వన్స్ ఐ స్టెప్ ఇన్.. హిస్టరీ రిపీట్స్.. సెంచరీ నెంబర్ 46.. ఎదురేలేని కోహ్లీ..

By Srinivas MFirst Published Jan 15, 2023, 4:48 PM IST
Highlights

INDvsSL: తిరువనంతపురం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో కూడా  కోహ్లీ రెచ్చిపోయాడు.   మూడేండ్లుగా  తాను మిస్ అయిన శతకాల కరువును మళ్లీ తీర్చుకుంటున్నాడు.   గడిచిన నాలుగు వన్డేలలో  కోహ్లీకి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. 

పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మళ్లీ సెంచరీల బాట పట్టాడు.  మూడేండ్లుగా  శతకాల కోసం మోము వాచిపోయిన అభిమానులకు గతేడాది ఆఫ్గానిస్తాన్ పై సెంచరీ బాది  స్వాంతననిచ్చిన  ఈ పరుగుల యంత్రం.. ఇప్పుడు మరో సెంచరీని తన ఖాతాలో వేసుకుంది.  ఆఫ్గానిస్తాన్ పై సెంచరీ తర్వాత   కోహ్లీ.. గతేడాది బంగ్లాదేశ్ తో జరిగిన  మూడో వన్డేలో కూడా  సెంచరీ బాది  వన్డేలలో కూడా చాలా రోజుల తర్వాత మూడంకెల స్కోరును ముద్దాడాడు.  ఆ తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో  సెంచరీ  చేశాడు. వన్డేలలో కోహ్లీకి ఇది 45వ సెంచరీ. మొత్తంగా  73వది.   

ఇక తిరువనంతపురం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో కూడా  కోహ్లీ రెచ్చిపోయాడు.   కెప్టెన్ రోహిత్ శర్మ నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఆది నుంచీ దూకుడుగానే ఆడాడు.  48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. తర్వాత యాభై పరుగులను  మరో 37  బంతుల్లోనే  పూర్తి చేశాడు.  గడిచిన నాలుగు వన్డేలలో  కోహ్లీకి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. 

వన్డేలలో  కోహ్లీకి ఇది  46వ సెంచరీ కావడం గమనార్హం.  మొత్తంగా చూసుకుంటే  74వ శతకం.   వన్డేలలో  విరాట్ కోహ్లీ.. సచిన్ శతకాల రికార్డుకు మరో మూడు  సెంచరీల దూరంలోనే ఉన్నాడు.  వన్డేలలో సచిన్ సెంచరీలు  49.   త్వరలో  న్యూజిలాండ్ తో మూడు వన్డేలతో పాటు ఆసీస్ తో కూడా  టెస్టుల తర్వాత  భారత్ మరో మూడు వన్డేలు ఆడాల్సి ఉంది.  దీంతో  సచిన్ రికార్డును బద్దలుకొట్టడానికి కోహ్లీ ఎంతో దూరంలో లేడు. 

ఇదిలాఉండగా ఈ మ్యాచ్ లో కోహ్లీ.. 64 పరుగల  వద్దకు చేరుకోగానే  అతడు అంతర్జాతీయ వన్డే లలో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో బ్యాటర్ గా నిలిచాడు.   శ్రీలంక క్రికెటర్ మహేళ జయవర్దెనే పేరిట ఉన్న రికార్డును తుడిపేశాడు. 

 

𝐂𝐄𝐍𝐓𝐔𝐑𝐘 𝐟𝐨𝐫 𝐕𝐢𝐫𝐚𝐭 𝐊𝐨𝐡𝐥𝐢 🔥🔥

His 46th in ODIs and 74th overall 🫡🫡 pic.twitter.com/ypFI9fdJ2I

— BCCI (@BCCI)

ఈ మ్యాచ్ కు ముందు   కోహ్లీ.. వన్డేలలో అత్యధిక పరుగులు చేసినవారిలో   ఆరో స్థానంలో నిలిచాడు.  తన కెరీర్ లో 267 మ్యాచ్ లు ఆడి  258 ఇన్నింగ్స్ లలో 12,588 పరుగులు సాధించాడు.   ఈ క్రమంలో అతడి సగటు  57.47గా ఉంది.  కోహ్లీ కంటే ముందు మహేళ జయవర్దెనే.. 448 వన్డేలు ఆడి  418 ఇన్నింగ్స్ లలో 12,650 పరుగులు సాధించాడు.    ఇప్పుడు ఈ రికార్డును  కోహ్లీ బ్రేక్ చేశాడు.  శ్రీలంకతో   ప్రస్తుతం తిరువనంతపురం వేదికగా జరుగుతున్న  మూడో వన్డేలో భాగంగా కరుణరత్నే వేసిన  34వ ఓవర్ తొలి బంతికి బౌండరీ బాదడం ద్వారా అతడి స్కోరు 65 పరుగులకు చేరింది.  తద్వారా   కోహ్లీ.. జయవర్దెనేను దాటేశాడు.   

click me!