హైదరాబాద్ వర్సెస్ పంజాబ్: బాల్ వర్సెస్ బ్యాట్ ఫైట్ అంటే ఇది..!

By team teluguFirst Published Oct 8, 2020, 1:33 PM IST
Highlights

ఐదు మ్యాచుల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండు విజయాలు సాధించగా, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఐదు మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క విజయం నమోదు చేసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు బ్యాటింగ్‌ లైనప్‌ సమస్యగా మారగా.. పంజాబ్‌కు బౌలింగ్‌ విభాగం తలనొప్పిగా తయారైంది. 

కాగితంపైనే కాదు, మైదానంలోనూ మెరుగైన జట్లు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌. అయినా, ఐపీఎల్‌ 2020లో ఈ రెండు జట్లు విజయాల వేటలో వెనుకంజలో ఉన్నాయి. 

ఐదు మ్యాచుల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండు విజయాలు సాధించగా, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఐదు మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క విజయం నమోదు చేసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు బ్యాటింగ్‌ లైనప్‌ సమస్యగా మారగా.. పంజాబ్‌కు బౌలింగ్‌ విభాగం తలనొప్పిగా తయారైంది. 

ఈ రెండు జట్లు నేడు ముఖాముఖి ఆడనున్నాయి. దుబాయ్‌లో నేడు హైదరాబాద్‌, పంజాబ్‌ మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది.

బ్యాట్‌తో మెరవాలి...

2019 ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు పరుగుల్లో ఏకంగా 60 శాతం పరుగులను ఓపెనర్లు డెవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టోలే సాధించారు. ఈ సీజన్‌లో జానీ బెయిర్‌స్టో, డెవిడ్‌ వార్నర్‌ కలిసికట్టుగా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడనే లేదు. 

గత మ్యాచ్‌లో వార్నర్‌ అర్థ సెంచరీతో మెరిసినా, అది విజయానికి సరిపోలేదు. కేన్‌ విలియమ్సన్‌ తొలి మ్యాచ్‌లో మినహా తర్వాత రాణించలేదు. యువ ఆటగాళ్లు ప్రియమ్‌ గార్గ్‌, అభిషేక్‌, అబ్దుల్‌లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.

భువనేశ్వర్‌ కుమార్‌ లేకపోయినా.. హైదరాబాద్‌ బౌలింగ్‌ విభాగం పటిష్టంగానే ఉంది. టి. నటరాజన్‌కు తోడు సందీప్‌ శర్మ, సిద్దార్థ్‌ కౌల్‌లు పేస్‌ బాధ్యతలు తీసుకోనున్నారు. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌ దళానికి నాయకత్వం వహించనున్నాడు.

బంతితో రాణించాలి...

ఐపీఎల్‌ 2020లో ప్రమాదకర, ఫామ్‌లో ఉన్న బ్యాటింగ్‌ లైనప్‌లలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ముందుంది. ఆ జట్టులో బ్యాట్స్‌మెన్‌ అందరూ ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్లు కెఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌లు సీజన్‌లో చెరో సెంచరీ కొట్టేశారు. పంజాబ్‌ స్కోరులో ఈ ఇద్దరి వాటా సింహభాగం. 

గ్లెన్‌ మాక్స్‌వెల్‌, నికోలస్‌ పూరన్‌లకు ఆడే అవకాశమే పెద్దగా లభించలేదు. భారీ లక్ష్యాలను నిర్దేశించటంలోనైనా, భారీ టార్గెట్‌లను ఛేదించటంలోనైనా పంజాబ్‌ గొప్పగా కనిపిస్తోంది.

కానీ బౌలింగ్‌ విభాగమే అంచనాలను అందుకోవటం లేదు. మహ్మద్‌ షమి, షెల్డన్‌ కాట్రెల్‌లు పవర్‌ ప్లేలో చూపిస్తున్న జోరు.. డెత్‌ ఓవర్లలో కనబర్చటం లేదు. దీంతో తొలి 15 ఓవర్లు నియంత్రణలో ఉన్న మ్యాచ్‌.. ఆఖరు ఐదు ఓవర్లలో ప్రత్యర్థి చేతుల్లోకి వెళ్లిపోతుంది.  ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన సన్‌రైజర్స్‌పైనైనా పంజాబ్‌ బౌలర్లు పంజా విసురుతారేమో చూడాలి.

ప్లేయింగ్‌ ఎలెవన్‌ (అంచనా)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: డెవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో, కేన్‌ విలియమ్సన్‌, మనీశ్‌ పాండే, ప్రియమ్‌ గార్గ్‌, అభిషేక్‌ శర్మ, అబ్దుల్‌ సమద్‌, రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, సిద్దార్థ్‌ కౌల్‌, టి. నటరాజన్‌.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌: కెఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, మన్‌దీప్‌ సింగ్‌, నికోలస్‌ పూరన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, సర్పరాజ్‌ ఖాన్‌, క్రిస్‌ జోర్డాన్‌, మురుగన్‌ అశ్విన్‌, షెల్డన్‌  కాట్రెల్‌, మహ్మద్‌ షమి, రవి బిష్ణోయ్‌.   

click me!