గిల్ హల్చల్.. కోహ్లీ కమాల్.. మూడో వన్డేలో టీమిండియా భారీ స్కోరు..

By Srinivas MFirst Published Jan 15, 2023, 5:28 PM IST
Highlights

INDvsSL Live: తిరువనంతపురంలో టీమిండియా బ్యాటర్లు  దుమ్మురేపారు. గువహతి వన్డే మాదిరిగానే టాప్-3  ఆటగాళ్లు  రెచ్చిపోయి ఆడారు. శుభమన్ గిల్, విరాట్ కోహ్లీలు సెంచరీలతో కదం తొక్కారు. ఫలితంగా చివరి వన్డేలో భారత్ భారీ స్కోరు చేసింది. 

భారత్ - శ్రీలంక మధ్య తిరువనంతపురం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో  తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా రెచ్చిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (49 బంతుల్లో 42,  2 ఫోర్లు, 3 సిక్సర్లు)  ఫర్వాలేదనిపించగా మరో ఓపెనర్  శుభమన్ గిల్  (97 బంతుల్లో 116, 14 ఫోర్లు, 2 సిక్సర్లు) శుభారంభం ఇవ్వగా  వన్ డౌన్ లో వచ్చిన  పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ (110 బంతుల్లో 166 నాటౌట్, 13 ఫోర్లు, 8 సిక్సర్లు) లంక బౌలింగ్  ను రఫ్ఫాడించాడు.  మధ్యలో శ్రేయాస్ అయ్యర్ (32 బంతుల్లో 38, 2 ఫోర్లు 1 సిక్సర్) కోహ్లీకి అండగా నిలిచాడు. ఫలితంగా  భారత్.. నిర్ణీత  50 ఓవర్లలో  5 వికెట్ల నష్టానికి 390 పరుగుల భారీ స్కోరు చేసింది.  ఇప్పటికే సిరీస్ కోల్పోయిన లంక ఈ మ్యాచ్ లో టీమిండియా నిర్దేశించిన టార్గెట్ ను ఛేదిస్తుందా..? 

టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన భారత్  ఇన్నింగ్స్ లో  తొలి ఓవర్ మెయిడిన్ అయింది.  కసున్ రజిత వేసిన  ఓవర్లో రోహిత్ ఒక్క పరుగు కూడా చేయలేదు.   అతడే వేసిన మూడో ఓవర్లో కూడా ఒక్క పరుగే వచ్చింది. ఐదో ఓవర్లో శుభమన్ గిల్.. రెండు ఫోర్లు బాదాడు. లాహిరు కుమర వేసిన  ఆరో ఓవర్లో  రోహిత్ తొలి బంతికి సిక్సర్ బాది తర్వాత బంతికి సింగిల్ తీసి ఇవ్వగా గిల్.. నాలుగు వరుస ఫోర్లు కొట్టాడు.   ఆ ఓవర్లో ఏకంగా 23 పరుగులొచ్చాయి. రజిత వేసిన  తొలి ఓవర్  లో ఇబ్బందిపడ్డ  రోహిత్.. తర్వాత  అతడే వేసిన పదో ఓవర్లో  రెండు బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టాడు.  10 ఓవర్లు ముగిసేనాటికి భారత్ స్కోరు  వికెట్ నష్టపోకుండా 75 పరుగులు.  

గిల్ దూకుడు.. 

కరుణరత్నే వేసిన 15వ ఓవర్లో   రోహిత్ భారీ షాట్ కు  యత్నించి..  అవిష్క ఫెర్నాండో కు  క్యాచ్ ఇచ్చాడు. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత  క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. కూడా దూకుడుగానే ఆడుతున్నాడు.   వెండర్సే వేసిన 17వ ఓవర్లో కోహ్లీ రెండు ఫోర్లు బాదాడు.  అతడే వేసిన  19వ ఓవర్లో  చివరి బంతికి సింగిల్ తీయడం ద్వారా గిల్..  52 బంతులలో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  

హాఫ్ సెంచరీ  తర్వాత గిల్ దూకుడు పెంచాడు.  కోహ్లతో వికెట్ల మధ్య పరిగెడుతూనే   ఫెర్నాండో వేసిన  29వ ఓవర్లో ఓ ఫోర్, సిక్సర్ బాది 90లలోకి వచ్చాడు.  ఇక ఫెర్నాండోనే వేసిన 31వ ఓవర్లో చివరి బంతికి సింగిల్ తీసి తన  కెరీర్ లో రెండో  వన్డే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  89 బంతుల్లోనే అతడి సెంచరీ  పూర్తయింది. స్వదేశంలో  గిల్ కు ఇదే తొలి సెంచరీ.  అయితే సెంచరీ పూర్తయ్యాక  గిల్..  రజిత వేసిన  34 వ ఓవర్ నాలుగో బంతికి బౌల్డ్ అయ్యాడు. 

కోహ్లీ షో.. 

గిల్ నిష్రమించిన తర్వాత  భారత స్కోరుబోర్డును కోహ్లీ పరుగులు పెట్టించాడు.  నాలుగో స్థఆనంలో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ తో కలిసి   ఫోర్లు, సిక్సర్లు బాదాడు.  48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న కోహ్లీ..  హసరంగ వేసిన  40వ ఓవర్ లో ఫోర్ కొట్టి 80లలోకి వచ్చాడు. ఇక లాహిరు కుమార వేసిన  తర్వాత ఓవర్లో సిక్సర్ కొట్టి   90లలోకి చేరాడు. కరుణరత్నే వేసిన   43వ ఓవర్  లో ఐదో బంతికి ఫోర్, ఆ తర్వాత బాల్ కు సింగిల్ తీసిన కోహ్లీ  ఈ సిరీస్ లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  87 బంతుల్లోనే కోహ్లీ సెంచరీ పూర్తయింది. కోహ్లీ సెంచరీతో పాటు భారత్ స్కోరు కూడా  300 చేరింది.  వన్డేలలో  కోహ్లీకి ఇది 46వ సెంచరీ కాగా  మొత్తంగా 74వది కావడం గమనార్హం. 

సెంచరీ తర్వాత  కోహ్లీ మరింతగా రెచ్చిపోయాడు.  కరుణరత్నే వేసిన  45వ ఓవర్  లో రెండు భారీ సిక్సర్లు, ఓ ఫోర్ బాది స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు.  శ్రేయాస్ అయ్యర్ (32 బంతుల్లో 38, 2 ఫోర్లు, 1 సిక్స్)  దూకుడుగానే ఆడినా  లాహిరు కుమార వేసిన   46వ ఓవర్  మూడో బంతికి   ధనంజయ డిసిల్వకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

చివర్లో.. 

అయ్యర్ నిష్క్రమించినా కోహ్లీ వెనక్కి తగ్గలేదు.  రజిత వేసిన 47వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదాడు.  కెఎల్ రాహుల్ (7) కూడా ఓ ఫోర్  కొట్టాడు. దీంతో భారత్ 350 మార్క్ దాటింది.  అయితే  ధాటిగా ఆడే క్రమంలో  రాహుల్.. కుమార వేసిన 48వ ఓవర్ ఐదో బంతికి పెవిలియన్ చేరాడు. సూర్యకుమార్ యాదవ్ (4) కూడా అలాగే ఔటయ్యాడు.  చివరి ఓవర్లో  తొలి బంతికి సిక్సర్ బాదడం ద్వారా కోహ్లీ 150 పూర్తైంది.  చివరి రెండు బంతుల్లో సిక్సర్, ఫోర్ బాది భారత్ ను తిరుగులేని స్థితికి చేర్చాడు. 

లంక బౌలర్లలో కసున్ రజిత, లాహిరు కుమారకు తలా రెండు వికెట్లు దక్కగా కరుణరత్నేకు ఒక వికెట్ దక్కింది.  

click me!