
ఐపీఎల్ సందడి షురూ అయ్యింది. ఏ టీంకి ఆ టీం ఎక్కడా తగ్గకుండా ఆడేస్తున్నారు.కాగా.. బుధవారం ముంబయి ఇండియన్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. కాగా.. ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ తమ సత్తా చాటింది. తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. అయితే.. ఆ జట్టు క్రికెటర్ హార్దిక్ పాండ్యా విషయంలో మాత్రం అభిమానులు తీవ్ర నిరాశకు గురౌతున్నారు.
హార్దిక్ ఎవరూ ఊహించని రీతిలో హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. స్టంప్‌కి బ్యాట్‌ని తాకించి ఔట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ 2020 సీజన్‌లో తొలి హిట్ వికెట్ నమోదైంది. హార్దిక్ అలా ఔట్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. దీంతో.. అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో హార్దిక్ ని ఏకిపారేస్తున్నారు.
ఫన్ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. కోల్ కతా టీం.. హార్దిక్ ని ఎలా ఔట్ చేయాలా అని ఆలోచిస్తుంటే.. మీకేందుకు ఆ శ్రమ అంటూ హార్దిక్ ఔట్ అయ్యాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
కాగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌరవ్ తివారి పెవిలియన్ చేరిన అనంతరం 16వ ఓవర్లో హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. వచ్చిరావంతోనే పరుగుల వేట ఆరంబించాడు. 13 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 18 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసేందుకు ఆండ్రీ రసెల్ బంతిని అందుకున్నాడు. పాండ్యా పదే పదే ఆఫ్ స్టంప్ లైన్‌పైకి వెళ్లి ఆడుతుండటంతో.. రసెల్ తెలివిగా వైడ్ లైన్‌కి సమీపంలో యార్కర్‌ని సంధించాడు. బంతి క్షణాల్లో వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. అయితే ఆ బంతిని షాట్ ఆడేందుకు పాండ్యా.. ఆఫ్‌స్టంప్ సమీపానికి వెళ్లాడు. షాట్ ఆడబోయే క్రమంలో పాండ్యా.. స్టంప్‌కి బ్యాట్‌ని తాకించేశాడు. ఇంకేముంది హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు.