హిట్‌మ్యాన్, శుభ్‌మన్ సెంచరీలు... ఇండోర్‌లో రెచ్చిపోయి ఆడుతున్న భారత్

By Srinivas MFirst Published Jan 24, 2023, 3:22 PM IST
Highlights

INDvsNZ 3rd ODI: భారత్ - న్యూజిలాండ్ మధ్య ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో  టీమిండియా రెచ్చిపోయి ఆడుతోంది.  చాలాకాలంగా శతకం  ముంగిట బోల్తా కొడుతున్న  కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు  సెంచరీ బాదాడు. అతడితో పాటు శుభ్‌మన్ గిల్ కూడా  శతకం పూర్తి చేసుకున్నాడు. 

‘నా నుంచి  సెంచరీలు రావడం లేదనే విషయం నాకు తెలుసు.   నేను దాని గురించి పెద్దగా ఆలోచించడం లేదు.  బౌలర్ల మీదకు ఎదురుదాడికి దిగి వారిపై ఒత్తిడి పెంచే దిశగా  నేను నా ఆటను మార్చుకుంటున్నా. త్వరలోనే నా నుంచి భారీ స్కోర్లను చూస్తారు..’  రెండో వన్డే తర్వాత  టీమిండియా సారథి  రోహిత్ అన్న మాటలివి. ఇచ్చిన మాటకు కట్టుబడ్డ   హిట్‌మ్యాన్..  సుమారు 52 ఇన్నింగ్స్ తర్వాత  అంతర్జాతీయ  కెరీర్ లో సెంచరీ బాదాడు.   రోహిత్ తో పాటు   సూపర్ ఫామ్ లో ఉన్న కొత్త కుర్రాడు శుభ్‌మన్ గిల్ కూడా  మరో శతకం   సాధించాడు. ఇద్దరూ కలిసి  దూకుడుగా ఆడుతుండటంతో ఇండోర్ లో పరుగుల వరద పారుతున్నది. 

రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ లో చివరిసారి  సెంచరీ చేసింది 2021లో.  ఆ ఏడాది భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లగా.. అక్కడ  నాలుగో టెస్టులో  రోహిత్ సెంచరీ బాదాడు. ఇంటర్నేషనల్ లెవల్ లో దీని తర్వాత అతడు సెంచరీ చేయలేదు. వన్డేలలో అయితే  రోహిత్ చివరిసారిగా సెంచరీ చేసింది 2020 జనవరి 19న.  బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో చేసిందే వన్డేలలో అతడి చివరి సెంచరీ.  మూడేండ్ల తర్వాత హిట్‌మ్యాన్  వన్డేలలో  సెంచరీ  పూర్తి చేశాడు. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన భారత్.. ఆది నుంచి దూకుడుగానే ఆడింది.    ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ - శుభ్‌మన్ తన సూపర్ ఫామ్ ను కొనసాగించారు.  క్రీజులోకి వచ్చి రెండు మూడు ఓవర్లు మాత్రమే  కాస్త నెమ్మదిగా ఆడారు.  ఆ తర్వాత బంతి గమనాన్ని అంచనా వేసిన ఇద్దరూ  ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు.  

శుభ్‌మన్ గిల్ 33 బంతుల్లోనే  హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని  దూకుడుగా ఆడాడు.  రోహిత్ కాస్త నెమ్మదిగా ఆడిన  40లలోకి వచ్చాక  బ్యాట్ కు పనిచెప్పాడు. పది ఓవర్లలోనే భారత్ స్కోరు వికెట్ నష్టపోకుండా 82 పరుగులు చేసింది.  సాంట్నర్ వేసిన  భారత ఇన్నింగ్స్ 13.1 ఓవర్లో  సిక్సర్ బాదిన  హిట్ మ్యాన్.. 41 బంతుల్లో తన అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  ఆ తర్వాత కూడా అదే ఊపు కొనసాగించాడు.  15 ఓవర్లకే భారత్ స్కోరు  128-0గా ఉంది. 

అర్థ సెంచరీలు పూర్తయ్యాక ఈ ఇద్దరూ   ఫోర్లు, సిక్సర్లతో కివీస్  బౌలర్లకు చుక్కలు చూపించారు.టిక్నర్ వేసిన 26వ ఓవర్లో ఈ ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.  83 బంతుల్లోనే రోహిత్ సెంచరీ పూర్తయింది.  వన్డేలలో రోహిత్ కు ఇది 30వ సెంచరీ.   84 బంతుల్లో శుభ్‌మన్ సెంచరీ చేశాడు. 

ఈ ఇద్దరి విజృంభణతో  భారత్.. 26 ఓవర్లలోనే వికెట్లేమీ నష్టపోకుండా 212 పరుగులు చేసింది.   చేతిలో వికెట్లు, కావల్సినన్ని ఓవర్లు కూడా మిగిలిఉండటంతో  భారత్ ఈ మ్యాచ్ లో 500 పరుగుల మీద కన్నేసింది. 

click me!