INDvsNZ 1st Test: వృద్ధిమాన్ సాహా స్థానంలో కెఎస్ భరత్ వికెట్ కీపింగ్... మూడో రోజు టీమిండియాకి...

By Chinthakindhi RamuFirst Published Nov 27, 2021, 10:01 AM IST
Highlights

India vs New Zealand 1st Test: మెడ పట్టేయడంతో మూడో రోజు ఫీల్డ్‌లోకి రాని వృద్ధిమాన్ సాహా... సాహా స్థానంలో వికెట్ కీపింగ్ చేస్తున్న శ్రీకర్ భరత్... ఒక్క వికెట్ కోసం టీమిండియా ఎదురుచూపులు...

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అసలే వికెట్ దొరక్క, భారత బౌలర్లు, టీమిండియా తీవ్ర అసహనానికి గురి అవుతుంటే... వారికి మరో ఇబ్బంది ఎదురైంది. సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా మెడ పట్టేయడంతో మూడో రోజు ఫీల్డ్‌కి రాలేదు. అతని స్థానంలో యంగ్ వికెట్ కీపర్, తెలుగు కుర్రాడు కోన శ్రీకర్ భరత్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు...

37 ఏళ్ల వృద్ధిమాన్ సాహా ఫిట్‌నెస్‌పై అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే రిషబ్ పంత్‌కి రెస్ట్ ఇవ్వడంతో మరో ఆప్షన్ లేక సీనియర్ వికెట్ కీపర్‌గా వృద్ధిమాన్ సాహాకి మరో అవకాశం ఇవ్వాలని భావించింది టీమిండియా. బ్యాటింగ్‌లో 12 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసిన వృద్ధిమాన్ సాహా, మూడో రోజు ఉదయానికి మెడ పట్టేయడంతో కీపింగ్‌ కూడా చేయాలని పరిస్థితి వచ్చింది...

వృద్ధిమాన్ సాహా ఫిట్‌నెస్‌‌ను పర్యవేక్షిస్తున్న బీసీసీఐ మెడికల్ టీమ్, ఈరోజు రెండో సెషన్‌లో లేదా మూడో సెషన్ సమయానికి ఫీల్డ్‌లో దించే ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ సాహా సమస్య తీవ్రమైతే కంకూషన్ సబ్‌స్ట్రిట్యూట్‌గా రెండో ఇన్నింగ్స్‌లో కోన శ్రీకర్ భరత్‌కి తొలి టెస్టు ఆడే అవకాశం దొరుకుతుంది.

గత నాలుగేళ్లుగా ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన వృద్ధిమాన్ సాహా, ఆడిలైడ్ టెస్టు తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 2017 నుంచి 14 ఇన్నింగ్స్‌లు ఆడిన వృద్ధిమాన్ సాహా, 14.18 సగటుతో 156 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. అత్యధిక స్కోరు 29 పరుగులు మాత్రమే...

న్యూజిలాండ్ ఓపెనర్లు క్రీజులో పాతుకుపోవడంతో ఒక్క వికెట్ తీయడానికి భారత బౌలర్లు చెమటోడ్చాల్సి వస్తోంది. 63 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 143 పరుగులు చేసింది న్యూజిలాండ్. కాన్పూర్ టెస్టులో రెండో రోజు పూర్తిగా కివీస్ ఆధిక్యమే కొనసాగింది. న్యూజిలాండ్ ఓపెనర్లు క్రీజులో పాతుకుపోయి, భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. 

విల్ యంగ్ 85 పరుగులు చేయగా, టామ్ లాథమ్ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ 63 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి, ఐదేళ్ల తర్వాత భారత్‌లో 50+ ఓవర్లు బ్యాటింగ్ చేసిన పర్యాటక జట్టు ఓపెనర్లుగా నిలిచారు. 

అంతకుముందు భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 111.1 ఓవర్లలో 345 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓవర్‌ నైట్ స్కోరు 258/4 వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు, రవీంద్ర జడేజా వికెట్ త్వరగా కోల్పోయింది. 112 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, ఓవర్‌నైట్ స్కోరుకి పరుగులేమీ జోడించకుండానే పెవిలియన్ చేరాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు జడ్డూ...

 157 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ మార్కు అందుకున్నాడు శ్రేయాస్ అయ్యర్. ఈ శతాబ్దంలో తొలి టెస్టులో సెంచరీ చేసిన ఆరో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు శ్రేయాస్ అయ్యర్. 2001లో వీరేంద్ర సెహ్వాగ్, 2010లో సురేష్ రైనా, 2013లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, 2018లో పృథ్వీషా ఈ ఫీట్ సాధించారు. 

ఓవరాల్‌గా ఆరంగ్రేట టెస్టులో సెంచరీ చేసిన 16వ భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్. 2016 తర్వాత స్వదేశంలో సెంచరీ చేసిన నెం.5 బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు అయ్యర్. ఇంతకుముందు అజింకా రహానే రెండుసార్లు, కరణ్ నాయర్ (త్రిబుల్ సెంచరీ) మాత్రమే ఈ ఫీట్ సాధించారు.

click me!