రాయ్‌పూర్‌లో రఫ్ఫాడిస్తున్న బౌలర్లు.. 15 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయిన కివీస్.. తొలి మ్యాచ్ హీరో మీదే ఆశలు

Published : Jan 21, 2023, 03:00 PM ISTUpdated : Jan 21, 2023, 03:01 PM IST
రాయ్‌పూర్‌లో రఫ్ఫాడిస్తున్న బౌలర్లు.. 15 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయిన కివీస్.. తొలి మ్యాచ్ హీరో మీదే ఆశలు

సారాంశం

INDvsNZ:  హైదరాబాద్ లో ముగిసిన తొలి వన్డేలో ఉత్కంఠ విజయాన్ని అందుకున్న భారత జట్టు రాయ్‌పూర్ వన్డేలోనూ అదరగొడుతున్నది.  టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన కివీస్.. 15 పరుగులకే సగం వికెట్లను చేజార్చుకుంది. 

తొలి వన్డేలో విఫలమైన  న్యూజిలాండ్ టాపార్డర్ బ్యాటర్లు మరోసారి అదే బాట పట్టారు.  రాయ్‌పూర్ వేదికగా భారత్ తో జరుగుతున్న  రెండో వన్డేలో  టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఆ జట్టు.. 15 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది.   రాయ్‌పూర్ వన్డేలో భారత పేసర్లు చెలరేగుతున్నారు. ఇప్పటివరకూ బౌలింగ్ వేసిన  నలుగురు బౌలర్లు   కివీస్ కు ఆరంభంలోనే చుక్కలు చూపించారు.  సగం మంది పెవిలియన్ కు  చేరడంతో   న్యూజిలాండ్ మరోసారి తొలి వన్డేలో ఆ జట్టును గెలిపించినంత పనిచేసిన మైకేల్ బ్రేస్‌వెల్ మీద గంపెడాశలు పెట్టుకుంది. 

రాయ్‌పూర్ లోని  షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న  రెండో వన్డేలో టాస్  గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ నమ్మకాన్ని  బౌలర్లు నిలబెడుతున్నారు.  తొలి ఓవర్లో  ఐదో బంతికే  ప్రమాదకర ఓపెనర్ ఫిన్ అలెన్ (0) ను మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. వికెట్ తీసిన షమీ  ఓవర్ లో పరుగులేమీ రాలేదు. 

పరుగుల ఖాతా తెరవకున్నా  వికెట్ల ఖాతా తెరిచిన  న్యూజిలాండ్..  ఐదు ఓవర్లకు చేసింది  8 పరుగులే. ఆరో ఓవర్ వేసిన  సిరాజ్.. నికోలస్  (20 బంతుల్లో 2) ను అద్భుతమైన లెంగ్త్ బాల్ తో బోల్తా కొట్టించాడు.  నికోలస్..  ఫస్ట్ స్లిప్ లో  శుభ్‌మన్ గిల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

షమీ  వేసిన ఏడో ఓవర్ తొలి బంతికి డారిల్ మిచెల్ (1) అతడికే క్యాచ్ ఇచ్చాడు.  ఏడు ఓవర్లకు కివీస్ 3 వికెట్లు కోల్పోయి  పది పరుగులే చేసింది.  పదో ఓవర్ వేసిన హార్ధిక్ పాండ్యా.. నాలుగో బంతికి   ఓపెనర్ డెవాన్ కాన్వే (16 బంతుల్లో 7, 1 ఫోర్) ను  ఔట్ చేశాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని హార్ధిక్ పక్కకు డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు.  

11వ ఓవర్  శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో కెప్టెన్ టామ్ లాథమ్ (17 బంతుల్లో 1) ఫస్ట్ స్లిప్స్ లో  గిల్ కు క్యాచ్ ఇచ్చి  పెవిలియన్ చేరాడు. ఫలితంగా కివీస్.. 11 ఓవర్లలో 15 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  

 

పీకల్లోతు కష్టాల్లో ఉన్న కివీస్ ఇన్నింగ్స్ ను గ్లెన్ ఫిలిప్స్ (15 బ్యాటింగ్), బైకేల్ బ్రేస్‌వెల్ (11 బ్యాటింగ్) ఆదుకునే యత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ జట్టు  17 ఓవర్లు ముగిసేసరికి  5 వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది. ఇక బ్రేస్‌వెల్, ఫిలిప్స్ తో  పాటు  స్పిన్ ఆల్ రౌండర్  మిచెల్ సాంట్నర్ కూడా బ్యాటింగ్ చేయగలడు.   మరి టాపార్డర్ పనిపట్టిన భారత బౌలర్లు  ఈ ముగ్గురినీ  త్వరగా ఔట్ చేసి  కివీస్ ఇన్నింగ్స్ ను ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది. లేకుంటే  హైదరాబాద్ లో బ్రేస్‌వెల్ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ  టీమిండియా ఫ్యాన్స్ కళ్లముందు మెదులుతూనే ఉంది.  

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !