INDvsSA 3rd Test: టాస్ గెలిచిన టీమిండియా... మరోసారి హనుమ విహారికి...

By Chinthakindhi RamuFirst Published Jan 11, 2022, 1:38 PM IST
Highlights

INDvsSA 3rd Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లీ... హనుమ విహారి స్థానంలో జట్టులోకి విరాట్...

కేప్‌ టౌన్ వేదికగా జరుగుతున్న ఇండియా, సౌతాఫ్రికా మూడో టెస్టులో టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత సారథి విరాట్ కోహ్లీకి వరుసగా ఇది ఐదో టాస్ విజయం కాగా భారత జట్టుకి ఓవరాల్‌గా వరుసగా 8వ టాస్ విజయం. భారత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ నియామకం అయిన తర్వాత ఒక్క మ్యాచ్‌లో కూడా టాస్ ఓడిపోలేదు టీమిండియా... 
 
మొదటి రెండు టెస్టుల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో మూడో టెస్టు సిరీస్ ఫలితాన్ని నిర్ణయించనుంది. గాయం కారణంగా గత మ్యాచ్‌లో బరిలో దిగిన భారత టెస్టు సారథి విరాట్ కోహ్లీ తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు. రెండో టెస్టు మ్యాచ్‌కి దూరం కావడంతో కేప్ టౌన్ టెస్టు విరాట్ కోహ్లీకి 99వ టెస్టు కానుంది.  

విరాట్ కోహ్లీ స్థానంలో రెండో టెస్టు ఆడిన తెలుగు క్రికెటర్ హనుమ విహారి, మూడో టెస్టుకి దూరమయ్యాడు. అజింకా రహానే, చతేశ్వర్ పూజారాలకు మరో అవకాశం ఇచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్, హనుమ విహారి స్థానంలో విరాట్ కోహ్లీని జట్టులోకి తీసుకొచ్చింది...

గాయపడిన మహ్మద్ సిరాజ్ స్థానంలో ఉమేశ్ యాదవ్‌ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. సిడ్నీ టెస్టు తర్వాత ఏడాదికి తుదిజట్టులోకి వచ్చిన హనుమ విహారి, గత మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో చక్కని పర్ఫామెన్స్ ఇచ్చినా... అతనికి మరో అవకాశం దక్కకపోవడం విశేషం.

జోహన్‌బర్గ్‌లో తొలిసారి టీమిండియాని ఓడించి, టెస్టు సిరీస్‌ను సమం చేసిన సౌతాఫ్రికా జట్టు, మూడో టెస్టులో మార్పులు లేకుండా బరిలో దిగుతోంది. 

కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియంలో టీమిండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య ఇప్పటిదాకా ఐదు టెస్టు మ్యాచులు జరిగాయి. సౌతాఫ్రికా  మూడు మ్యాచుల్లో గెలవగా, రెండు మ్యాచులు డ్రాగా ముగిశాయి. 2018-19 పర్యటనలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇక్కడ ఆడిన మొదటి టెస్టులో భారత జట్టు 72 పరుగుల తేడాతో ఓడింది... 

ఏబీ డివిల్లియర్స్ 65, డుప్లిసిస్ 62, క్వింటన్ డి కాక్ 43 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకి ఆలౌట్ అయ్యింది సౌతాఫ్రికా. భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 209 పరుగులకే ఆలౌట్ అయ్యింది. హార్ధిక్ పాండ్యా 95 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 93 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు...

రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 130 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బుమ్రా, షమీ మూడేసి వికెట్లు తీశారు. అయితే 207 టార్గెట్‌తో బరిలో దిగిన భారత జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రవిచంద్రన్ అశ్విన్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

సౌతాఫ్రికా జట్టు: డీన్ ఎల్గర్ (కెప్టెన్), అయిడిన్ మార్క్‌రమ్, కీగన్ పీటర్సన్, రస్సీ వాన్ దేర్ దుస్సేన్, తెంబ భవుమా, కేల్ వెరెన్నే, మార్కో జాన్సెన్, కగిసో రబాడా, కేశవ్ మహరాజ్, డువానే ఓలీవర్, లుంగి ఎంగిడి 

భారత జట్టు: కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

click me!