్‌ దాడిని ఎదుర్కొవటం ప్రత్యర్థుల తరం కావటం లేదు. నేటి మ్యాచ్‌లోనూ ముంబయి ఇండియన్స్‌ ఫేవరేట్‌.

పంజాబ్‌కు ప్రాణసంకటం

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ఇక ప్రతి మ్యాచ్‌ ప్రాణ సంకటమే.  లీగ్‌ దశలో మరో ఓటమి పంజాబ్‌ను ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి అవుట్‌ చేయగలదు. చివరి మ్యాచ్‌లో ఆఖరు ఓవర్లో ఉత్కంఠ విజయం సాధించిన పంజాబ్‌ నేడు ముంబయిని ఎదురించి నిలువటం అంత సులువు కాదు.  

బ్యాటింగ్‌ లైనప్‌లో క్రిస్‌ గేల్‌ రాక పంజాబ్‌ బలాన్ని గణనీయంగా పెంచింది. లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు ఇది పనికొచ్చే అంశం. కానీ బౌలింగ్‌లోనే పంజాబ్‌ సమస్యలు వెంటాడుతున్నాయి.

తొలి 15 ఓవర్లు కట్టుదిట్టంగా బంతులేస్తోన్నమహ్మద్‌ షమి గ్యాంగ్‌.. చివరి ఐదు ఓవర్లలో పరుగులను ధారాళంగా ఇచ్చేస్తోంది. ముంబయి ఇండియన్స్‌ ఆఖరు ఐదు ఓవర్లలో 14 రన్‌రేట్‌తో పరుగులు పిండుకుంటోంది. మరి ముంబయ దూకుడును పంజాబ్‌ ఆపగలదా? చూడాలి.

ప్లేయింగ్‌ ఎలెవన్‌ (అంచనా)
ముంబయి ఇండియన్స్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌, కృనాల్‌ పాండ్య, నాథన్‌ కౌల్టర్ నైల్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, రాహుల్‌ చాహర్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌:  కెఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌,వికెట్‌ కీపర్‌), మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌ గేల్‌, నికోలస్‌ పూరన్‌,  గ్లెన్‌ మాక్స్‌వెల్‌, దీపక్‌ హుడా, క్రిస్‌ జోర్డాన్‌, మురుగన్‌ అశ్విన్‌, రవి బిష్ణోయ్‌, మహ్మద్‌ షమి, అర్షదీప్‌ సింగ్‌.  

click me!