INDvsNZ 2nd Test: పేకమేడలా కూలిన న్యూజిలాండ్... తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే ఆలౌట్...

By Chinthakindhi RamuFirst Published Dec 4, 2021, 3:43 PM IST
Highlights

India vs New Zealand:  తొలి ఇన్నింగ్స్‌లో 28.1 ఓవర్లలో 62 పరుగులకి ఆలౌట్ అయిన న్యూజిలాండ్... భారత జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగుల భారీ ఆధిక్యం... ఫాలో-ఆన్ అవకాశం ఉన్నా, బ్యాటింగ్ చేసేందుకు విరాట్ కోహ్లీ మొగ్గు...

అజాజ్ పటేల్ 10 వికెట్లు తీశాడనో, లేక అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్ చేశాడనో తెలీదు కానీ ముంబై టెస్టులో భారత బౌలర్లు, కివీస్ బ్యాట్స్‌మెన్‌కి చుక్కలు చూపించాడు. 28.1 ఓవర్లలోనే 62 పరుగులకే ఆలౌట్ చేశారు.  రెండో రోజు రెండో సెషన్‌లో తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్, నాలుగో ఓవర్ నుంచే వరుస వికెట్లు కోల్పోయింది...

భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ఒకే ఓవర్లో కివీస్ ఓపెనర్లు ఇద్దరినీ పెవిలియన్ చేర్చాడు. 4 పరుగులు చేసిన విల్ యంగ్‌ను, నాలుగో ఓవర్ మొదటి బంతికి పెవిలియన్ చేర్చిన సిరాజ్, అదే ఓవర్‌లో ఆఖరి బంతికి 10 పరుగులు చేసిన టామ్ లాథమ్‌ను అవుట్ చేశాడు...

ఇదీ చదవండి: ఇదేం చెత్త అంపైరింగ్, బ్యాటుకి తగులుతున్నట్టు కనిపించినా... విరాట్ కోహ్లీ అవుట్‌పై వివాదం...

ఆ తర్వాత సీనియర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ కూడా సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడంతో 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. ఆ తర్వాత 8 పరుగులు చేసిన డార్ల్ మిచెల్‌ను అక్షర్ పటేల్ అవుట్ చేయగా, 31 బంతుల్లో 7 పరుగులు చేసిన హెన్రీ నికోలస్‌ను మొదటి బంతికే క్లీన్‌బౌల్డ్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్..

రచిన్ రవీంద్ర 15 బంతుల్లో 4 పరుగులు చేసి జయంత్ యాదవ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 16.4 ఓవర్లలో 38 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి టీ బ్రేక్‌కి వెళ్లింది న్యూజిలాండ్ జట్టు. 

ఆ తర్వాత జయంత్ యాదవ్ వేసిన ఓవర్‌లో శుబ్‌మన్ గిల్ క్యాచ్ డ్రాప్ చేయడం, అది నో బాల్‌గా తేలడం జరిగిపోయింది. అప్పటికే ఓసారి గాయపడి, ఫిజియో చికిత్స తీసుకుని ఫీల్డ్ మీదకి వచ్చిన శుబ్‌మన్ గిల్, క్యాచ్ అందుకునే క్రమంలో మరోసారి గాయపడి పెవిలియన్ చేరాడు. ఆ ఓవర్‌లో రెండు ఫోర్లతో 12 పరుగులు రావడంతో కివీస్ స్కోరు 50 పరుగులను దాటగలిగింది. 

ఆ తర్వాత 24 బంతుల్లో 8 పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్లండెల్, అశ్విన్ బౌలింగ్‌లో ఛతేశ్వర్ పూజారాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. బ్లండెల్ అవుటైన రెండో బంతికే టిమ్ సౌథీ కూడా పెవిలియన్ చేరాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు టిమ్ సౌథీ...

26 బంతులాడిన ఒక్క పరుగు కూడా చేయలేకపోయిన విలియం సోవర్‌విల్లే, అశ్విన్ బౌలింగ్‌లో సిరాజ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.  అక్షర్ పటేల్ బౌలింగ్ 17 పరుగులు చేసిన జెమ్మీసన్ అవుట్ కావడంతో 62 పరుగులకే కుప్పకూలింది న్యూజిలాండ్. 

Read Also: ఆ సమయంలో విరాట్ కోహ్లీతో ఆ అంపైర్‌కి గొడవలు... ఆ పగతోనే అవుట్ ఇచ్చాడా...

భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 8 ఓవర్లు బౌలింగ్ చేసి 8 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ 9.1 ఓవర్లలో 14 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. సిరాజ్ 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు...

న్యూజిలాండ్‌కి టెస్టుల్లో ఇదే అత్యల్ప స్కోరు కాగా, భారత జట్టుపై ఇదే అత్యల్ప స్కోరు. ఇంతకుముందు 2015లో సౌతాఫ్రికా 79 పరుగులకి ఆలౌట్ కాగా, ఆ రికార్డును న్యూజిలాండ్ బ్రేక్ చేసింది. ఫాలో ఆన్ అవకాశం ఉన్నా, భారత జట్టు ఆ నిర్ణయం తీసుకోలేదు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపాడు విరాట్ కోహ్లీ...

click me!