INDvsSL 2nd T20I: టాస్ గెలిచిన టీమిండియా... రాహుల్ త్రిపాఠికి అవకాశం...

By Chinthakindhi RamuFirst Published Jan 5, 2023, 6:34 PM IST
Highlights

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా... సంజూ శాంసన్ స్థానంలో రాహుల్ త్రిపాఠికి అవకాశం..

శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేయనుంది. నేటి మ్యాచ్ ద్వారా రాహుల్ త్రిపాఠి అంతర్జాతీయ ఆరంగ్రేటం చేస్తున్నాడు. మొదటి టీ20లో 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకున్న భారత జట్టు, టీ20 సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. అయితే మొదటి మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది...
 
భారీ అంచనాలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ 7, శుబ్‌మన్ గిల్ 7, సంజూ శాంసన్ 5 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఇషాన్ కిషన్ 37, హార్ధిక్ పాండ్యా 29 పరుగులు చేసి పర్వాలేదనిపించినా భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు...

సంజూ శాంసన్ గాయం కారణంగా టీ20 సిరీస్ నుంచి దూరం కావడంతో రాహుల్ త్రిపాఠికి అవకాశం దక్కింది. దాదాపు ఆరు నెలలుగా టీమిండియాకి ఎంపికవుతున్నా, తుదిజట్టులో స్థానం కోసం ఎదురుచూస్తూ వచ్చిన రాహుల్ త్రిపాఠి, నేటి మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేస్తున్నాడు...

31 ఏళ్ల రాహుల్ త్రిపాఠి, ఐపీఎల్‌లో 1798 పరుగులు చేశాడు. 2017 సీజన్‌లో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ తరుపున ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన రాహుల్ త్రిపాఠి, 2020-21 సీజన్లలో కేకేఆర్ తరుపున ఆడాడు. 2022 సీజన్‌లో రాహుల్ త్రిపాఠిని రూ.8 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన రాహుల్ త్రిపాఠి, 413 పరుగులు చేశాడు. ఐపీఎల్ తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లాండ్,జింబాబ్వే, హాంగ్‌కాంగ్ సిరీస్‌లకు ఎంపికైనా రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు రాహుల్ త్రిపాఠి. గత మ్యాచ్‌లో శివమ్ మావి అంతర్జాతీయ ఆరంగ్రేటం చేయగా శుబ్‌మన్ గిల్, టీ20ల్లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. నేటి మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి, టీమిండియా తరుపున టీ20ల్లో ఎంట్రీ ఇచ్చిన 101వ ప్లేయర్‌గా నిలిచాడు...

గత మ్యాచ్‌లో 41 పరుగులు ఇచ్చిన హర్షల్ పటేల్‌ని తప్పించిన టీమిండియా, అతని స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ని తుది జట్టులోకి తీసుకొచ్చింది. జ్వరంతో బాధపడుతూ ఉండడంతో తొలి టీ20కి దూరమైన అర్ష్‌దీప్ సింగ్, తిరిగి జట్టులోకి వచ్చాడు. 

శ్రీలంక జట్టు: పథుమ్ నిశ్శంక, కుశాల్ మెండీస్, ధనంజయ డి సిల్వ, చరిత్ అసలంక, భనుక రాజపక్ష, ధసున్ శనక, వానిందు హసరంగ, ఛమిక కరుణరత్నే, మహీస్ తీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మధుశనక

భారత జట్టు: ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహాల్ 

click me!