IPL 2020 CSK VS KKR:కోల్‌కతపై చెన్నై జోరు కొనసాగించేనా..?

By team teluguFirst Published Oct 7, 2020, 4:34 PM IST
Highlights

అంబటి రాయుడు, డ్వేన్‌ బ్రావోలు గాయాల నుంచి కోలుకున్నారు. ఇప్పుడు సూపర్‌కింగ్స్‌ ఆరోగ్యకర జట్టుగా కనిపిస్తోంది. టాప్‌ ఆర్డర్‌లో డుప్లెసిస్‌ జోరుమీదున్నాడు. ఇప్పుడు షేన్‌ వాట్సన్‌ కూడా తోడయ్యాడు. యువ ఆల్‌రౌండర్‌ శామ్‌ కరన్‌ అంచనాలకు మించి రాణిస్తున్నాడు.

నాలుగు మ్యాచుల్లో మూడు పరాజయాలు. ఏ విభాగంలో చూసిన తీవ్రమైన సమస్యలే. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు పరిస్థితి ఇది. పంజాబ్‌పై వీర ప్రతాపం చూసిన ధోనీసేన.. కనీవినీ ఎరుగని విజయాన్ని అందుకుంది.

చివరి మ్యాచ్‌లో విజయం ఇచ్చిన కిక్‌తో నేడు కోల్‌కత నైట్‌రైడర్స్‌తో తలపడేందుకు సూపర్‌కింగ్స్‌ సిద్ధపడుతోంది. ఒక్క విజయంతో చెన్నై రూపురేఖలు మారిపోలేదు. కానీ,ఆత్మవిశ్వాసం నిండిన చెన్నైని ఓడించటం అంత సులువు కాదు.

మరోవైపు సీజన్‌లో ఇంకా పూర్తి స్థాయిలో లయ అందుకోని కోల్‌కత నేడు ధనాధన్‌ విజయంతో రేసులోకి వస్తుందేమో చూడాలి. కోల్‌కత నైట్‌రైడర్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌లు నేడు అబుదాబిలో తలపడనున్నాయి. మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది.

చెన్నైసూపర్‌కింగ్స్‌కు ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌లు సూపర్‌ డూపర్‌ విజయాన్ని అందించారు. ఓపెనర్ల జోరుతో బ్యాటింగ్‌ లైనప్‌లో సమస్యలు అన్నీ సమసిపోయినట్టు కాదు. కానీ అంబటి రాయుడు, డ్వేన్‌ బ్రావోలు గాయాల నుంచి కోలుకున్నారు. ఇప్పుడు సూపర్‌కింగ్స్‌ ఆరోగ్యకర జట్టుగా కనిపిస్తోంది.

టాప్‌ ఆర్డర్‌లో డుప్లెసిస్‌ జోరుమీదున్నాడు. ఇప్పుడు షేన్‌ వాట్సన్‌ కూడా తోడయ్యాడు. యువ ఆల్‌రౌండర్‌ శామ్‌ కరన్‌ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఎం.ఎస్‌ ధోని, రవీంద్ర జడేజాలు ఇంకా తమదైన ఇన్నింగ్స్‌లు ఆడలేదు.

రసెల్‌ కోసం బౌలింగ్‌ విభాగంలో విదేశీ పేసర్‌ను తీసుకునే అవకాశం లేకపోలేదు. షార్దుల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, పియూశ్‌ చావ్లాలతో కూడిన దేశవాళీ బౌలింగ్‌ విభాగం నేడు కోల్‌కతను కట్టడి చేయగలదేమో చూడాలి.

ఐపీఎల్‌లో అత్యంత ప్రమాదకర ఆటగాడు అండ్రీ రసెల్‌. ఆఖరు మూడు ఓవర్లలో 80-90 పరుగులు సాధించాల్సిన సమీకరణాలు ఉన్న మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించిన ఘనత అతడిది. బయో బబుల్‌లో రసెల్‌ ప్రతాపం ఇంకా చూపించలేదు. కానీ అతి త్వరలోనే రసెల్‌ విధ్వంసం ఉందనే సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి.

ఇయాన్‌ మోర్గాన్‌ ఇప్పటికే ధనాధన్‌ టచ్‌లోకి వచ్చాడు.  దీంతో కోల్‌కత కాస్త ప్రమాదకరంగా కనిపిస్తోంది. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌, ఓపెనింగ్‌ పించ్ హిట్టర్‌ సునీల్‌ నరైన్‌లు జట్టుకు భారమవుతున్నారు. తమ స్థానాలకు న్యాయం చేయగల ప్రదర్శనలు చేయాల్సిన బాధ్యత ఆ ఇద్దరి ఆటగాళ్లపై ఉంది.

చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ మరోసారి బెంచ్‌కు పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఎం.ఎస్‌ ధోనిపై అమోఘమైన రికార్డు కలిగిన నరైన్‌.. నేడూ చెన్నై సారథిని ముప్పుతిప్పలు పెడతాడేమో చూడాలి.

ప్లేయింగ్‌ ఎలెవన్‌ (అంచనా)

చెన్నై సూపర్‌కింగ్స్‌: షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్‌, ఎం.ఎస్‌ ధోని (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రావో, శామ్‌ కరన్‌, షార్దుల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, పియూశ్‌ చావ్లా.

కోల్‌కత నైట్‌రైడర్స్‌: సునీల్‌ నరైన్‌, శుభ్‌మన్‌ గిల్‌, నితీశ్‌ రానా, దినేశ్‌ కార్తీక్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్), ఇయాన్‌ మోర్గాన్‌, అండ్రీ రసెల్‌, రాహుల్‌ త్రిపాఠి, పాట్‌ కమిన్స్‌, కమలేశ్‌ నాగర్‌కోటి, శివం మవి, వరుణ్‌ చక్రవర్తి.

click me!