మట్టి కోసం ఆస్ట్రేలియా వెళ్లడమెందుకు..? పాకిస్తాన్ లోనే తిరగమనండి : రమీజ్ రాజాకు చురకలంటించిన మాజీ సారథి

By Srinivas MFirst Published Jun 30, 2022, 1:24 PM IST
Highlights

Pakistan Cricket Board: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఇతర దేశాల బోర్డులు, క్రికెట్ పండితులు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో గానీ సొంతదేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. 

పాకిస్తాన్ బౌలర్లు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనలకు వెళ్తే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉండే పిచ్ లను తయారుచేయడం కోసం పీసీబీ తీసుకుంటున్న చర్యలు విమర్శలకు ఊతమిస్తున్నాయి. పాక్ బౌలర్లు అక్కడి పిచ్ ల మీద రాణించేందుకు వీలుగా  పాకిస్తాన్ లో ‘డ్రాప్ ఇన్ పిచ్’ లను ఏర్పాటు చేయాలని పీసీబీ గతంలో నిర్ణయించింది. ముల్తాన్ తో పాటు మరో గ్రౌండ్ లో ఈ పిచ్ ను ఏర్పాటు చేయనున్నారు. అయితే దీని కోసం ఆస్ట్రేలియా  గ్రౌండ్ లలో వాడే మట్టిని  పాకిస్తాన్ కు తీసుకురావాలని పీసీబీ నిర్ణయం తీసుకుంది. 

దీనిపై  పాకిస్తాన్ మాజీ సారథి సల్మాన్ భట్ తీవ్రంగా స్పందించాడు. మట్టి కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన అవసరం లేదని.. దేశంలో తిరిగితే అంతకంటే మంచి మట్టి దొరుకుతుందని రమీజ్ రాజాకు సూచించాడు. ఇస్లామాబాద్, క్వెట్టా పిచ్ లను పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుందని తెలిపాడు. 

ప్రస్తుతం సింగపూర్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా పనిచేస్తున్న సల్మాన్ భట్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ లో అన్ని రకాల పిచ్ లు అందుబాటులో ఉన్నాయి. మీరు బౌన్స్, పేస్ పిచ్ లు కావాలని చూస్తే  డైమండ్ (ఇస్లామాబాద్) లోని మట్టిని ఉపయోగించండి.. క్వెట్టా పిచ్ ను చూడండి. అక్కడ బౌన్స్ ఎక్కువ.   అక్కడ పేస్ ను కూడా రాబట్టొచ్చు. మట్టి కోసం ఆస్ట్రేలియా లో తిరిగేకంటే పాకిస్తాన్ లోనే అంతకంటే మంచి మట్టి దొరుకుతుంది. పీసీబీ చైర్మన్ ను ముందు మన దేశంలో ఉన్న పిచ్ లను పరిశీలించమనండి..’ అంటూ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఫైర్ అయ్యాడు. 

అంతేగాక.. ‘ఆయన (రమీజ్ రాజా) తప్పకుండా దేశీయ పిచ్ లను పరిశీలించాలి. క్వెట్టా పిచ్  డ్రై గా ఉంటుంది. అక్కడ బంతి సాధారణం కంటే వేగంగా  వస్తుంది. పీసీబీ అధికారులు, క్రికెట్ పండితులకు ఈ సమాచారం ఎందుకు తెలియదో నాకైతే అర్థం కావడం లేదు. ఒకవేళ వాళ్లకు తెలిసినా  విదేశాల మోజులో ఎందుకు పడుతున్నారు..?? కానీ ఆయన (పీసీబీ చైర్మన్) మొండిగా ఉంటే ఆస్ట్రేలియా నుంచే మట్టిని దిగుమతి చేసుకోమనండి..’ అని తెలిపాడు. 

ఈ ఏడాది ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది. అయితే రావల్పిండి, ముల్తాన్ లలో నిస్సార పిచ్ లను తయారుచేసి విమర్శలపాలైంది పాకిస్తాన్. రావల్పిండి పిచ్ ను పరిశీలించిన ఐసీసీ..  అది యావరేజీ పిచ్ కూడా కాదని.. అంతకు తక్కువే అని కామెంట్ చేసిన విషయం తెలిసిందే.  ఈ సిరీస్ ను పాకిస్తాన్ 0-1 తేడాతో ఓడింది. బ్యాటింగ్ కు అనుకూలించేలా తయారుచేసిన పిచ్ పై  ఇరు జట్ల బ్యాటర్లు పండగ చేసుకున్నారు. బౌలర్లకు  ఏమాత్రం సహకరించిన పిచ్ లు తయారు చేసినందుకు గాను పాకిస్తాన్ మాజీలు పీసీబీ పై దుమ్మెత్తిపోశారు. మన ఆటగాళ్ల మీద నమ్మకం లేకే ఇలా చేస్తున్నారా..? అని పీసీబీని ప్రశ్నించారు. 

click me!