
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆటలో కూడా భారత జట్టు పూర్తి ఆధిక్యం చూపించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది శ్రీలంక. ఇంకా భారత జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరుకి 466 పరుగుల దూరంలో ఉంది లంక...
బౌండరీతో లంక ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఓపెనర్లు లహిరు తిరుమన్నే, దిముత్ కరుణరత్నే తొలి వికెట్‌కి 48 పరుగుల భాగస్వామ్యం అందించారు. 60 బంతుల్లో ఓ ఫోర్‌తో 17 పరుగులు చేసిన లహిరు తిరుమన్నే, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...
71 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసిన కరుణరత్నే, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 39 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన ఏంజెలో మాథ్యూస్, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు...
బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన మాథ్యూస్, ఆ బంతి నో బాల్‌గా తేలడంతో బతికిపోయాడు. అయితే ఆ తర్వాతి బంతికే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు... 8 బంతుల్లో 1 పరుగు చేసిన ధనంజయ డి సిల్వను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన రవిచంద్రన్ అశ్విన్, టెస్టుల్లో 432 టెస్టు వికెట్లతో రిచర్డ్ హార్డ్‌లీ 431 వికెట్ల రికార్డును అధిగమించాడు...
పథుమ్ నిశ్శంక 75 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులతో, చరిత్ అసలంక 12 బంతుల్లో ఒక్క పరుగు చేసి క్రీజులో ఉన్నారు. లంక ఇన్నింగ్స్‌లో ఇప్పటిదాకా కోల్పోయిన వికెట్లన్నీ కూడా ఎల్బీడబ్ల్యూ రూపంలోనే రావడం విశేషం.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 129.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 574 పరుగుల భారీ స్కోరు చేసి డిక్లేర్ చేసింది. రవీంద్ర జడేజా 228 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్లతో 175 పరుగులు చేసి అజేయంగా నిలవగా కెప్టెన్ రోహిత్ శర్మ 28 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు, మయాంక్ అగర్వాల్ 49 బంతుల్లో 5 ఫోర్లతో 33 పరుగులు చేశారు.
వందో టెస్టు ఆడుతున్న మాజీ సారథి విరాట్ కోహ్లీ 76 బంతుల్లో 5 ఫోర్లతో 45 పరుగులు చేయగా, హనుమ విహారి 128 బంతుల్లో 5 ఫోర్లతో 58 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు... వికెట్ కీపర్ రిషబ్ పంత్ 97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 96 పరుగులు చేసి అవుట్ కాగా శ్రేయాస్ అయ్యర్ 48 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రవిచంద్రన్ అశ్విన్ 82 బంతుల్లో 8 ఫోర్లతో 61 పరుగులు చేయగా, జయంత్ యాదవ్ 18 బంతుల్లో 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏడు, అంతకంటే కింద బ్యాటింగ్‌కి వచ్చి అత్యధిక స్కోరు నమోదు చేసిన భారత బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు రవీంద్ర జడేజా. ఇంతకుముందు 1986లో శ్రీలంకపై కపిల్‌దేవ్ 163 పరుగులు చేయగా, జడ్డూ ఆ రికార్డును అధిగమించాడు.