INDvsNZ: డెత్ ఓవర్లలో సిరాజ్, అర్ష్‌దీప్ మాయ.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్

By Srinivas MFirst Published Nov 22, 2022, 2:28 PM IST
Highlights

INDvsNZ T20I: 16వ ఓవర్లో 146-3గా ఉన్న న్యూజిలాండ్ స్కోరు రెండు ఓవర్ల వ్యవధిలో  149-9గా మారింది.  డెత్ ఓవర్లలో భారత బౌలర్లు కివీస బ్యాటర్ల పనిపట్టారు. సిరాజ్, అర్ష్‌దీప్ లు న్యూజిలాండ్ ను కోలుకోలేని దెబ్బతీశారు. 

ఇండియా - న్యూజిలాండ్ మధ్య నేపియర్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక ఆఖరి టీ20లో భారత బౌలర్లు  మిడిల్ ఓవర్స్ లో విఫలమైనా తర్వాత పుంజుకుని కివీస్ పనిపట్టారు. డెత్ ఓవర్లలో కివీస్ ను కోలుకోలేని దెబ్బకొట్టి ఆ జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుకట్ట వేశారు. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే (49 బంతుల్లో 59,  5 ఫోర్లు,  2 సిక్సర్లు),  మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్  (33 బంతుల్లో 54, 5 ఫోర్లు, 3 సిక్సర్లు)  రాణించడంతో టీమిండియా ముందు ఆ జట్టు 161  పరుగుల లక్ష్యాన్ని నిలపింది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన న్యూజిలాండ్ కు మరోసారి శుభారంభం దక్కలేదు.  రెండో టీ20లో విఫలమైన ఓపెనర్ ఫిన్ అలెన్ (3) ఈసారి కూడా  నిరాశపరిచాడు. అర్ష్‌దీప్ వేసిన తొలి ఓవర్లోనే అతడు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.  వన్ డౌన్ లో వచ్చిన చాప్మన్ (12) కూడా  ఆకట్టుకోలేదు. 

కానీ గ్లెన్ ఫిలిప్స్ తో జతకలిసిన కాన్వే  రెచ్చిపోయాడు. ఇద్దరూ కలిసి ఫోర్లు, సిక్సర్లతో  భారత బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కున్నారు.  రెండో టీ20 లో రాణించిన స్పిన్నర్ చాహల్ ఈ మ్యాచ్ లో భారీగా పరుగులిచ్చుకున్నాడు. హర్షల్ పటేల్ కూడా  పెద్దగా ప్రభావం చూపలేదు. 

అర్ష్‌దీప్ వేసిన  నాలుగో ఓవర్లో 4,6,4 బాదిన కాన్వే.. పవర్ ప్లే తర్వాత  కాస్త నెమ్మదించాడు. కానీ అవతలి ఎండ్ లో ఫిలిప్స్ రెచ్చిపోయాడు. భువీ వేసిన  14వ ఓవర్ తొలి బంతికి  మూడు పరుగులు తీసిన కాన్వే హాఫ్ సెంచరీ  పూర్తి చేసుకున్నాడు.   అదే ఓవర్లో  ఫిలిప్స్ కూడా  ఆఖరి రెండు బంతుల్లో 6,4 బాది అర్థ సెంచరీకి దగ్గరయ్యాడు. ఆ తర్వాత హర్షల్ పటేల్  వేసిన 15వ ఓవర్లో భారీ సిక్సర్ బాది  31 బంతుల్లోనే అర్థ సెంచరీ చేశాడు. 

కాన్వే - ఫిలిప్స్ కలిసి మూడో వికెట్ కు 86 పరుగులు జోడించారు.  ప్రమాదరకంగా పరిణమిస్తున్న ఈ జోడీని సిరాజ్ విడదీశాడు. సిరాజ్ వేసిన 16వ ఓవర్లో  ఐదో బంతికి ఫిలిప్స్.. భారీ షాట్ ఆడబోయి  భువనేశ్వర్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత కాన్వే.. అర్ష్దీప్ వేసిన 17వ ఓవర్లో  ఇషాన్ కిషన్ కు  చిక్కి వెనుదిరిగాడు. తన తర్వాత ఓవర్లో సిరాజ్.. నీషమ్ (0), సాంట్నర్ (1) ను ఔట్ చేయగా.. అర్ష్‌దీప్ తన చివరి ఓవర్లో తొలి బంతికి డారిల్ మిచెల్ (10), ఇష్ సోధి  (0) లను ఔట్ చేశాడు. మూడో బంతికి ఆడమ్ మిల్నే (0) రనౌట్ అయ్యాడు.  

16వ ఓవర్లో 146-3గా ఉన్న న్యూజిలాండ్ స్కోరు రెండు ఓవర్ల వ్యవధిలో  149-9గా మారింది.  చివరి ఓవర్లో.. హర్షల్ పటేల్ సౌథీ (6) ని బౌల్డ్ చేసి  కివీస్ ఇన్నింగ్స్ కు తెరదించాడు.  19.4 ఓవర్లలో కివీస్.. 160 పరుగులకే కుప్పకూలింది. 146-3 స్కోరుతో పటిష్ట స్థితిలో  ఉన్న కివీస్.. అనూహ్యంగా చివరి మూడు ఓవర్లలో దారుణంగా విఫలమవడం గమనార్హం. 

భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్.. నాలుగు ఓవర్లలో 37 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా మహ్మద్ సిరాజ్.. 4 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి 4 వికెట్లు  పడగొట్టాడు.  హర్షల్ కు ఒక వికెట్ దక్కింది. 

click me!