భయపెట్టిన లంక బౌలర్లు.. ఆదుకున్న రాహుల్, పాండ్యా.. రెండో వన్డేలో టీమిండియా విక్టరీ.. సిరీస్ కైవసం

By Srinivas MFirst Published Jan 12, 2023, 8:49 PM IST
Highlights

INDvsSL Live: తొలుత లంకను 215 పరుగులకే కట్టడి చేసిన భారత్.. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. తమ  బ్యాటర్లు విఫలమైన చోట లంక బౌలర్లు అదరగొట్టారు.  స్టార్లతో నిండి ఉన్న భారత బ్యాటింగ్ లైనప్ ను భయపెట్టారు. 

స్వదేశంలో శ్రీలంకతో ఇప్పటికే టీ20 సిరీస్ నెగ్గి ఊపుమీదున్న టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్ కూడా సొంతం చేసుకుంది. రెండ్రోజుల క్రితం గువహతిలో ముగిసిన  తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత జట్టు.. కోల్‌కతాలో కూడా జయకేతనం ఎగురవేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసిన రెండో వన్డేలో తొలుత లంకను 215 పరుగులకే కట్టడి చేసిన భారత్.. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. తమ  బ్యాటర్లు విఫలమైన చోట లంక బౌలర్లు అదరగొట్టారు.  స్టార్లతో నిండి ఉన్న భారత బ్యాటింగ్ లైనప్ ను భయపెట్టారు. 216 పరుగులు కొట్టేందుకు పడుతూ లేస్తూ  భారత్.. 43.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. 

లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఒకదశలో వరుసగా వికెట్లు కోల్పోయినా  కెఎల్ రాహుల్ (103 బంతుల్లో 64 నాటౌట్, 6 ఫోర్లు), హార్ధిక్ పాండ్యా (53 బంతుల్లో 36, 4 ఫోర్లు) టీమిండియాను ఆదుకున్నారు. ఈ విజయంతో టీమిండియా మూడు మ్యాచ్ ల సిరీస్ లో  2-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ లో చివరిదైన మూడో వన్డే ఈనెల 15న తిరువనంతపురంలో జరుగుతుంది. స్వదేశంలో శ్రీలంకపై భారత్ కు ఇది పదో సిరీస్ విజయం కావడం గమనార్హం. 

216 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు వచ్చిన భారత ఇన్నింగ్స్ దాటిగానే ఆరంభమైంది.  రోహిత్ శర్మ రెండో బంతికే  బౌండరీ కొట్టాడు. రెండో ఓవర్ వేసిన లాహిరు కుమార బౌలింగ్ లో కూడా శుభమన్ గిల్ కూడా బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదాడు.  రజిత వేసిన మూడో  ఓవర్లో  రోహిత్, గిల్ చెరో  ఫోర్ కొట్టారు. కుమార వేసిన భారత ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో సిక్సర్ బాదిన  రోహిత్.. చమీకర కరుణరత్నే వేసిన ఐదో ఓవర్ లో చివరి బంతికి  వికెట్ కీపర్  కుశాల్ మెండిస్ కు  క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  కుమార వేసిన ఆరో ఓవర్లో రెండు ఫోర్లు బాదిన గిల్.. మూడో బంతికి అవిష్క ఫెర్నాండోకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. 

వన్ డౌన్ లో వచ్చిన కోహ్లీ కూడా కుమార  వేసిన పదో ఓవర్   మూడో బంతికి క్లీన్  బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్.. 67 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కెఎల్ రాహుల్ తో కలిసి శ్రేయాస్ అయ్యర్ (33 బంతుల్లో 28, 5 ఫోర్లు) ఇండియా ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేశాడు. .   కరుణరత్నే వేసిన 11వ ఓవర్లో  శ్రేయాస్ బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు బాదాడు.  ఈ ఇద్దరూ  కలిసి నాలుగో వికెట్ కు 24 పరుగులు జోడించారు. కానీ 15వ ఓవర్లో రజిత.. శ్రేయాస్ ను ఎల్బీగా వెనక్కిపంపాడు.  దీంతో భారత్.. నాలుగో వికెట్ కోల్పోయింది. 

ఆదుకున్న రాహుల్ - హార్ధిక్..  

వరుసగా వికెట్లు పడుతున్న క్రమంలో భారత్ ఆత్మరక్షణలో పడింది.    ఛేదించాల్సిన లక్ష్యం మరీ పెద్దదిగా ఏం లేకపోవడంతో   క్రీజులో ఉన్న కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలు ఆచితూచి ఆడారు. డిఫెన్స్ కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చినా వికెట్లను కాపాడుకున్నారు. లంక బౌలర్లు పదే పదే కవ్వించే బంతులు వేసినా వాటిని పట్టించుకోలేదు. 20 ఓవర్లకు భారత స్కోరు 100 పరుగులు చేరింది. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరూ నెమ్మదిగానే ఆడారు. లంక కెప్టెన్ దసున్ శనక బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా  డిఫెన్స్ ను ఆశ్రయించారే తప్ప భారీ షాట్లకు పోలేదు.  అయితే గతి తప్పిన బంతులను మాత్రం బౌండరీకి తరలించడంలో ఇద్దరూ సక్సెస్ అయ్యారు. ధనంజయ డిసిల్వ వేసిన  30వ ఓవర్లో హార్ధిక్ బౌండరీ బాదడంతో ఇద్దరి భాగస్వామ్యం 50 పరుగులు చేరింది.  32వ  ఓవర్లో టీమిండియా స్కోరు 150 పరుగులకు చేరింది. 

అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో  హార్ధిక్ పాండ్యా.. కరుణరత్నె వేసిన ఇన్నింగ్స్ 35వ ఓవర్లో తొలి బంతిని  వికెట్ కీపర్ మెండిస్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 75 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.  హార్థిక్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అక్షర్ పటేల్ (21 బంతుల్లో 21, 2 ఫోర్లు 1 సిక్స్) ఉన్నంతసేపు చకాచకా పరుగులు సాధించాడు. కరుణరత్నే వేసిన 37వ  ఓవర్ లో అక్షర్ రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు.  కానీ భారత్ విజయానికి మరో 25 పరుగులు అవసరముండగా.. ధనంజయ డిసిల్వ బౌలింగ్ లో  భారీ షాట్ ఆడి  ఎక్స్‌ట్రా కవర్ వద్ద చమీకకు చిక్కాడు.  మరోవైపు రజిత బౌలింగ్ లో సింగిల్ తీసిన రాహుల్.. 93 బంతుల్లో అర్థ సెంచరీ  పూర్తి చేసుకున్నాడు.   అతడే వేసిన 43వ ఓవర్లో  మూడు ఫోర్లు బాది భారత్ ను విజయతీరాలకు చేర్చాడు.  కుల్దీప్ యాదవ్ (10 బంతుల్లో 10 నాటౌట్, 2 ఫోర్లు) అతడికి అండగా నిలిచాడు.

లంక బౌలర్లలో చమీక కరుణరత్నె, లాహిరు కుమారకు తలా రెండు వికెట్లు పడ్డాయి. కసున్ రజితకు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు  శ్రీలంక..  39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో అరంగేట్ర కుర్రాడు నువానిదు ఫెర్నాండో (50) రాణించాడు. కుశాల్ మెండిస్ (34), వెల్లలగె (32) రాణించారు.  భారత బౌలర్లలో కుల్దీప్, సిరాజ్ కు తలా మూడు వికెట్లు దక్కాయి. ఉమ్రాన్ రెండు వికెట్లు తీశాడు. 

click me!