INDvsNZ 2nd T20I: అదరగొట్టిన భారత బౌలర్లు... టీమిండియా ముందు...

By Chinthakindhi RamuFirst Published Nov 19, 2021, 8:58 PM IST
Highlights

India vs New Zealand: నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసిన న్యూజిలాండ్... మొదటి మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన హర్షల్ పటేల్... 

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌కి శుభారంభం అందించారు కివీస్ ఓపెనర్లు. మార్టిన్ గప్టిల్, డార్ల్ మిచెల్ కలిసి మొదటి వికెట్‌కి 48 పరుగుల భాగస్వామ్యం అందించారు. 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసిన మార్టిన్ గప్టిల్, దీపక్ చాహార్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

Read: అతను ముందే చెప్పాడు, నేనే నమ్మలేదు... హర్భజన్ సింగ్‌పై వెంకటేశ్ అయ్యర్ కామెంట్...

ఈ దశలో టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీని అధిగమించి, టాప్‌లోకి దూసుకెళ్లాడు గప్టిల్. విరాట్ కోహ్లీ 91 టీ20 మ్యాచుల్లో 29 హాఫ్ సెంచరీలతో 3216 పరుగులు చేయగా మార్టిన్ గప్టిల్, 111 టీ20 మ్యాచుల్లో 3248 పరుగులు చేసి టాప్‌ ప్లేస్‌ని అధిరోహించాడు.

ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన మార్క్ ఛాప్‌మన్ 17 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  డార్ల్ మిచెల్ 28 బంతుల్లో 3 ఫోర్లతో 31 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

15 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసిన వికెట్ కీపర్ టిమ్ సిఫర్ట్‌, అశ్విన్ బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 1 పరుగు వద్ద ఉన్నప్పుడు అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్ క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన గ్లెన్ ఫిలిప్స్, ఆ తర్వాత భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు...

21 బంతుల్లో ఓ ఫోర్, మూడు సిక్సర్లతో 34 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ రుతురాజ్ గైక్వాడ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

ఈ ఏడాది టీ20ల్లో 97 సిక్సర్లు బాదిన గ్లెన్ ఫిలిప్స్, అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇంతకుముందు గత 10 ఏళ్లల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లుగా విండీస్ బ్యాట్స్‌మెన్లు మాత్రమే ఉండగా ఫిలిప్, ఆ రికార్డును తిరగరాశాడు.

12 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసిన జేమ్స్ నీషమ్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే రిషబ్ పంత్ సరిగా అప్పీలు చేయకపోవడంతో అంపైర్ అనిల్ కుమార్ చౌదరీ ఎలాంటి సిగ్నల్ ఇవ్వలేదు. అయితే భువనేశ్వర్ కుమార్ రివ్యూకి వెళ్లాలని భావించినా, జేమ్స్ నీశమ్ డీఆర్‌ఎస్ కోసం ఎదురుచూడకుండా పెవిలియన్‌కి వెళ్లిపోయాడు... 

15 ఓవర్లు ముగిసేసరికి 125 పరుగులు చేసిన న్యూజిలాండ్, 160-170 పరుగులు ఈజీగా చేస్తుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కివీస్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. 

టీ20ల్లో రీఎంట్రీ తర్వాత అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్న రవిచంద్రన్ అశ్విన్, నాలుగు ఓవర్లలో 19 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. ఆరంగ్రేట మ్యాచ్ ఆడుతున్న హర్షల్ పటేల్ 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.  

click me!