ప్రపంచంలో మొట్టమొదటి మహిళా క్రికెటర్ విగ్రహం.. ఆసీస్ మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్‌కి అరుదైన గౌరవం...

By Chinthakindhi RamuFirst Published Jan 5, 2023, 6:22 PM IST
Highlights

సిడ్నీ క్రికెట్‌ మైదానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్ విగ్రహావిష్కరణ... ప్రపంచంలో మొట్టమొదటి మహిళా క్రికెటర్ విగ్రహంగా గుర్తింపు.. 

ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన ఆటల్లో క్రికెట్ కూడా ఒకటి. భారత్‌లాంటి దేశాల్లో అయితే క్రికెటర్లను దేవుళ్లుగా ఆరాధిస్తారు అభిమానులు. అందుకే క్రికెటర్లకు విగ్రహాలు ఉండడం చాలా కామన్. అయితే శతాబ్దాల చరిత్ర ఉన్న క్రికెట్‌ ఫీల్డ్‌లో ఒక్క మహిళా క్రికెటర్‌కి కూడా విగ్రహం పెట్టిన దాఖలాలు లేవు...

మహిళా క్రికెట్‌ని చూసేవాళ్లే లేనప్పుడు, మహిళా క్రికెటర్లకు విగ్రహాలు పెట్టేవాళ్లెవ్వరు. అయితే ఇప్పుడు సీన్ మారింది. మహిళా క్రికెట్‌కి కూడా మహర్ధశ వచ్చింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్ విగ్రహాన్ని ప్రతిష్టించింది క్రికెట్ ఆస్ట్రేలియా...

కెప్టెన్‌గా ఆస్ట్రేలియాకి రెండు వరల్డ్ కప్ టైటిల్స్ అందించిన బెలిండా క్లార్క్ విగ్రహాన్ని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో గురువారం ఆవిష్కరించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటించిన సౌతాఫ్రికా జట్టు, సిడ్నీలో మూడో టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ సమయంలోనే ఆసీస్ మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్ విగ్రహాన్ని పెట్టడం విశేషం...

ఆస్ట్రేలియా తరుపున 15 టెస్టులు ఆడిన బెలిండా క్లార్క్, 100 వన్డేలు ఆడింది. వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన మొట్టమొదటి క్రికెటర్‌గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది బెలిండా. 1997లో డెన్మార్క్‌తో జరిగిన మ్యాచులో డబుల్ సెంచరీ బాదిన బెలిండా క్లార్క్, 229 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.  ఆమె సేవలకు గుర్తింపుగా సిడ్నీ మైదానంలో కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించింది క్రికెట్ ఆస్ట్రేలియా...

The world’s first sculpture of a female cricketer.

Belinda Clark 👏 pic.twitter.com/35BMWLEh9z

— Sydney Cricket Ground (@scg)

‘ఈ విగ్రహాన్ని చూసే క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతారని తెలుసు. ఈమె ఎవరు? ఈమె ఏం చేసిందని తెలుసుకోవడానికి కాస్త సమయం కేటాయిస్తారు. ఈ విగ్రహాం జీవితంలో ఏదైనా సాధించాలని అనుకునే ప్రతీ మహిళకు అంకితం. వారికి కావాల్సిన ధైర్యాన్ని, పట్టుదలను నింపుతుందని అనుకుంటున్నా. 

సాహసం చేసి ముందుకు వస్తే ఏదైనా సాధించగలరు. మీ లక్ష్యంపైన మీ మెదడును పెట్టండి, ఏం చేయాలో అదే చెబుతుంది. మీ చుట్టూ మంచి వాళ్లే ఉన్నారు, వాళ్లను చూడాలంటే ధైర్యం చేయాలి...’ అంటూ విగ్రహావిష్కరణ సభలో చెప్పుకొచ్చింది బెలిండా క్లార్క్...

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఓ మహిళా విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే ఎవరి విగ్రహాన్ని పెడుతున్నారనే విషయంపై సస్పెన్స్ కొనసాగింది. 

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సౌతాఫ్రికా క్రికెటర్ సున్నీ లూజ్‌తో పాటు భారత మాజీ క్రికెటర్లు మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ సారా టేలర్ కూడా పేరు కూడా వినిపించింది. అయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్, విగ్రహానికి ఎక్కిన మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గా నిలిచింది..

click me!