INDvsSA 1st ODI: వర్షం కారణంగా టాస్ ఆలస్యం... ఆ ముగ్గురిపైనే ఫోకస్

By Chinthakindhi RamuFirst Published Oct 6, 2022, 1:10 PM IST
Highlights

వర్షం కారణంగా అరగంట ఆలస్యంగా టాస్, మ్యాచ్ ప్రారంభం.... వన్డే సిరీస్ టీమ్‌లో ముగ్గురు టీ20 వరల్డ్ కప్ ప్లేయర్లు... 

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో ముగించిన భారత జట్టు, నేటి నుంచి వన్డే సిరీస్ ఆడుతోంది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు టీమిండియా ఆడుతున్న ఆఖరి సిరీస్ ఇదే. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ కోసం భారత ప్రధాన జట్టు ఆస్ట్రేలియా చేరడంతో మిగిలిన ప్లేయర్లతో వన్డే సిరీస్ ఆడుతోంది భారత జట్టు...

లక్నోలో జరుగుతున్న మొదటి వన్డే వర్షం కారణంగా అరగంట ఆలస్యం కానుంది. పిచ్ చిత్తడిగా ఉండడంతో ఒంటి గంటకు వేయాల్సిన టాస్‌ను 1:30కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు. 2 గంటలకు ఆట ప్రారంభం అవుతుందని భావించారు. అయితే కొద్దిసేపటి తర్వాత తిరిగి వర్షం కురవడంతో మ్యాచ్ మరింత ఆలస్యం కానుంది. లక్నోలో నేడు భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఈరోజు మ్యాచ్ సజావుగా సాగుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 

మ్యాచ్ ప్రారంభమైనా పలుమార్లు అంతరాయం కలిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ విశ్లేషకులు. 2022 పొట్టి ప్రపంచ కప్‌కి రిజర్వు ప్లేయర్లుగా ఎంపికైన శ్రేయాస్ అయ్యర్, దీపక్ చాహార్, రవి భిష్ణోయ్...ఈ  వన్డే సిరీస్‌లో పాల్గొంటున్నారు. అలాగే గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమైన స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాకి సరైన రిప్లేస్‌మెంట్ అవుతాడని అనుకుంటున్న మహ్మద్ సిరాజ్... ఈ వన్డే సిరీస్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాడు...

ఈ ఏడాది ఆరంభంలో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో సౌతాఫ్రికా టూర్‌లో వన్డే సిరీస్ ఆడిన భారత జట్టు వన్డే సిరీస్‌ని 3-0 తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో ఆ పరాజయానికి శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత జట్టు ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందనేది ఆసక్తి కరంగా మారింది...

మరోవైపు సౌతాఫ్రికా మాత్రం టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడే ప్రధాన టీమ్‌తోనే వన్డే సిరీస్ ఆడుతోంది. క్వింటర్ డి కాక్, డేవిడ్ మిల్లర్, జన్నేమన్ మలాన్, అయిడిన్ మార్క్‌రమ్‌తో పాటు టీ20 సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన సౌతాఫ్రికా కెప్టెన్ తెంబ భవుమా ఈ వన్డే సిరీస్‌లో ఎలా ఆడతాడని ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు సఫారీ క్రికెట్ ఫ్యాన్స్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో అదరగొట్టిన రజత్ పటిదార్, రాహుల్ త్రిపాఠిలకు ఈ వన్డే సిరీస్‌ల ో చోటు కల్పించారు సెలక్టర్లు. రాహుల్ త్రిపాఠికి ఇప్పటికే రెండు సిరీస్‌లకు సెలక్ట్ అయినా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కాబట్టి ఈసారైనా రాహుల్ త్రిపాఠికి ఈసారైనా చోటు దక్కుతుందా? లేదా అనేది చూడాలి. 

ఆసియా కప్ 2022 టోర్నీల్లో టీమిండియా తరుపున ఆడిన ఆవేశ్ ఖాన్, ఆ తర్వాత కనిపించలేదు. వన్డే సిరీస్‌కి ఎంపికైన ఆవేశ్ ఖాన్, ఈసారైనా క్రికెట్ ఫ్యాన్స్‌ని ఇంప్రెస్ చేస్తాడా? లేదా? అనేది చూడాలి...

click me!