INDvsZIM 1st ODI: పసలేదు! ఆడుతూ పాడుతూ కొట్టేసిన టీమిండియా... రాహుల్‌కి తొలి విజయం...

By Chinthakindhi RamuFirst Published Aug 18, 2022, 6:48 PM IST
Highlights

India vs Zimbabwe 1st ODI: 10 వికెట్ల తేడాతో జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం... 30.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఊదేసిన భారత జట్టు... 

పసికూన జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది టీమిండియా. జింబాబ్వే విధించిన 190 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా 30.5 ఓవర్లలోనే ఊదిపడేశారు ఓపెనర్లు...  శిఖర్ ధావన్ 113 బంతుల్లో 9 ఫోర్లతో 81 పరుగులు, శుబ్‌మన్ గిల్ 72 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 82 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కి 192 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. 

జింబాబ్వేపై టీమిండియాకి ఇది వరుసగా 13వ విజయం కాగా, కెప్టెన్‌గా కెఎల్ రాహుల్‌కి తొలి విజయం. ఇంతకుముందు సౌతాఫ్రికా టూర్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా చరిత్ర రికార్డు క్రియేట్ చేశాడు. ఎట్టకేలకు జింబాబ్వూ టూర్‌లో రాహుల్‌కి తొలి విజయం దక్కింది...

అంతకుముందు జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు కెప్టెన్ కెఎల్ రాహుల్, జింబాబ్వేకి బ్యాటింగ్ అప్పగించాడు... ఓపెనర్లు ఇద్దరూ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో 6.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది జింబాబ్వే. 20 బంతుల్లో 4 పరుగులు చేసిన ఇన్నోసెంట్ కియాని దీపక్ చాహార్ అవుట్ చేశాడు. చాహార్ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇన్నోసెంట్...

22 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన మరో ఓపెనర్ తడివనసె మరుమని కూడా దీపక్ చాహార్ బౌలింగ్‌లోనే సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు... ఫిబ్రవరి 2022లో గాయపడి, క్రికెట్‌కి దూరమైన దీపక్ చాహార్, అంతర్జాతీయ క్రికెట్‌కి అదిరిపోయే రేంజ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చాడు...

1 పరుగు చేసిన సీన్ విలియమ్స్‌ని మహ్మద్ సిరాజ్ అవుట్ చేయగా 12 బంతుల్లో 5 పరుగులు చేసిన విస్లే మదెవెరేని దీపక్ చాహార్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. 25/0 స్కోరుతో ఉన్న జింబాబ్వే, వరుస వికెట్లు కోల్పోయి 31/4 స్థితికి చేరుకుంది. 17 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసిన సికందర్ రజా, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

18 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసిన రియాన్ బర్ల్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 83 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది జింబాబ్వే. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో వైపు క్రీజులో కుదురుకుపోయిన జింబాబ్వే కెప్టెన్, వికెట్ కీపర్ రెగిస్ చకబవా 51 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చక్‌బవాని క్లీన్ బౌల్డ్ చేసిన అక్షర్ పటేల్, 23 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన లూక్ జాంగ్వేని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు...

110 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన జింబాబ్వేని బ్రాడ్ ఎవన్స్, రిచర్డ్ గరవా కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ 9వ వికెట్‌కి 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 42 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసిన గరవాని బౌల్డ్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ... టీమిండియాకి కావాల్సిన బ్రేక్ అందించాడు. ఆ తర్వాత విక్టర్ నయూచీ 8 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 189 పరుగుల వద్ద జింబాబ్వే ఇన్నింగ్స్‌కి తెరపడింది.

బ్రాడ్ ఎవన్స్ 29 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా భారత బౌలర్లలో దీపక్ చాహార్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్ మూడేసి వికెట్లు తీశారు. సిరాజ్‌కి ఓ వికెట్ దక్కింది. 

click me!