బర్మింగ్‌హామ్‌లో సక్సెస్‌ఫుల్.. విక్టోరియాలోనూ కొనసాగింపు.. వచ్చే కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా క్రికెట్

By Srinivas MFirst Published Oct 5, 2022, 3:04 PM IST
Highlights

Commonwealth Games 2026: బర్మింగ్‌హామ్ లో నిర్వహించిన  క్రికెట్ పోటీలు విజయవంతమయ్యాయి. మిగతా క్రీడల మాదిరే  ప్రేక్షకులకు క్రికెట్ కూడా ఉత్సాహాన్ని నింపింది. దీంతో ఈ క్రీడా ఈవెంట్ ను  విక్టోరియాలో కూడా కొనసాగించనున్నారు.    

ఈ ఏడాది ఆగస్టులో బర్మింగ్‌హామ్ (ఇంగ్లాండ్) వేదికగా ముగిసిన  కామన్వెల్త్ క్రీడలలో మహిళల క్రికెట్ ను  తొలిసారిగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక్కడ విజయవంతం కావడంతో  వచ్చే క్రీడలలో కూడా దానిని కొనసాగించాలని ‘ది కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ అండ్ కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియా’ తెలిపింది.  1998లో మలేషియాలో నిర్వహించిన పురుషుల క్రికెట్ ను  50 ఓవర్ల ఫార్మాట్ లో ఆడించగా.. బర్మింగ్‌హామ్ లో మాత్రం టీ20 ఫార్మాట్ లో ఆడించారు. అయితే బర్మింగ్‌హామ్ లో నిర్వహించిన  క్రికెట్ పోటీలు విజయవంతమయ్యాయి. మిగతా క్రీడల మాదిరే  ప్రేక్షకులను క్రికెట్ కూడా ఆసక్తి రేకెత్తించింది.   పురుషుల  క్రికెట్ మాదిరిగానే  ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్ లను వీక్షించడానికి  ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం  నిండిపోయింది. 

2022లో కామన్వెల్త్ క్రీడలు ముగిసిన నేపథ్యంలో తర్వాత దఫా ఈ క్రీడలను ఆస్ట్రేలియాలోని విక్టోరియా పట్టణంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే  ఈ పనులను  ప్రారంభించింది. ఇందులో భాగంగా క్రికెట్ ఆటను కొనసాగించాలని  తీర్మానించినట్టు తెలుస్తున్నది. 

క్రికెట్  ను కొనసాగించడంతో పాటు గోల్ఫ్,  బీఎంఎక్స్ (సైకిల్ రేస్ ఈవెంట్), కోస్టల్ రోయింగ్ ను కొత్తగా  చేర్చనున్నారు. ఇదే విషయమై ఐసీసీ జనరల్ మేనేజర్  వసీమ్ ఖాన్ మాట్లాడుతూ... ‘విక్టోరియా కామన్వెల్త్ క్రీడలలో కూడా క్రికెట్ భాగస్వామి  కావడం  మాకు సంతోషకరమైన విషయం. బర్మింగ్‌హామ్ తో పాటు క్రికెట్ లో  విక్టోరియా  కూడా ప్రతిష్టాత్మకంగా మారనుంది. మహిళల క్రికెట్ తో పాటు టీ20 క్రికెట్ కు క్రేజ్ పెరగడం మా భవిష్యత్తు లక్ష్యాలను (ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చడం) సాధిస్తుందని అంచనా వేస్తున్నాం..’ అని తెలిపాడు. 

ఇక ఇటీవలే ముగిసిన బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో  ఇండియా-ఆస్ట్రేలియా మహిళల జట్లు ఫైనల్ కు చేరాయి.  ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అనంతరం భారత్.. 152 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా  ఆసీస్.. 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒక దశలో భారత్ విజయానికి దగ్గరగా వచ్చినా చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి  ఓటమిపాలైంది. దీంతో ఆసీస్ స్వర్ణం సాధించగా భారత్ రజతంతో సరిపెట్టుకుంది. 

విక్టోరియా లో కామన్వెల్త్ గేమ్స్ 2026 మార్చి 17 నుంచి  29 వరకు జరిగేందుకు షెడ్యూల్ ఖరారైంది. 

click me!